ధన్యతలు మొదటి భాగము పరిచయము

(English version: “The Beatitudes – Introduction”)
యేసు బోధించిన అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసంగాన్ని “కొండమీది ప్రసంగం” అంటారు. ఇది 3 అధ్యాయాలలో [మత్తయి 5-7] ఉంది. మత్తయి 5:3-12 లో ఉన్న ఆ ప్రసంగం మొదటి భాగాన్ని ధన్యతలు అని పిలుస్తారు. క్రీస్తు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరుల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మనము ఈ పరిచయ ప్రచురణతో మొదలయ్యే ఈ సీరీస్‌లో 8 వైఖరులలో ప్రతి ఒక్క దానిని విశ్లేషిద్దాము.
అలా చేయడానికి ముందు మొత్తం వాక్యభాగాన్ని చదివితే మనకి ఎంతో సహాయకరంగా ఉంటుంది.
మత్తయి 5:3-12
3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. 4 దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. 5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. 7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. 8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. 9 సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. 10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. 11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
యేసు లేనివారు సహజంగానే అన్ని రకాల బలహీనతలను నివారించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మత్తయి 5:3-12లో ప్రభువైన యేసు ప్రకారం, ఈ బలహీనతలు ఆయనను అనుసరిస్తున్నామని చెప్పుకునే వారందరి జీవనశైలి యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలి. ఎందుకంటే ఈ జీవనశైలిని లోకం ఎగతాళి చేసినప్పటికి ఈ జీవనశైలి వలన దేవుని ఆశీర్వాదాలను అనుభవించగలము ఆయన ఆమోదాన్ని పొందగలము. మరో మాటలో చెప్పాలంటే, యేసు మనల్ని సంస్కృతికి పూర్తిగా భిన్నమైన జీవనశైలిలోనికి పిలుస్తున్నారు!
మత్తయి 5: 3-12 భాగానికి “ధన్యతలు” అని పేరు. ధన్యతలకు సమానార్థమైన “బీటిట్యూడ్” అనే ఇంగ్లీషు పదం “బీటస్” అనే లాటిన్ పదం యొక్క అనువాదం నుండి వచ్చింది, ఇది దీవెన అని అనువదించబడింది. ఒక రచయిత వీటిని “అందమైన వైఖరులు” అని పిలిచాడు, ఇవి యేసు యొక్క నిజమైన అనుచరులకు గుర్తుగా ఉన్నాయి. దానిని నేను అంగీకరిస్తాను. ఈ భాగంలో 8 వైఖరుల జాబితా ఇవ్వబడింది. 10-12 వచనాలలో హింసను సహించడం అనే వైఖరి ఇవ్వబడింది. అయినప్పటికి 10 మరియు 11 వచనాలలో ధన్యులు అనే పదం కనిపిస్తుంది.
మీరు గమనిస్తే, ఈ వైఖరులలో ప్రతి దానితో “ధన్యులు” అనే పదం 9 సార్లు కనిపిస్తుంది. కొన్ని అనువాదాలు ఈ పదాన్ని “సంతోషం” లేదా “అదృష్టం” అని అనువదించాయి కాని ధన్యులు అనే పదం ఇచ్చిన పూర్తి అర్థం అవి ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి.
కారణం # 1. “సంతోషం” అనేది ఒక వ్యక్తి ఎలా భావిస్తున్నాడో తెలియచేస్తుంది. మరోవైపు, ధన్యులు అనేది దేవుడు వారి గురించి ఏమనుకుంటున్నాడో తెలియచేస్తుంది. ఆత్మలో దీనులైనవారు, దుఃఖించేవారు మొదలైన వైఖరులను ప్రదర్శించే వ్యక్తి పట్ల దేవుని ఆమోదాన్ని ఇది తెలియచేస్తుంది. అందుకే నేను ధన్యులు అనే పదానికి ప్రాధాన్యత ఇస్తాను.
కారణం # 2. మన సంస్కృతిలో సంతోషాన్ని లేదా ఆనందాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి నేను కూడా దానికే ప్రాధాన్యత ఇస్తాను. మన సంస్కృతిలో ఆనందాన్ని ఈ లోకసంబంధ పరిస్థితులపై ఆధారపడిన సంతోషకరమైన అనుభూతులతో సమానంగా చూస్తారు. దేవునిచే ఆశీర్వదించబడిన వారు అంటే ఆయన ఆమోదం పొందినవారు సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు. అది భిన్నమైన ఆనందము. ఇది ప్రపంచం వివరించిన దానికంటే భిన్నమైన ఆనందము. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికి తాము పొందుకున్న దేవుని ఆనందం మరియు ఆమోదం ఫలితంగా వచ్చే అనుభూతి ఇది. హింసలు బాధలు ఎదురైన సమయంలో వారు సంతోషంగా లేకపోయినప్పటికి విశ్వాసులు ఇంకా దేవుని ఆమోదం పొందే సానుకూల స్థితిలో ఉన్నారు. కాబట్టి, నేను ధన్యులు అనే పదాన్ని ఉపయోగించడానికే ప్రాధాన్యత ఇస్తాను.
