ధన్యతలు 2వ భాగము ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు

(English Version: “The Beatitudes – Blessed Are The Poor In Spirit”)
ధన్యతలు సీరీస్‌లో ఇది రెండవ ప్రచురణ. మత్తయి 5:3-12 వరకు ఉన్న వాక్యభాగంలో యేసు ప్రభువు తనకు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను వివరించారు.
“ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది” [మత్తయి 5:3] అని చెబుతూ ప్రభువైన యేసు కొండమీది ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆత్మవిషయమై దీనులైనవారు అనేది పునాది వైఖరి. ఆత్మలో బలవంతులైన వారిని లోకం ప్రశంసిస్తుంటే, ఆత్మ విషయంలో దీనులుగా ఉండమని బైబిలు విశ్వాసులను పిలుస్తుంది. అది సంస్కృతికి భిన్నమైన జీవనము!
ఆత్మవిషయమై దీనులైనవారు అంతే ఆత్మీయంగా బలహీనులని లేదా విశ్వాసంలో బలహీనమైన వారు కాదని మనం అర్థం చేసుకోవాలి. “నేను వట్టివాడిని” అని చెప్పడం కూడా కాదు. దీనికి విరుద్ధంగా, “దేవా, నీ ప్రమాణానికి అనుగుణంగా జీవించడానికి నా దగ్గర ఆత్మీయ వనరులు ఏమి లేవు. మీరు నన్ను పిలిచిన విధంగా జీవించడానికి నా దగ్గర ఏమి లేదు! ప్రతిదానికీ నీవు నాకు కావాలి. నేను ప్రతిదానికీ నీపై ఆధారపడతాను. నీ నుండి వేరుగా ఉండి నేను ఆధ్యాత్మికంగా దివాళా తీశాను” అని నమ్మి చెప్పగలగాలి.
“దీనులు” అని అనువదించబడిన గ్రీకు పదం భౌతిక వనరులు లేని కారణంగా సాధారణ మనుగడ కోసం పూర్తిగా వేరొకరిపై ఆధారపడిన వ్యక్తి గురించి వివరించడానికి ఉపయోగించబడింది. [లూకా 16:19-20 చూడండి] వంగి తన ముఖాన్ని నేలకు దగ్గరగా ఉంచి, తలపై కప్పుకుని, పైకి చూడడానికి కూడా సిగ్గుపడి డబ్బు కోసం చేయి చాచిన బిచ్చగాడి గురించి అక్కడ ఉంది.
అయితే మత్తయి 5:3 లో, యేసు “దీనులు” అనే పదానికి “ఆత్మలో” అని జోడించారు కాబట్టి ఆయన భౌతిక పేదరికాన్ని సూచించడం లేదని మనం గ్రహించాలి. ఆయన ప్రధానంగా ఆత్మలో దీనత్వాన్ని అంటే ఆత్మలో శూన్యత గురించి తెలియచేస్తున్నారు. [ప్రకటన 3:17-18 చూడండి]. ధనవంతులు పేదవారు ఇద్దరూ పాపం చేశారు. దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని గడపడానికి ఇద్దరికీ వనరులు లేవు. ఇద్దరూ ఈ సత్యాన్ని అర్థం చేసుకుని దేవునికి ఇష్టమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తమకు లేని వాటిని అందించగల యేసు వైపు మాత్రమే మొగ్గు చూపాలి. ఆత్మలో దీనత్వం అంటే ఇదే!
ఆత్మలో దీనులైనవారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు అనే దానిని లూకా 18:8-14 లో యేసు బోధించిన పరిసయ్యుడు సుంకరి ఉపమానం చక్కగా వివరిస్తుంది. ఆ ఉపమానంలో స్వీయనీతి కలిగిన పరిసయ్యుడు తన గురించి తానే గొప్పగా భావిస్తూ తన పాపాలకు క్షమాపణ పొందాలనే అవసరాన్ని చూడలేని గుడ్డివానిగా ఉన్నాడు. మరోవైపు, సుంకరి తాను పరిశుద్ధ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు తప్ప మరేమీ చూడలేక తన ఛాతీని కొట్టుకుంటూ, “దేవా, పాపిని, నన్ను కరుణించు” [లూకా 18:13] అని మొరపెట్టుకున్నాడు. అది ఒక ఆధ్యాత్మిక బిచ్చగాడి చిత్రం; మరోవిధంగా ఆత్మలో దీనులైన వారి గురించి వివరణ. ఇక్కడ పాపాలు క్షమించబడి ఇంటికి వెళ్ళిన వ్యక్తి తన అహంకారం కారణంగా తనలోని ఆధ్యాత్మిక శూన్యతను చూడలేకపోయిన పరిసయ్యుడు కాకుండా సుంకరి కావడంలో ఏ ఆశ్చర్యం లేదు.
