ధన్యతలు 6వ భాగము—కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు

(English version: “Blessed Are The Merciful”)
మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్‌లో ఇది ఆరవది. ఇక్కడ యేసు ప్రభువు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను యేసు వివరించారు. ఈ ప్రచురణలో మత్తయి 5:7లో “కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు” అని వివరించబడిన కనికరం అనే ఐదవ వైఖరిని మనం పరిశీలిస్తాము.
*******************
జార్జియాలో జాన్ వెస్లీ మిషనరీగా ఉన్నప్పుడు, గవర్నర్ జేమ్స్ ఓగ్లేథోర్ప్ దగ్గర ఉన్న బానిస ఒక గ్లాసు వైన్ దొంగిలించి తాగాడు. ఓగ్లెథోర్ప్ ఆ వ్యక్తిని శిక్షించాలనుకున్నాడు, అయితే వెస్లీ ఓగ్లెథోర్ప్ దగ్గరకు వెళ్లి ఆ బానిస కోసం ప్రాధేయపడ్డాడు.
దానికి గవర్నర్, నాకు ప్రతీకారం కావాలి. నేను ఎప్పటికీ క్షమించను అన్నాడు. అందుకు జాన్ వెస్లీ, “సార్, మీరు ఎప్పుడూ పాపం చేయకూడదని నేను దేవుని వేడుకుంటున్నాను” అన్నాడు.
వెస్లీ కాలంలోనే కాదు యేసు కాలంలో కూడా కనికరాన్ని తరచుగా నిర్లక్ష్యం చేసేవారు. గ్రీకులు రోమన్లు కనికరం చూపడం అంటే ఒక బలహీనతగా భావించేవారు. ఒక రోమన్ తత్వవేత్త “కనికరం అనేది ఆత్మ యొక్క వ్యాధి” అన్నాడు.
ఆ విధమైన సంస్కృతి ఉన్న సమయంలో యేసు “కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు” [మత్తయి 5:7] అనే ఈ దిగ్భ్రాంతికరమైన మాటలు చెప్పారు. మనల్ని బాధపెట్టే వారిపట్ల ప్రతీకారాన్ని, ద్వేషాన్ని, ఉదాసీనతను పెంచే మన సంస్కృతికి కూడా ఈ మాటలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. అయినప్పటికీ, కనికరం కలిగివుండమని యేసు తన అనుచరులకు పిలుపునిచ్చారు. ఇది సంస్కృతికి భిన్నమైన జీవనానికి మరో పిలుపు!
కనికరం అనేది ఆత్మ యొక్క వ్యాధి కాదు గాని పాపమనే వ్యాధిలేని ఆత్మకు గుర్తు అని యేసు చెప్పారు. అలాంటి జీవనశైలి దేవుని ఆమోదాన్ని పొందే ధన్యమైన జీవితము!
కనికరం నిర్వచనము.
“మెర్సీ” అనేది ఆంగ్ల భాషలోని అత్యంత అందమైన పదాలలో ఒకటి. ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసంలో అత్యంత విలువైన సత్యాలలో కనికరం ఒకటి. ఒక గ్రీకు నిఘంటువులో కనికరం అంటే కరుణ ముఖ్యంగా అవసరంలో ఉన్న వారిపట్ల దయ చూపడం అనే నైతిక లక్షణం అని వివరించబడింది. ఇది మానవ దయను, మానవజాతి పట్ల దేవునికి ఉన్న దయను సూచిస్తుంది.
కనికరం అనే ఈ పదాన్ని బాగా అర్థం చేసుకోవడానికి క్రింది కథనం మనకు సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.
అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యాన్ని విడిచిపెట్టిన ఒక సైనికుడు వారికి మరలా పట్టుబడ్డాడు. అతనికి మరణశిక్ష విధించడంతో అతని తల్లి వచ్చి అలెగ్జాండర్‌తో, దయచేసి కనికరం చూపమని పదే పదే వేడుకుంది. కాని అలెగ్జాండర్ అతడు కనికరానికి పాత్రుడు కాడని జవాబిచ్చాడు.
తెలివైన ఆ తల్లి, అతడు దానికి అర్హుడైతే అది కనికరం అవ్వదని చెప్పింది.
