దైవభక్తిగల తండ్రి వర్ణన 2వ భాగము

(English version: “Portrait Of A Godly Father – Part 2 – What To Do!”)
గత ప్రచురణలో “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి” అని ఎఫెసి 6:4లో పౌలు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తండ్రులు ఏమి చేయకూడదో చూశాము. ఈ ప్రచురణలో, అదే వాక్యంలోని రెండవ భాగమైన “ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అనే దాని గురించి చూద్దాము.
తండ్రులు—ఏం చేయాలి (అనుకూలమైనది)
పిల్లలలో విసుగు, కోపం, నిరుత్సాహం కలిగించడానికి బదులుగా “ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని పౌలు తండ్రులకు పిలుపునిచ్చాడు. ఈ పదబంధం పిల్లల పరిపక్వతకు ఆహారం ఇవ్వడం లేదా పెంచడం అనే ఆలోచనను సూచించే పదం నుండి ఉద్భవించింది.. అది తండ్రి బాధ్యత. మరోచోట ఎఫెసి 5:29లో ఈ మాట కనిపిస్తుంది, అక్కడ “పోషించి” అని అనువదించబడింది. ఎలా అయితే క్రీస్తు చర్చిని పోషించి, శ్రద్ధ చూపిస్తారో అలాగే భర్తలు తమ భార్యల పట్ల ప్రవర్తించాలి. మరో మాటలో చెప్పాలంటే, తండ్రులుగా వారు తమ పిల్లలను పరిపక్వతకు తీసుకురావాలి, అలాగే భర్తలుగా వారు తమ భార్యలకు ఉపాధ్యాయులు, శిక్షకులు మరియు పోషకులుగా ఉండి, వారి భార్యలను పరిపక్వతకు తీసుకురావాలి.
బాధకరమైన విషయము ఏమిటంటే చాలా మంది పురుషులు తమ పిల్లలకు “నంబర్ 1 నాన్నగా” ఉండాలని కోరుకుంటారు,కానీ భర్తలుగా తమ పాత్రలో ఘోరంగా విఫలమవుతారు. వారు తమ భార్యల పట్ల ద్వేషం కలిగి వారిని లైంగిక వస్తువులుగా, వంట చేసేవారుగా, డబ్బు సంపాదించే యంత్రాలుగా, తమ వంశాన్ని వృద్ధిచేసే పాత్రలుగా పరిగణిస్తారు. అయినప్పటికీ తాము గొప్ప తండ్రులుగా ఉండాలని కోరుకుంటారు. భర్తగా విఫలమైనవారు తండ్రిగా కూడా విఫలమవ్వడానికి అవకాశం ఉంది.
తమ పిల్లలు పరిణితి చెందేలా చేయాలని పౌలు తండ్రులకు ఆజ్ఞాపించాడు. దానికి 2 విధానాలు ఉన్నాయి. “ప్రభువుయొక్క శిక్షలోను, బోధలోను” పెంచాలి.
శిక్ష అనే పదం క్రమశిక్షణ కలిగిన క్రమబద్ధమైన శిక్షణ అనే ఆలోచన కలిగివుంది. దేవుడు మనకు శిక్షణ క్రమశిక్షణ ఇచ్చే నేపథ్యంలో ఈ పదం హెబ్రీ 12:5-11 లో అనేకసార్లు ఉపయోగించబడింది. బోధ అనే పదంలో ప్రమాదలకు దూరంగా ఉండాలనే హెచ్చరిక, జాగ్రత్త ఉంది. హెచ్చరిక నేపథ్యంలో 1 కొరింథి 10:11 మరియు తీతు 3:10 లో ఉపయోగించబడింది. ప్రభువుయొక్క అనే పదంలో తండ్రులు దేవుని ప్రతినిధులుగా ఉండి తమ పిల్లలు దేవునికి మహిమ తెచ్చేలా వారికి శిక్షణ బోధ అందించాలి.
ఈ శిక్షణ లేదా క్రమశిక్షణ, ప్రభువు యొక్క బోధ 4 మార్గాల ద్వారా సాధించబడుతుంది: 1. బోధన 2. క్రమశిక్షణ 3. ప్రేమించడము 4. ఒక మంచి మాదిరిగా ఉండడము. వీటిలో ప్రతి ఒక్కదాని గురించి క్లుప్తంగా చూద్దాము.
