దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లు /తీర్మానాలు—2వ భాగము

Posted byTelugu Editor November 26, 2024 Comments:0

(English version: “12 Commitments of a Godly Church – Part 2”)

దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లు /తీర్మానాలు అనే ఈ సిరీస్‌లోని మొదటి భాగంలో మనం దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లలో మొదటి నాలుగింటిని చూశాము. అవి: (1) రక్షణ సభ్యత్వము (2) బైబిలు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం (3) నియమాలను పాటించాలి (4) సహవాసము. ఈ భాగంలో మనం మరో నాలుగు కట్టుబాట్లను /తీర్మానాలను  చూద్దాము. 

తీర్మానం #5. ఒకరినొకరు ప్రేమించవలెను

యోహాను 13:35లో, మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురని” యేసు చెప్పారు. ఆది సంఘంలో  ఉన్న ఒక ప్రత్యేకమైన విషయమేమిటంటే ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ. ఈ కట్టుబాటు గత కట్టుబాటుతో అనగా సహవాసంతో సన్నిహితంగా ముడిపడి ఉంది. వారు ఒకరినొకరు యథార్థంగా ప్రేమించడం వల్ల వారి సహవాసం బలంగా ఉందని కూడా మనం చెప్పగలం.

ఈ ప్రేమ కేవలం మాటలలో మాత్రమే కాక క్రియారూపంలో కూడా ఉంది. అపొ.కా 2:44-45లో 44 “విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. 45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి అని చెబుతోంది. 46వ వచనంలో వారేకమనస్కులై ఇంటింట రొట్టె విరుచుచు కలిసి తిన్నారు” అని చెబుతోంది. దీనర్థం వారు ఇతరులను తమ గృహాలలోనికి స్వాగతించారు. అది ప్రేమతో చేసే పని. ప్రేమ లేని చోట ఇతరులు లోపలికి రావడానికి తలుపు తెరిచి ఉండదు!

పస్కా పండుగ కోసం యెరూషలేముకు వచ్చి మారుమనస్సు పొందినవారు సహవాసంలో విశ్వాసులుగా మిగిలిపోయారని చరిత్రకారులు మనకు చెబుతారు. అంతే కాకుండా విశ్వాసులుగా మారిన వారు తమ తోటి యూదుల నుండి విడిపోయారు; తద్వారా వ్యాపారాలలో పనులలో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇవన్నీ చాలామందికి ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని కలిగించాయి.

ఆర్థికంగా బలంగా ఉన్న విశ్వాసులు తమ వద్ద ఉన్నదంతా ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడ్డారు. ఇతరులు తినడానికి సహాయం చేయడానికి ఆస్తులను అమ్మడం గురించి ఒకసారి ఆలోచించండి! క్రైస్తవ జీవితమంటే ఇదేనని వారికి తెలుసు. ఇది వారు ఏదో ఒక సారి చేసింది కాదు. వారు నిరంతర ప్రేమ చూపించారు. తరువాత అపొ.కా 4:32-35లో “32 విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. 33 ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. 34 భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి. 35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను” అని చదువుతాము.

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మరియు తగినవిధంగా వారికి సహాయం చేయడానికి చురుకుగా ప్రయత్నించేవారిగా ఒక దైవభక్తిగల సంఘ  సభ్యులు ఉండాలి [1 యోహాను 3:16-18]. తోటి క్రైస్తవులు అవసరంలో ఉన్నట్లు చూసినప్పుడు వారు సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు వారు సహాయం చేయడానికి వెనుకాడలేదు. ఈ లోక ఆస్తుల కన్నా బంధాలే తమకు ముఖ్యమని ప్రేమపూర్వకంగా చూపించారు.

తీర్మానం #6. ప్రార్థన

లూకా తన సువార్తలో అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడని మీకు తెలియకపోవచ్చు. లూకా సువార్తలో అతడు యేసు ప్రార్థనా జీవితం గురించి మరియు ప్రార్థనపై ఆయన బోధల గురించి తెలియచేశాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో అతడు సంఘ ప్రార్థనా జీవితం గురించి చాలా వరకు తెలియచేశాడు. అపొ.కా 2:42లో “ఆదిసంఘం ప్రార్ధనలో ఎడతెగక ఉందని” చెబుతుంది. ఇందులో ప్రత్యేక ప్రార్థనలు అలాగే సాధారణ ప్రార్థనలు కూడా ఉండేవి. బహుశా వారు ప్రార్థనకు కూడా సమయాలను నియమించుకుని ఉండవచ్చు [అపొ.కా 3:1]. వారు ప్రార్థన లేకుండా ఏదీ చేయలేదు. ప్రార్థన ఆదిసంఘానికి ఊపిరివంటిది.

అపొస్తలులు కూడా “ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక ఉన్నారని” అపొ.కా 6:4 చెబుతోంది. ప్రజలను రక్షించడానికి పరిశుద్ధాత్మ వాక్యాన్ని ఉపయోగించకపోతే వారి బోధంతా పనికిరాదని వారికి తెలుసు. సరళంగా చెప్పాలంటే, ఆదిసంఘంలో ప్రార్థనా నాయకత్వం మరియు ప్రార్థనా సభ్యత్వం ఉన్నాయి!

ఆత్మ శక్తి మనలో పనిచేయాలని మనమెంతో ఆసక్తిగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలోను అలాగే సంఘంగా కలుసుకున్నప్పుడు మనం నిరంతర ప్రార్థించకపోతే ఇది జరగదు! నాయకులతో సహా అందరూ ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ సంఘాన్ని దైవభక్తిగల సంఘమని పిలవలేము. నాయకులైన వారు క్రమం తప్పకుండా ప్రార్థన సమావేశాలను నిర్వహించాలి, వాటికి సభ్యులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలి. తక్కువమంది వచ్చినా సరే ఆ సమావేశాలను కొనసాగించాలి. తగినసమయంలో దేవుడు సంఘమంతా హృదయపూర్వకంగా ప్రార్థించేలా ఆశీర్వదిస్తాడు.