కాబట్టి, కనికరం అనేది ఒక వ్యక్తికి ఉన్న అర్హతను బట్టి ఇచ్చేది లేదా పొందేది కాదు. కనికరం అనేది ఆధ్యాత్మిక, శారీరక లేదా భావోద్వేగ అవసరాలలో ఉన్నవారి పట్ల చూపించే ఒక స్పందన. “కనికరం బాధను అర్థం చేసుకుంటుంది; బాధను అనుభవిస్తుంది మరియు గాయాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తుంది” అని ఒక రచయిత వర్ణించాడు. మరో మాటలో చెప్పాలంటే, కనికరం అనేది మనస్సును కలిగి ఉంటుంది, అది బాధను అర్థం చేసుకుంటుంది; ఇది బాధను అనుభూతి చెందే భావోద్వేగాలను కలిగి ఉంటుంది మరియు గాయాన్ని నయం చేయాలనే సంకల్పాన్ని కలిగివుంటుంది.
దేవుని కనికరాన్ని చూపించండి.
దేవుడు మనపట్ల కనికరాన్ని ఎలా చూపించారు? పాపం మనల్ని ఎలా బాధపెడుతుందో చూసి కనికరంతో కదిలి, మన పాపాన్ని నయం చేయడానికి తన కుమారుడిని పంపారు. దేవుడు మన పాపానికి తగిన తీర్పు మనకు ఇవ్వలేదు కాని కనికరంతో మనకు తీర్పు ఇవ్వకండా, ఆయన వైపు తిరిగిన వారందరికి నూతనమైన జన్మను ఇచ్చారు. అందుకే పేతురు “మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను” [1 పేతురు 1:3] అని వ్రాశాడు. పౌలు దేవుడు కరుణాసంపన్నుడని వర్ణించాడు [ఎఫెసి 2:4]. హెబ్రీయుల పుస్తక రచయిత “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” [హెబ్రీ 4:16] అని చెబుతూ దేవుని కృపా సింహాసనం వద్దకు నమ్మకంగా వెళ్లమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
మీకా 7:18లో పాత నిబంధన ప్రవక్త మీకా దేవుని కనికరాన్ని వర్ణించిన విధానం నాకు చాలా ఇష్టము. “తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.” పాపులమైన మనం దేవుని తీర్పుకు తప్ప మరి దేనికీ అర్హులం కాము. అయినప్పటికీ, దేవుడు ఆ తీర్పును నిలుపుదల చేయడమే కాకుండా, కనికరాన్ని చూపించడానికి సంతోషిస్తున్నాడని మీకా చెప్పాడు. మనం ఆయనను చాలా తీవ్రంగా బాధించినప్పటికీ ఆయన వెనుకాడడు.
మనం కనికరాన్ని చూపించాల్సిన అవసరం ఉంది.
అదే మీకా ముందు అధ్యాయంలో, “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు” [మీకా 6:8]. అని చెప్పాడు. దేవుడు తన ప్రజల నుండి ఏమి కోరుతున్నాడో మీరు గమనించారా? న్యాయంగా ప్రవర్తించండి, కనికరాన్ని ప్రేమించండి మరియు వినయంగా నడుచుకోండి. కనికరాన్ని ప్రేమించండి అనే రెండవ అంశంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. కనికరం చూపడానికి ఇష్టపడే అదే దేవుడు [మీకా 7:18] తన ప్రజలను కేవలం కనికరం చూపమని మాత్రమే కాకుండా కనికరాన్ని ప్రేమించమని కోరుతున్నాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని కనికరాన్ని పొందిన వారు ఇతరులకు కనికరాన్ని చూపేటప్పుడు దేవుడు తమ పట్ల కలిగివున్న అదే దృక్పథంతో అదే రకమైన కనికరాన్ని చూపించాలి. యేసు మత్తయి 5:7లో అలాగే లూకా 6:36లో “మీ తండ్రి కనికరం ఉన్నట్లే కనికరం కలిగి ఉండుమని” పేర్కొన్నారు.
కనికరం పొందిన నిజ క్రైస్తవుల జీవనశైలిని యేసు ఈ ధన్యతలలో వివరిస్తున్నారని గుర్తుంచుకోండి. కానీ వారు నిజంగా కనికరాన్ని పొందారని వారికి ఎలా తెలుస్తుంది? వారు ఇతరులకు చూపించే కనికరం ద్వారా తెలుస్తుంది. ఇటువంటి కనికరాన్ని కలిగినవారు దేవుని ఆమోదం పొందారని యేసు చెప్పారు. వీరిపై దేవుని అనుగ్రహం ఉంటుంది. వారు ధన్యులు. వారు భవిష్యత్తులో దేవుని రక్షణ కనికరాన్ని పూర్తిగా అనుభవిస్తారు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు “వారు కనికరించబడతారు.”
