దైవభక్తిగల సంఘం యొక్క 12 కట్టుబాట్లు /తీర్మానాలు—1వ భాగము

Posted byTelugu Editor November 12, 2024 Comments:0

(English version: “12 Commitments of a Godly Church – Part 1”)

దైవభక్తిగల సంఘం ఎలా ఉండాలి? దాని కట్టుబాట్లు /తీర్మానాలు ఏమిటి? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని పరిశీలన చేయడం ఎంతో ఉత్తమం. అపొస్తలుల కార్యాలలో వివరించినట్లుగా ఆదిసంఘం ఏ విధంగానూ పరిపూర్ణమైనది కాదు అలాగే మనం అనుసరించడానికి ఒక నమూనాగానూ ఇవ్వలేదు కాని ఆదిసంఘం దైవభక్తిగల సంఘమని మనం అంగీకరిస్తాము అలాగే వారు చేసిన పనుల నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.

ఈ మొదటి భాగంతో ప్రారంభించి మూడు భాగాలుగా ఆదిసంఘానికి ఉన్న12 కట్టుబాట్లను /తీర్మానాలను మనం పరిశీలిద్దాము. దైవభక్తిగల సంఘంగా ఉండాలనుకునే నేటికాలంలోని ఏ సంఘానికైనా ఈ 12 అంశాలు చాలా ప్రయోజనకరమైనవని నేను నమ్ముతున్నాను. 

తీర్మానం #1. రక్షణ సభ్యత్వము

అందరూ ఆహ్వానితులే అయినప్పటికి యేసుక్రీస్తు సువార్తను అంగీకరించిన వారు మాత్రమే సభ్యత్వంలోకి తీసుకోబడ్డారు అని అపొ.కా 2:41లో స్పష్టంగా ఉంది. పేతురు సువార్తను ప్రకటించి క్రీస్తు వైపు తిరగమని వారిని హెచ్చరిచినట్లు ముందు వచనాలలో చూస్తాము. తర్వాత 41వ వచనంలో, “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి” అని చదువుతాము. వారు సంఘంలో చేరడానికి ముందే రక్షింపబడ్డారని గమనించండి. పరిశుద్ధాత్మ ఈ ప్రజలందరి మీదికి వచ్చింది. పరిశుద్ధాత్మ వారిలో నివసించింది. ఇది యేసుని తమ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది.

సభ్యత్వ నమోదుకు సంఘాలు ఏ పద్ధతిని అవలంబించినప్పటికీ ప్రజలు సభ్యులుగా కావడానికి ముందే వారు రక్షించబడాలి.

తీర్మానం #2. బైబిలు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం

రక్షించబడినవారు దేవుని వాక్యం పట్ల గాఢమైన ప్రేమ కలిగి ఉంటారు. ఆదిసంఘంలో మనం అదే చూస్తాము. అపొ.కా 2:42లో, “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి” అని ఉంది. “ఎడతెగక” అనే పదానికి ఒక పని పట్ల నిరంతర నిబద్ధత కలిగివుండడం అని భావము. ఈ సందర్భంలో, అపొస్తలులు బోధించినట్లుగా దేవుని వాక్యాన్ని నిరంతరం నేర్చుకోవడం. అపొ.కా 2:46లో “వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారని” చెబుతోంది. వారు కలుసుకున్నప్పుడు అక్కడ వాక్యబోధ జరుగుతుందని మీరు గమనించాలి. వారు దేవుని వాక్యం కోసం ఆకలితో ఉన్న ప్రజలు.

వారికి మంచి ఉపదేశమివ్వడానికి అపొస్తలులు కూడా కట్టుబడి ఉన్నారు. వారు ప్రజలను అలరించడానికి ఆసక్తి చూపలేదు కానీ దేవుని వాక్యమనే స్వచ్ఛమైన పాలతో వారిని పోషించడంలో ఆసక్తిని చూపించారు. యోహాను 17:17లోని యేసు ప్రార్థన అపొస్తలులకు కూడా తెలుసు, “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.” ఒక వ్యక్తిని అతడు పరివర్తన చెందుతున్న సమయంలో ప్రారంభ స్థితిలో పాపం నుండి శుద్ధి చేయడానికి పరిశుద్ధాత్మ వాక్యాన్ని ఉపయోగిస్తాడని వారికి తెలుసు, అలాగే ఆ వ్యక్తిని పరిశుద్ధంగా ఉంచేది కూడా ఆ దేవుని వాక్యమే.