దేవునితో ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉండడానికి కావలసినవి మనలో ఉన్నాయని భావించినంత కాలం పాపాల క్షమాపణ కోసం మనం ఎప్పుడూ యేసు వైపు చూడము. అంటే దీని అర్థం మనం ఎప్పటికీ నిత్యజీవితాన్ని పొందలేము, తద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. అయితే దేవుని కృపవలన మనల్ని మనం ఆధ్యాత్మికంగా శూన్యంగా భావించినప్పుడు పాప క్షమాపణ కోసం మనం క్రీస్తు వైపు మాత్రమే తిరుగుతాము. దాని ఫలితంగా మనం నిత్యజీవాన్ని పొంది తద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాము.
అయినప్పటికీ, ఆత్మలో దీనత్వం అనే వైఖరి మార్పుతో ఆగదు. మనం రక్షింపబడినప్పటికీ, మనం మన స్వశక్తితో క్రైస్తవ జీవితాన్ని జీవించలేమని గుర్తుంచుకోవాలి. మనంతట మనమే దేవుని సంతోషపెట్టలేము. మనం ఆయన మనలను పిలిచిన జీవితాన్ని జీవించడానికి నిరంతరం దేవునిపై ఆధారపడి సహాయం చేయమని మొరపెట్టాలి.
ఇక్కడే మనం తరచూ విఫలమవుతాము. మనం సపోర్టు చక్రాలతో సైకిలు నడపడం నేర్చుకోవడం ప్రారంభించి ఆపై సపోర్టు చక్రాలను తీసివేసి తనంతట తానే సైకిలు నడపగల స్థాయికి చేరుకునే చిన్న పిల్లవాడిని పోలివున్నాము. మనం దానిని బయటకు చెప్పము కాని అదే తరచుగా చేస్తాము. మొదట మనంతట మనమే పనులు చేసుకుని విఫలమవుతాము, ఆపై దేవునిపై ఆధారపడతాము.
నేను యేసు చెప్పిన ఈ మాటలను సరిగ్గా చదివితే, ఈ ఆత్మ విషయమైన దీనత్వం అనే వైఖరిని జీవనశైలిగా కలిగివున్నవారు మాత్రమే పరలోక రాజ్యానికి నిజమైన పౌరులని ఆయన చెప్పారు. కాబట్టి, మనం దీనిని తీవ్రంగా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం ఈ రకమైన జీవనశైలిని జీవించాలని కోరుకోవాలి; దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కోసం కాదు కానీ మనం నిజంగా రాజ్య పౌరులమని నిర్ధారించుకోవాలి!
ఆత్మ విషయమైన దీనులైనవారు పొందే ప్రతిఫలం “పరలోక రాజ్యం” [మత్తయి 5:3]. చివరి భాగాన్ని మరింత బాగా అనువదించవచ్చు, “పరలోక రాజ్యం వారిదే, కేవలం వారిది మాత్రమే.” వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని లేదా దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు.
మరో మాటలో చెప్పాలంటే, ఈ జీవితంలో ఆత్మలో దీనులైనవారు, పరలోకపు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అనుభవిస్తారు. దీనర్థం దేవుడు తమను అంగీకరించాడని ఇప్పుడు వారు రాజైన యేసు పాలనలో జీవిస్తున్నప్పుడు కూడా వారిలో వారి ద్వారా ఆయన కార్యాలు చేస్తున్నారని తెలుసుకోవడంలోని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించడము. భవిష్యత్తులో రాజైన యేసు తన భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఈ ఆశీర్వాదాల సంపూర్ణతను మరియు మరిన్నింటిని కూడా వారు అనుభవిస్తారు.