కనికరం చూపకపోతే కలిగే ప్రమాదము.
కనికరాన్ని చూపించడానికి నిరాకరిస్తే లోతైన చిక్కులు ఎదురవుతాయి. కనికరం గలవారు మాత్రమే కనికరం పొందుతారని యేసు ఇక్కడ చెప్పారు. యాకోబు వ్రాసిన పత్రికలో ఈ విషయాన్ని చెప్పడానికి చాలా బలమైన భాషను ఉపయోగించాడు. యాకోబు 2:12-13, “స్వాతంత్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.” కనికరం మరియు తీర్పు రెండు వ్యతిరేకమైనవి. మనం ఏమి పొందుకున్నామో దానినే ఇవ్వాలి, దానిని బట్టే భవిష్యత్తులో మనం పొందుకోబోయేది ఆధారపడి ఉంటుంది.
మనం దేవుని కనికరాన్ని పొందితే ఈ జీవితంలో దానిని ఇతరులకు అందిస్తాము, భవిష్యత్తులో కూడా దేవుని కనికరాన్ని సంపూర్ణంగా పొందుతాము. కానీ మనం దేవుని కనికరాన్ని పొందకపోతే ఈ జీవితంలో మనం దానిని ఇతరులకు ఇవ్వము, భవిష్యత్తులో ఆయన కనికరాన్ని పొందలేము. మనం భవిష్యత్తులో ఆయన తీర్పును మాత్రమే పొందుతాము. అదే యాకోబు ఉద్దేశము.
లోకానికి ప్రతీకారం రుచికరంగా ఉంటుంది. ఎలా పగ తీర్చుకోవాలో ప్లాన్ చేసుకుంటూ రాత్రంతా మేల్కొని ఉంటుంది. అయితే క్రైస్తవులుగా మనం ప్రతీకార ఆలోచనలను అసహ్యించుకోవాలి. అవసరమైన వారిపట్ల కనికరం చూపడంలో సంతోషించాలి. వారి చెడు పనులను ఆమోదించకుండా కనికరం చూపడం ద్వారా వారు చెడు నుండి బయటపడేందుకు మనం వారికి సహాయపడగలము. వాస్తవానికి, పశ్చాత్తాపం లేకుండా నిజమైన సయోధ్య జరగదు. కానీ అవతలి వ్యక్తిని కదిలించి క్షమాపణను వెదికేలా చేసి తద్వారా రాజీపరచే శక్తి కనికరానికి ఉంది.
కనికరం యొక్క అందము.
కనికరం ఒక అందమైన విషయం. అది లేకపోతే మీరు నేను నరకంలో శాశ్వతంగా నాశనమవుతాము. దేవుడు తన కనికరంతో మీరు నేను నిత్యమైన హింసకు బదులుగా శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడానికి క్రీస్తు ద్వారా ఒక మార్గాన్ని సృష్టించారు. మనం అలాంటి కనికరంగల దృక్పథాన్ని జీవన విధానంగా కలిగి ఉన్నప్పుడు, మనం దేవుని రక్షణ కనికరాన్ని పొందామని భవిష్యత్తులో మనం దానిని సంపూర్ణంగా పొందుకుంటామని స్పష్టంగా చూపిస్తాము. అది మన యథార్థమైన రక్షణకు దృఢమైన భరోసాగా ఉంటుంది. తప్పులు ఎంచే స్వభావం వలన వివాహంతో సహా అన్ని బంధాలలో ఉండే ఆత్మీయత నాశనమవుతుంది. భార్యాభర్తలలో ఒకరు లేదా ఇద్దరూ ఎప్పుడు ఎదుటివారి తప్పులు ఎంచుతూ ఉంటే వారి మధ్య సాన్నిహిత్యం ఎలా పెరుగుతుంది? ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాలని కోరుకుంటారు.
అందుకే ప్రవక్తయైన మీకా చెప్పినట్లుగా మనం “కనికరాన్ని ప్రేమించాలి.” ఇదే దేవుని చిత్తము. మనం ఆయన మార్గాలను అనుకరించాలని ఆయన కోరుకుంటున్నారు. దానిని చూపించడానికి మన ఇల్లును మించిన మంచి ప్రదేశం లేదు. ముఖ్యంగా మన జీవిత భాగస్వాములతో మనకున్న బంధాలలో దానిని చూపించాలి.