బైబిలు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం దైవభక్తిగల సంఘానికి ముఖ్యమైన నిబద్ధతగా ఉండాలి. సంఘంలో బలిపీఠం నుండి వాక్యం బోధించబడినప్పుడు మాత్రమే కాకుండా బైబిలు అధ్యయనాలు, ఇతర మీటింగులు మొదలైన వాటిలో భక్తులైనవారి బోధలు ప్రసంగాల ద్వారా వాక్యాన్ని వినడానికి కూడా విశ్వాసులు కట్టుబడి ఉండాలి. అర్హులైన బోధకులు కూడా ప్రజలకు వాక్యాన్ని బోధించడానికి ప్రయాసపడాలి.

తీర్మానం #3. నియమాలను పాటించాలి

సంఘానికి దేవుడు రెండు నియమాలను నియమించారు. ఒకటి బాప్తిస్మం మరొకటి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం. దీనినే ప్రభూ సంస్కారమని లేదా రొట్టె విరచడమని కూడా పిలుస్తారు.

ఆచారం #1: బాప్తిస్మము

యేసు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆదేశంలో వెళ్లి సువార్త బోధించి బాప్తిస్మం ఇవ్వడం ద్వారా ప్రజలందరిని శిష్యులుగా చేయమని, వారు సువార్తను అంగీకరించిన తర్వాత వారికి అన్నిటిని బోధించమని సంఘానికి ఆజ్ఞాపించారు [మత్తయి 28:18-20]. దానికి విధేయత చూపిస్తూ పేతురు పెంతెకొస్తు దినాన సువార్తను ప్రకటించడమే కాకుండా, “మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి” అని పిలుపునిచ్చాడు [అపొ.కా 2:38]. అలాగే అపొ.కా 2:41లో ఈ పిలుపుకు ప్రతిస్పందనగా “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందారు.”

ఈ ప్రజలు మొదట క్రీస్తును తమ హృదయాలలో అంగీకరించారు తర్వాత వెంటనే నీటి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా తమ విశ్వాసం గురించి సాక్ష్యమిచ్చారు. మరో మాటలో చెప్పాలంటే, బైబిలు విశ్వాసుల బాప్తిస్మం గురించి మాత్రమే తెలియచేస్తుంది. అనగా, సువార్తను విని సానుకూలంగా స్పందించిన తర్వాత మాత్రమే బాప్తిస్మం తీసుకుంటారు.

తమ పాపాల గురించి పశ్చాత్తాపపడి యేసుపై విశ్వాసం ఉంచిన వారిని మరి ఎక్కువగ ఆలస్యం చేయకుండా యేసును అనుసరించాలనే వారి నిబద్ధత గురించి నీటి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా సాక్ష్యమిచ్చేలా దైవభక్తిగల సంఘం వారిని ప్రోత్సహించాలి. నిజమైన విశ్వాసం ఎప్పుడూ యేసు ఆజ్ఞలకు ముఖ్యంగా మొదటి ఆజ్ఞయైన బాప్తిస్మంకు విధేయత చూపుతుంది. విధేయత చూపించడంలో ఆలస్యం చేయకూడదు.

ఆచారం #2: ప్రభు రాత్రి భోజనము

యేసు తాను అప్పగించబడిన రాత్రి సంఘానికి మరొక నియమాన్ని కూడా ఇచ్చారు. బాప్తిస్మం అనేది సంఘం ఒకసారి పాటించవలసిన నియమమైతే యేసు మరణాన్ని పునరుత్థానాన్ని మరియు రెండవ రాకడను జ్ఞాపకం చేసుకోవడంతో పాటు సంఘంలో ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమను గుర్తుచేసుకుంటూ సంఘం తప్పనిసరిగా ఒక క్రమపద్ధతిలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించాలి. అపొ.కా 2:42లో వీరు రొట్టె విరుచుటయందును ఎడతెగక యుండిరి అని లూకా మనకు తెలియచేసాడు. రొట్టె విరుచుట అంటే భోజనం అని అర్థము. సాధారణంగా ప్రభురాత్రి భోజన సంస్కారం భోజనం ముగిసే సమయానికి ఎక్కువగా పాటిస్తారు.