దీవెన లేదా ఆనందం యొక్క నిజమైన అర్థాన్ని మనం అర్థం చేసుకున్నంత వరకు ధన్యులు లేదా సంతోషాలలో ఏ పదానైనా ఉపయోగించవచ్చు అది పెద్ద సమస్య కాదు.
ధన్యతలు ఒక నిర్మాణాన్ని కలిగివున్నాయి. ప్రతి ధన్యతలో 3 అంశాలు ఉంటాయి. వాటిలో మొదటిది నిర్దిష్ట వైఖరి [“ఆత్మవిషయమై దీనులైనవారు”—మత్తయి 5:3a]; రెండవది దీవెన [“ధన్యులు”—మత్తయి 5:3b]. చివరగా, అటువంటి వైఖరిని ప్రదర్శించినందుకు ప్రతిఫలం ఉంటుంది [“పరలోక రాజ్యము వారిది”—మత్తయి 5:3c].
ధన్యతలు యొక్క ప్రధాన ఇతివృత్తం ఇప్పుడు మరియు భవిష్యత్తులో సంపూర్ణంగా పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను అనుభవించడము. 3 మరియు 10వ వచనాల చివరిలో కనిపించే “పరలోక రాజ్యం వారిది” అనే వాక్యం నుండి ఈ అంశం వచ్చింది. వారిది అనే పదం ప్రస్తుత స్వాధీనాన్ని సూచిస్తుంది.
పరలోక రాజ్యం వర్తమానానికి మరియు భవిష్యత్తుకు రెండు అంశాలకు సంబంధించింది. పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా, యేసు భూమికి తిరిగి వచ్చినప్పుడు ఏర్పాటు చేయబోయే ఆయన భౌతిక రాజ్యాన్ని భవిష్యత్తు అంశం సూచిస్తుంది. అయినప్పటికీ, ఇప్పుడు కూడా, నిజమైన విశ్వాసులు అంటే, ప్రభువు రాజైన యేసు పాలనలో జీవించేవారు కొన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అనుభవించారు.
పరలోక రాజ్యపు ఆశీర్వాదాలనేవి రక్షణానుభవము కలిగి తమలో పరిశుద్ధాత్మ నివసిస్తున్న కారణంగా అనుదిన జీవితంలో ఈ 8 వైఖరులను ప్రదర్శించే వారికి మాత్రమే అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. అయితే విశ్వాసులు ఈ వైఖరులన్నింటినీ సంపూర్ణంగా ఎల్లవేళలా ప్రదర్శిస్తారని దీని భావం కాదు. పరిశుద్ధాత్మను కలిగిన క్రైస్తవులు, విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఈ జీవనశైలికి దూరమయ్యే అవకాశం ఉంది.
అయినప్పటికీ, ధన్యతలలో మాత్రమే కాకుండా, కొండమీది ప్రసంగమంతటిలో వివరించబడిన జీవనశైలి ఇక్కడ భూమిపై రాజైన యేసు పాలనలో నివసించే ప్రతి క్రైస్తవునిపై ప్రభావాన్ని చూపించాలి. విశ్వాసులు ఈ దిశలో పరలోకపు లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేనప్పటికీ, వారు దానిని హృదయపూర్వకంగా కొనసాగించాలి. దివంగత హాడన్ రాబిన్సన్ “వాట్ జీసస్ సెడ్ అబౌట్ సక్సెస్‌ఫుల్ లివింగ్ రైట్లీ” అనే తన పుస్తకంలో, “దేవుడు విజయం కంటే ప్రక్రియపైనే ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు. లక్ష్యాన్ని అనుసరించడమే దాని స్వంత బహుమతి అవుతుంది” అన్నాడు.
మేము చెప్పిన రీతిగా తర్వాతి ప్రచురణ లో మొదటి దన్యత గురించి చూద్దాం! అప్పటి వరకు, ప్రార్థనాపూర్వకంగా మీరు స్వంతంగా వాటిని ధ్యానించండి. ఆ జీవనశైలిని మీరు కోరుకునేలా చేయడమే కాకుండా నిరంతరం కొనసాగించేలా చేయమని ప్రభువును ఎందుకు అడగకూడదు?