1. బోధన
తండ్రులు బోధకులుగా ఉండాల్సిన అవసరాన్ని ప్రపంచం కూడా గుర్తించింది. కన్ఫ్యూషియస్ అనే చైనీసు తత్వవేత్త “తన కొడుకుకు అతని బాధ్యతలు నేర్పని తండ్రి, ఆ బాధ్యతలను నిర్లక్ష్యం చేసిన కొడుకుతో సమానంగా దోషి అవుతాడు” అని చెప్పాడు. అయితే క్రైస్తవ తండ్రులు ఏమి బోధించాలి? అన్నింటిలో మొదటిది, బైబిల్ సత్యాలను బోధించడం.
2 తిమోతి 3:16-17 “16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”
బైబిలు సత్యాలను బోధించడమనే ఈ భావనకు పునాది ద్వితీయో కా 6: 6-7లో ఉంది, “6 నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.”
తండ్రులు [తల్లులు] తమ పిల్లలకు వారే ప్రాథమిక ఉపాధ్యాయులుగా ఉంటారు కాని సంఘం కాదు, పాఠశాల కాదు, మామ్మ,తాతలు కాదు, కేవలం తల్లిదండ్రులు మాత్రమే! ఇది చాలా స్పష్టంగా ఉంది. మోషే 6వ వచనంలో తల్లిదండ్రులకు ఏమి చెప్పాడో గమనించండి: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.” మీ దగ్గర లేని వాటిని మీరు ఇవ్వలేరు! కాబట్టి, తల్లిదండ్రులు లేఖనాలను అధ్యయనం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
తల్లిదండ్రులారా, మనం లేఖనాలకు సమయం వెచ్చిస్తున్నామా? నేను అవును అని అనుకుంటున్నాను. అప్పుడే మన పిల్లలకు బైబిలు బోధ అందించగలము. 7వ వచనంలోని “అభ్యసింపజేసి” అనే పదానికి రాయిపై ఉలితో అక్షరాలను చెక్కడం అని భావం. దీనికి కష్టపడి పనిచేయాలి. అదే మనకు ఇవ్వబడిన పిలుపు. పదాల ద్వారా సూచించబడినట్లుగా, బైబిలు బోధలు మన పిల్లల హృదయాలలో శాశ్వతంగా నిలిచివుండిపోయేలా మనము అన్ని సమయాలలో (నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును) కృషి చేయాలి. అస్తమానం బైబిలును చెబుతూ ఉండమని దీని అర్థంకాదు కాని జీవితంలో అన్ని విషయాలలో తీసుకునే నిర్ణయాలపై బైబిలు సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేలా మనం పిల్లలకు సహాయం చేయాలి.
ప్రతిరోజు స్పష్టమైన బైబిలు బోధ కోసం సమయాన్ని నిర్ణయించుకోవాలి. కుటుంబమంతా కలిసి బైబిలు పఠనం చేయడానికి ప్రార్థించడానికి ఒక క్రమమైన సమయం పాటించాలి. బైబిలు సత్యాలు జీవితంలోని అన్ని రంగాలలో వర్తిస్తాయి కాబట్టి ఆ ప్రత్యేకమైన సమయంలోనే కాకుండా వీలైనప్పుడు సాధారణరీతిలో బైబిలు బోధ ఉండాలి. దేవునికి భయపడడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, పాపం వల్ల కలిగే ప్రమాదాలు, పాపంపై దేవుని తీర్పు, సిలువ గురించి, పశ్చాత్తాపం, క్షమాపణ మొదలైనవాటి గురించి వారిని హెచ్చరించి వారికి నేర్పించాలి. మరోమాటలో చెప్పాలంటే, వారి రక్షణ గురించి తపించాలి.
2 తిమోతి 3:15 “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు.”
తిమోతి తల్లి యునీకే, అమ్మమ్మ లోయి చిన్నప్పటి నుండి అతనికి లేఖనాలు బోధించారు, చివరికి వాటి ద్వారా అతడు రక్షణ పొందుకున్నాడు. ఉపయోగించిన సాధనాలు యేసుక్రీస్తు గురించి తెలియచేసే లేఖనాలు. ఈ అంశంపై జాన్ పైపర్ చెప్పిన మాటలు:
“తల్లిదండ్రులారా, విజయవంతమైన పెంపకం అంటే పిల్లల గురించి ఫిర్యాదు చేయడం కాదు కాని సువార్త నింపబడిన జీవనం మరియు బోధ. మన పాపాల కోసం సిలువ వేయబడిన క్రీస్తును, మన విమోచన కోసం తిరిగి లేచిన క్రీస్తును, తండ్రి ప్రేమ చూపుతున్న క్రీస్తును మరియు ఆత్మకు అనుదిన సహాయానికి ఇస్తున్న క్రీస్తును మీ పిల్లలకు చూపించండి. కేవలం క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి మాత్రమే కాదు దానిని బలపరచి ఒక రూపాన్ని ఇచ్చి స్థిరపరిచేదే ఈ సువార్త అని వారికి చూపించండి. క్రీస్తు వారి హృదయాలలో ప్రవేశించి వారి నిధిగా మారే వరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి, ప్రేమించండి, బోధించండి.” [నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము]
కాబట్టి మనం వారికి బైబిలు సత్యాలను బోధించాలి. వారు అర్థం చేసుకోవడానికి వీలుగా వారి వయస్సుకి తగిన అనువాదంలో బైబిలు వారికి ఇవ్వాలి. వారికి అర్థం కానిది వారికి ఇవ్వడంలో అర్థం లేదు!