ప్రభురాత్రి భోజనాన్ని ఎన్నిసార్లు ఆచరించాలో కొత్త నిబంధనలో స్పష్టంగా చెప్పనప్పటికీ, అది క్రమం తప్పకుండా చేయాలని చెప్పవచ్చు. మొదట్లో ఇది ప్రతిరోజూ జరిగినట్లు అనిపిస్తుంది. 46వ వచనంలో “వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు ఉన్నారని” మనం చూస్తాము. తరువాత అపొ.కా 20:7లో, “వారు ప్రతివారం ప్రభురాత్రి భోజనం చేసినట్లుగా కనబడుతుంది.” [ఈ గంభీరమైన సంతోషకరమైన పని మన కోసం యేసు చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తుచేస్తుంది కాబట్టి చర్చిలో వారానికోసారి ప్రభు రాత్రి సంస్కారాన్ని ఆచరించాలనేది నా అభిమతం. సంఘమంతా ఒక్క శరీరంగా కలిసి వచ్చే  ప్రతి ప్రభువు దినాన ఇది ఆచరించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.]

తీర్మానం #4. సహవాసము

అపొ.కా 2:42లో “వీరు…సహవాసమందును  ఎడతెగక యుండిరి” అని చెబుతోంది. సహవాసం అంటే భాగస్వామ్య జీవితమని, ఒకేరకమైన ఆసక్తులు కలిగి ఉండడమని అర్థము. వారందరూ యేసు ప్రభువులో ఏకమై, ఆయనలో కలిసి జీవించడమని అర్థము. “వారేకమనస్కులై ఇంటింట రొట్టె విరుచుచున్నారని” అపొ.కా 2:46లో చెప్పినట్లుగా ఈ సహవాసం వలన వారు కలిసి సమయాన్ని గడుపుతారు.

ఒకరికొకరు చేయవలసిన అనేక ఆజ్ఞలను విశ్వాసులు ఆచరించాలని కొత్త నిబంధనలో తెలియచేయబడింది. ప్రజలు ఒకరితో ఒకరు సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఆచరించడం సాధ్యమవుతుంది. మనం ఒకరితో ఒకరు సమయం గడపకపోతే, ఒకరికొకరు చేయవలసిన ఆజ్ఞలను ఎలా పాటించగలం? ఆదివారం ఆరాధనకు వచ్చి అది అయిపోయిన వెంటనే వెళ్లిపోతే బైబిలు వివరించినట్లుగా తాము సహవాసానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి లేదు! విశ్వాసులు కలిసి  వాక్య ధ్యానం చేయడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి అలాగే కొన్నిసార్లు కలిసి భోజనం చేసే పరిస్థితులను కల్పించడానికి సంఘనాయకత్వం కృషి చేయాలి. విశ్వాసులు వాటిలో పాల్గోనడమే కాకుండా వాటిని ఏర్పాటు చేయడానికి తమవంతు సహకారాన్ని అందించడం ద్వారా వారు కూడా నాయకత్వానికి సహకరించాలి.

మనం ఇప్పుడు ఈ మొదటి భాగంలో 12 కట్టుబాట్లలో నాలుగింటిని చూశాము. అవి: 

(1) రక్షణ సభ్యత్వము
(2) బైబిలు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం
(3) నియమాలను పాటించాలి
(4) సహవాసము

ఈ 3-భాగాల సిరీస్‌లో 2వ భాగంలో మరో నాలుగింటిని చూస్తాము. అప్పటి వరకు, మీ సంఘం దైవభక్తిగల సంఘం ఉండేందుకు మీరు ఎలా సహాయపడగలరో ప్రార్థనాపూర్వకంగా ఎందుకు ఆలోచించకూడదు.

Category