భార్య కొత్త కారు నడుపుతూ ప్రమాదానికి గురైంది. తన భర్త ఏమి అంటాడో అని కంగారుపడి ఆందోళనతో భీమా పత్రాలను తీసుకోవడానికి అల్మారా తెరిచింది.
ఆమె దానిని బయటకు తీస్తుండగా “ప్రియమైన మేరీ, నీకు ఈ పత్రాలు అవసరమైనప్పుడు నేను ప్రేమిస్తున్నది కారును కాదు నిన్ను అని గుర్తుంచుకో!” అని భర్త రాసి ఉంచిన ఉత్తరాన్ని చూసింది.
మనమందరం గందరగోళానికి గురైన లోపాలు గల పాపులము. అందుకే కనికరం లేకుండా బంధాలు నిలబడలేవు. కనికరం లేని చోట నిజమైన ఆత్మీయత ఉండదు. వివాహబంధాన్ని కొనసాగిస్తూ ఆ జంట దశాబ్దాలుగా కలిసి ఉండవచ్చును కానీ అది ఆరోగ్యకరమైన వివాహబంధం కాదు. ఇది సాన్నిహిత్యం పెంచే వివాహబంధం కాదు.
ఒక వ్యక్తి తన భార్యకు తన మధ్య జరిగిన వాదన గురించి తన పాస్టర్‌కి చెప్పాడు.ఆ పాస్టర్ వివరాలు అడిగినప్పుడు, అతడు, “మేము గొడవపడిన ప్రతిసారీ, నా భార్య చరిత్రంతా చెబుతుంది. 20-30 సంవత్సరాల క్రితం జరిగిన పాత విషయాలన్ని ప్రస్తావిస్తుంది” అన్నాడు.
ఈ విధంగా పాత విషయాలన్నిటిని ప్రస్తావిస్తూ ఉంటుంటే అక్కడ నిజమైన సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం లేదని గుర్తించుకోండి. ఆరోగ్యకరమైన బంధాలకు అవకాశం ఉండదు. అందుకే కనికరం అనేది ఆరోగ్యకరమైన బంధాలకు చాలా ముఖ్యము. కనికరం ద్వారానే మనకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది. కనికరం ద్వారానే మనం ఇతరులతో సంబంధాలు కలిగి ఉండగలము.
కనికరం చూపించడంలో ఎలా ఎదగాలి.
మనం కనికరాన్ని ఎలా ప్రేమించగలం? కనికరం చూపించడంలో మనం ఎలా ఆనందించవచ్చు? మన పాపాన్ని మరియు మన పాపక్షమాపణకు వెల చెల్లించడానికి దేవుని కుమారుడు సిలువపై బాధ పడిన ఫలితంగా మనం పొందుతున్న క్షమాపణను నిరంతరం చూడటం ద్వారా కనికరాన్ని ప్రేమించి దానిలో ఆనందిమచగలము. నేను నరకానికి అర్హుడిని అయినప్పటికీ దేవుడు ఘోర పాపినైన నాపై కనికరపడి ఇంకా కనికరిస్తునే ఉన్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. యేసు నేను నిన్ను చూసినప్పుడు కనికరం యొక్క పూర్తి స్వరూపాన్ని చూస్తున్నాను. మీలా ఉండేందుకు నాకు సహాయం చేయండి అని వేడుకోవాలి.
మనం అలాంటి వైఖరిని అనుసరించినప్పుడు, “నన్ను బాధపెట్టినవాడిపై నేను కనికరం చూపించలేను” అని చెప్పలేము. మనం సిలువను చూస్తూ, మన పాపాల కొరకు సిలువ వేయబడిన రక్తం కార్చి బాధను అనుభవిస్తున్న రక్షకుని చూస్తూ, “నేను వారిని క్షమించలేను. వారు నన్ను ఎంత బాధపెట్టారో మీకు తెలియదు. వారు కనికరానికి అర్హులు కారు” అని చెప్పలేము. వారు అర్హులైతే అది కనికరమెలా అవుతుంది! నిజమే కదా?