ఆత్మ విషయమైన దీనత్వం అనే వైఖరిని జీవనశైలిగా కలిగివుండడంలో మనకు సహాయపడే ఆచరించ తగిన 4 సూత్రాలు ఇక్కడ ఉన్నాయి.
1. మనం రోజూ శ్రద్ధగా ప్రార్థనకు కట్టుబడి ఉండాలి.
ప్రార్థన అనేది అన్ని సమయాల్లో ప్రభువు మనకు అవసరమని మనం గుర్తించే సాధనం, కాబట్టి పాపం లేదా మరేదైనా సమస్యను అధిగమించడానికి మనకు సహాయం చేయమని మనం సిగ్గుపడకుండా ఆయనకు క్రమంగా మొరపెట్టాలి. మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే, మనం ఎంత పాపులమో అంత ఎక్కువగా గ్రహిస్తాము [మనం ఎంత ఆత్మీయంగా దివాళా తీసామో చెప్పడానికి ఇది మరొక మార్గం]. అటువంటి గ్రహింపు వలన ప్రార్థనలో ఒప్పుకోలులో మనం దేవునికి మరింత మొరపెట్టగలము.
2. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏదీ చేయకుండా మనం కట్టుబడి ఉండాలి.
ఆత్మలో దీనులైనవారు దేవుని వాక్యానికి వణుకుతారు [యెషయా 66:2]. అలాగే పరిశుద్ధ లేఖనాలలో బయలుపరచబడిన దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏదైనా చేయాలనే ఆలోచనకు వణుకుతారు.
3. మనల్ని మనం గొప్ప చేసుకునే ఆలోచనలకు దూరంగా ఉండటానికి మనం కట్టుబడి ఉండాలి.
మన ఆలోచనలు మన పనులుగా మారతాయి. పాపపు ఆలోచనల ఫలితమే పాపపు జీవితము. కాబట్టి దేవుని వాక్యం మన మనస్సులను [రోమా 12:2] హృదయాలను [సామెతలు 4:23] నియంత్రించడానికి అంగీకరించడం ద్వారా దైవిక ఆలోచన కలిగిన జీవితాన్ని పెంపొందించడంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
4. జీవితంలో ఎదురయ్యే శ్రమలనేవి మనం ఆయనపై ఎక్కువగా ఆధారపడుతూ మనపై తక్కువ ఆధారపడేలా చేయడానికి దేవుడు ఏర్పాటని చూడటానికి మనం కట్టుబడి ఉండాలి.
ఈ జీవితంలో ఎదురయ్యే శ్రమలను తృణీకరించే బదులు అవి సార్వభౌమాధికారుడైన ప్రేమగల దేవుని చేతిలో నుండి వచ్చినవని గ్రహించాలి. ఆ దేవుడే మన కోసం తన కుమారుడిని సిలువపై ఉంచారు, అలాగే తన ఇతర పిల్లలమైన మనలను కూడా ఉంచారని గ్రహించాలి. కొన్నిసార్లు మండుతున్న కొలిమివంటి శ్రమలు [1 పేతురు 4:12] మనం మన స్వంత శక్తిపై కాకుండా ఆయనపై మాత్రమే ఆధారపడేలా చేస్తాయి [2 కొరింథి 1:9-10; 12:7-10].
మనం నిరాశకు గురికాకుండా లేదా తప్పుడు నిర్ణయానికి రాకుండా నివారించడానికి నేను ఏమి చెబుతానంటే: మనలో ఎవరూ ఈ ధన్యతను లేదా మరే ఇతర ధన్యతలను పరిపూర్ణంగా నెరవేర్చలేము. మనకు బదులుగా వాటిని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు, అది స్వయంగా ఈ మాటలు మాట్లాడిన ప్రభువైన యేసే!
ప్రార్థన చేయనవసరం లేనివారెవరంటే అది యేసు అయినా ఇంతవరకు జీవించిన వారిలో అసలు తీరికలేని వ్యక్తియైన యేసు కన్నా మరి ఎవరూ ప్రార్థనకు అధిక ప్రాధన్యత ఇవ్వలేరు. లోకాన్ని రక్షించడం అనే అపరిమితమైన పని ఆయనకు ఉంది.
యేసు తాను కోరుకున్నది ఏదైనా చేయగలరు. అయినప్పటికీ, తండ్రిని సంప్రదించకుండా ఆయన ఏదీ చేయలేదు. అంతే కాదు, సిలువ మీద ఉన్నప్పటికి ఆయన తన తండ్రి చిత్తాన్ని చేయడంలో ఎప్పుడూ సంతోషించారు.