తీర్మానం #7. దేవుని స్తుతించడము

ప్రజలను ప్రేమించాలనే సమానమైన నిబద్ధత ఉన్నప్పటికీ, దేవుని ప్రేమించాలనే ముఖ్యమైన నిబద్ధతను కూడా ఆదిసంఘం కలిగి ఉంది. ఈ ప్రేమ దేవుని స్తుతించాలనే వారి స్థిరమైన నిబద్ధతలో కనబడింది. అపొ.కా 2:46లో భాగం వారు కలిసి కలుసుకున్నప్పుడు నిరంతరం “దేవుని స్తుతించారని” తెలియచేయబడింది. దేవుని ప్రేమించే హృదయాల నుండి పాటలు, స్తుతి మరియు కృతజ్ఞతా ప్రార్థనలు వస్తాయి. అపొస్తలుల కార్యాలలో తరువాత చదివినట్లుగా, వారు బాధలను అనుభవించినప్పుడు కూడా వారు దేవుని స్తుతించడం మానలేదు.

దైవభక్తిగల సంఘం ఆరాధనలో ప్రజలంతాకలిసి వచ్చినప్పుడు దేవుని స్తుతించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సంగీత పరిచర్యలో పాల్గొనేవారు బైబిలు సత్యాన్ని బోధించే పాటలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఆరాధన అనేది ప్రజలను అలరించే సాధనంగా చూడకూడదు కానీ  అ బైబిలులోని అమూల్యమైన సత్యాలు తెలియజేయబడిన మనస్సులతో దేవుని స్తుతించేలా చూడాలి. తనను స్తుతించడానికి తన ప్రజలు కలిసి వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు!

తీర్మానం #8. సువార్తీకరణ

పునరుత్థానమైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు సంఘానికి అలాగే విశ్వాసులకు తప్పిపోయిన వారికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలను 4 సువార్తలు నొక్కిచెప్పాయి [మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-48; యోహాను 20:21].

తప్పిపోయినవారికి సువార్తను ప్రకటించడానికి ఆదిసంఘం ఎంతో ఆసక్తి కనపరచింది. అపొ.కా 2:47లో “ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను” అని స్పష్టంగా చూడవచ్చు. ఒకరు ఎలా రక్షించబడతారు? సువార్తను అంగీకరించే ముందు దానిని వినడం ద్వారానే కదా!రక్షింపబడిన ఫలితంగా సంఘం పెరుగుతూనే ఉందనే వాస్తవం అక్కడ సువార్తీకరణ చురుకుగా జరుగుతోందని చెబుతుంది! నాయకత్వం మరియు సభ్యత్వం రెండూ సువార్తీకరణలో చురుకుగా ఉన్నాయి. శ్రమల సమయంలో కూడా వారు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు [అపొ.కా 8:4].

అపొస్తలుల కార్యములు గ్రంథం సాక్షులుగా ఉండాలనే పిలుపుతో ప్రారంభమై [అపొ.కా 1:8] రోమా వరకు సువార్తను ప్రకటించబడటంతో ముగుస్తుంది [అపొ.కా 28:30-31]. ఎందుకంటే వారు సువార్తీకరణకు కట్టుబడి ఉన్నారు! ఒక దైవభక్తి గల సంఘం దాని పొరుగున ఉన్న మరియు ఇతర దేశాలలో ఉన్న తప్పిపోయిన వారిని మిషన్‌ల ద్వారా చేరుకోవడానికి నిబద్ధతతో కలిగివుంటుంది. [తరువాతి  భాగంలో మిషన్‌ల గురించి మరింత తెలుసుకుంటాము.] తమ స్నేహితులలో కుటుంబ సభ్యులలో తప్పిపోయిన వారిని సువార్త వినడానికి తీసుకువచ్చేలా ప్రజలను ప్రోత్సహించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు మరియు సహోద్యోగులతో వారే స్వయంగా సువార్తను పంచుకునేలా వారిని ప్రోత్సహించాలి!

ప్రార్థన సమయాలలో తప్పిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త అందుకున్న వారి కోసం అలాగే భవిష్యత్తులో సువార్త పంచుకోడానికి ప్రభువు అవకాశాలను ఇవ్వాలని ప్రార్థించాలి. నాయకులు వ్యక్తిగతంగా సువార్తీకరణలో చురుకుగా ఉండటం ద్వారా ఇతరులకు మాదిరిగా ఉండాలి.

మొదటి భాగంలోని నాలుగింటితో పాటు, మనం ఈ భాగంలో దైవభక్తిగల సంఘం యొక్క మరో నాలుగు కట్టుబాట్లను చూశాము. అవి:

(5) ఒకరినొకరు ప్రేమించవలెను
(6) ప్రార్థన
(7) దేవుని స్తుతించడము
(8) సువార్తీకరణ.

ఈ 3-భాగాల సిరీస్‌లోని 3వ భాగంలో దైవభక్తిగల సంఘం యొక్క చివరి నాలుగు నిబద్ధతలను మనం చూస్తాము. అప్పటి వరకు మీ సంఘం దైవభక్తి గల సంఘంగా ఉండేందుకు మీరు ఎలా సహాయపడగలరో ప్రార్థనాపూర్వకంగా ఎందుకు ఆలోచించకూడదు?

Category