మనం మన పాపాన్ని, సిలువపై ఉన్న యేసును ఎంత ఎక్కువగా చూస్తామో అంత ఎక్కువగా మన కఠిన హృదయాలు కరిగిపోతాయి. అనంతమైన పరిశుద్ధ దేవుని మనం ఎంతగా కించపరిచనప్పటికి ఆయన మనపై ఎంత గొప్ప కనికరాన్ని చూపించారు. ఇంకా ఆయన కనికరం మనకు ప్రతిరోజూ ఎంతో అవసరము. మనం దానిని గ్రహించి మనకు వ్యతిరేకంగా చేసిన చిన్న పెద్ద తప్పులను వదిలివేయడానికి మనం ఎంత ఎక్కువగా ఇష్టపడితే అంత ఎక్కువగా ఇతరులకు కనికరాన్ని చూపించాలనే కోరికలో మనం ఎదుగుతాము.
ముగింపు మాటలు.
మీ జీవితంలో మీరు ఎవరి మీదనైనా కనికరం చూపాల్సిన అవసరం ఉందా? అయితే వారికి చూపించండి. కనికరం చూపించడం నా బాధ్యత అని భావించే వైఖరితో అయిష్టంగా అందించడం కాదు, దానికి బదులుగా, “నేను కనికరం చూపగలను. నేను ఉచితంగా పొందాను, ఉచితంగా ఇస్తాను” అనే వైఖరితో చేయండి! కానీ మీరు కనికరాన్ని ప్రేమించినప్పుడే అది జరుగుతుంది. మీరు మీ స్వంత జీవితంలో దేవుని కనికరాన్ని మరి ఎక్కువగా ప్రతిబింబిస్తేనే మీరు కనికరాన్ని ప్రేమించగలరు [రోమా 12:1-2].
కనికరం చూపడం ఒక ఎంపిక కాదని విమోచించబడిన హృదయానికి ఇది స్పష్టమైన రుజువని గుర్తుంచుకోండి. ఆత్మ విషయంలో దీనులుగా ఉండి మన పాపాల గురించి దుఃఖించి సాత్వికతతో కనికరం కోసం క్రీస్తు వైపు తిరిగినప్పుడు మన కొత్త జన్మ ప్రారంభమైనప్పుడు కనికరాన్ని పొందుతాము. ఆయన మనలను రక్షించిన వెంటనే ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం ద్వారా అనగా మన అనుదిన జీవితంలో దేవుని నీతిని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా ఆయన మనలో కార్యం చేస్తారు. మనల్ని కించపరిచే వారిని మనం కనికరించాలనే దేవుని ఆజ్ఞతో దీనిని ప్రారంభించాలి.
మీరు వ్యక్తిగతంగా రక్షణ కనికరాన్ని పొందారా? అని మిమ్మల్ని అడుగుతున్నాను. బహుశా మీరు దానిని పొందకపోతే దాని అవసరం ఉన్నవారిపై మీరు కనికరాన్ని చూపించలేరు. బహుశా మీరు మీ పాపం యొక్క వికృత రూపాన్ని చూడలేదు కాబట్టి కనికరం కొరకు ఎప్పుడూ సిలువ దగ్గరకు వెళ్లలేదు. అదే నిజమైతే, మీ పాపాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడడానికి కళ్ళు తెరవమని దేవుడిని అడగండి. మిమ్మల్ని సిలువ దగ్గరకు తీసుకెళ్లమని అడగండి. మీపై కనికరం చూపమని అడగండి. అది ప్రారంభము. అప్పుడు ఇతరులపట్ల కనికరం చూపించే శక్తి నీకు లభిస్తుంది. క్రీస్తు వైపు తిరిగేలా వారికి సహాయం చేయడంలో అది చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది.
కొండమీది ప్రసంగంలోని బోధలు మనం నిజంగా దేవుని పిల్లలమా కాదా అని చూడడానికి యేసు పట్టుకున్న అద్దం అని గుర్తుంచుకోండి. మీరు నిజంగా దేవుని బిడ్డవా? అలాగైతే, ఈ ధన్యతలో యేసు చెప్పిన ఈ మాటలు మీకు వర్తిస్తాయని మీరు నమ్మాలి.
కనికరం గలవారు నిజంగా ధన్యులు, ఎందుకంటే కనికరం యొక్క పూర్తి స్వరూపమైన యేసు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు కేవలం వారు మాత్రమే కనికరాన్ని పొందుతారు.