స్వీయ ఘనత గురించి ఆలోచించే హక్కు ఎవరికైనా ఉంటే అది యేసుకే. ఆయన విషయంలో, ఆయన ఎంతో గొప్పవాడు కాబట్టి ఇది పాపం కాదు. అయినప్పటికీ, ఆయన తన గురించి “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను” [మత్తయి 11:29] అని చెప్పారు. మనస్సు అన్ని ఆలోచనలకు స్థానము.
ప్రతి శ్రమను సహించి ఎప్పుడూ శోధనలో పడకుండా ఉన్నది ఎవరంటే అది యేసు.
అందుకే యేసు ద్వారా దేవుడు మనలను మొదటి స్థానంలో అంగీకరిస్తాడు. యేసు ద్వారానే మనం దేవునిచే అంగీకరించబడ్డాము. కాబట్టి, దేవుని అంగీకారం పొందేందుకు లేదా దేవునిచే అంగీకారించబడి ఉండేందుకు మనం ఈ ఆత్మలో దీనత్వాన్ని సంపూర్ణంగా కలిగివుండాలనే ఆలోచించే చిక్కుకుపోకండి. దానికి బదులుగా, మనం ఈ పరుగు పందెంలో పరుగెడుతున్నప్పుడు అనగా మనల్ని యేసు వలె మార్చడానికి పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నప్పుడు ఆయనను మనకు మాదిరిగా చేసుకుందాము [2 కొరింథి 3:18].
ఈ లోకంలో “శక్తిని బలపరిచేవాటన్నిటిని, శక్తికి సంకల్పాన్ని, మనిషిలో ఉన్న శక్తిని” మంచి అంటారు, అలాగే “బలహీనత నుండి వచ్చేవన్నీ” చెడు అంటారు. లోకం తన కండలను పెంచుకుని తనకున్న బలాన్ని గర్విస్తుంది. అయినప్పటికీ, ఆత్మలో దీనులమైన మనం సిగ్గు పడకుండా మన బలహీనతలన్నిటితో మన ఖాళీ చేతులను పరలోకం వైపు ఎత్తి, “ప్రభువా, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను ఏమి చేయలేను. నాకు సహాయం చెయ్యండి” అని ఎప్పుడూ మొరపెడుతూనే ఉండాలి. మన బలహీనతల ద్వారా దేవుని శక్తి కార్యం చేస్తుందని, మన బలహీనతల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. దీనమైన ఆత్మ కలిగిన జీవనశైలిని చూసి లోకం నవ్వుతుంటే మనం బాధపడనవసరం లేదు. ఇది కేవలం సంస్కృతికి భిన్నమైన జీవనశైలి మాత్రమే. అటువంటి జీవనశైలిపై దేవుని ఆమోదపు చిరునవ్వు ఉందనే సత్యాన్ని బట్టి మనం విశ్రాంతి తీసుకోవచ్చు.
కేవలం సంస్కృతికి భిన్నమైన జీవితాన్ని గడిపే వ్యక్తులను మాత్రమే “మీరు ధన్యులు” అని యేసు చెప్పిన మాటలు వింటారని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. మిగిలినవారు “అయ్యో మీకు శ్రమ, భయంకరమైన తీర్పు నీ కోసం ఎదురుచూస్తోంది” అని యేసు చెప్పిన మాటలు వింటారు. కాబట్టి శాశ్వతమైన ఆనందమా లేక శాశ్వతమైన దుఃఖమా? శాశ్వతమైన సమాధానమా లేక శాశ్వతమైన బాధా? ఎంపిక చేసుకోవాలి. జ్ఞానం కలిగి ఈ లోకం ఇచ్చే తాత్కాలిక సంతోషాన్ని కాకుండా యేసు అందించే శాశ్వతమైన ఆనందాన్ని ఎంచుకుందాం!
గతం గడిచిపోయింది. ఈరోజు కొత్త రోజు. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది అనే ఈ గొప్ప సత్యాన్ని విశ్వసించడం ద్వారా మరియు ఆచరణలో పెట్టడం ద్వారా మనం మళ్లీ ప్రారంభించవచ్చును.