మనం వారితో చదవాలి, వారికి చదివి వినిపించాలి, వారు స్వంతంగా చదువుకునేలా వారికి సహాయం చేయాలి.
బైబిలు వచనాలను కంఠస్థం చేయడం ధ్యానించడం వారికి నేర్పించాలి. వారానికి 1 వచనంతో మొదలుపెట్టడం కూడా మంచి ప్రారంభం కావచ్చు. ఆ వచనం అర్థాన్ని వివరించమని అడగడం పిల్లలు లేఖనాలను తమంతట తామే అధ్యయనం చేయడానికి సహాయపడేందుకు మరొక మార్గము. వారి దైనందిన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించడంలో మనం వారికి సహాయం చేయాలి.
ప్రార్థించడం మనం వారికి నేర్పించాలి. తండ్రులు పిల్లలతో, పిల్లల కోసం ప్రార్థన చేయాలి అలాగే పిల్లలు తమంతట తాముగా ప్రార్థించడంలో సహాయపడాలి. వారు స్వంతంగా దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలని వారికి బోధించాలి. ప్రతిదాని గురించి ప్రార్థన చేయమని ప్రార్థన లేకుండా ఏమీ చేయకూడదని పిల్లలను ప్రోత్సహించాలి. చిన్న చిన్న వాటితో సహా అన్ని ఆశీర్వాదాలకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వారికి నేర్పించాలి! వారు గదిలోనికి వెళ్లి దేవునితో ఏకాంతంగా మాట్లాడేలా వారిని ప్రోత్సహించాలి. వారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒంటరిగా గదిలో 5 నిమిషాల ప్రార్థన కూడా మంచి అలవాట్లను అలవరచుకోవడానికి సహాయపడుతుంది. మరియు వారికి దీన్ని నేర్పడానికి ఉత్తమ మార్గం వారి ముందు ఒక రోల్ మోడల్‌ను సెట్ చేయడం. తండ్రులారా, మనం మోకాళ్లపై నిలబడి తరచు ప్రభువుకు మొరపెట్టడం వారు చూస్తే, వారు కూడా అలాగే చేయాలని ప్రోత్సహించబడతారు.
పగతీర్చుకోకూడదని మనం వారికి నేర్పాలి. చాలామంది తండ్రులు తమ పిల్లలు వేరే పిల్లలు తమను బాధపెడుతున్నారని ఫిర్యాదు చేసినప్పుడు రేపు వెళ్ళి వారిని కొట్టమని చెప్పడం చాలా విచారకరము. బాధపెట్టిన వారికోసం ప్రార్థించమని పిల్లవాడిని ప్రోత్సహించే బదులు, అవసరమైతే, ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయమని చెప్పడానికి బదులు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో వారికి నేర్పుతున్నారు. క్రైస్తవ సూత్రాలకు ఎంతలా మార్చివేస్తున్నారో! మనల్ని కించపరిచే వారిపై మనం ప్రతీకారం తీర్చుకోవడం వారు చూడకపోవడం ఎంతో మంచిది లేకపోతే ప్రతీకారం తీర్చుకోకూడదనే మనం చేసే బోధలు ఎందుకూ పనికిరావు.
పని విలువ గురించి వారికి నేర్పించాలి. పని చేయడం ఎందుకు మంచిది, నిజాయితీతో కూడిన మంచి శ్రమ గురించి బైబిలు ఏమని ఆదేశిస్తుందో మనం వారికి వివరించాలి.
డబ్బును ఎలా వాడాలో మనం వారికి నేర్పించాలి. మనం వస్తువుల విలువను నేర్పించాలి కాని వాటి ఖరీదును కాదు. మన పిల్లలు కోరుకున్నవాటన్నిటిని ఇస్తూ వారనుకున్న వాటన్నిటిని చేస్తూ వారిని పెంచకూడదు.
వారు తమకున్న వాటిని అవసరమున్న వారితో పంచుకోవడానికి మనం వారికి నేర్పించాలి. వారికి చిన్నప్పటి నుండే ఉదారంగా ఉండేలా నేర్పించాలి.
తండ్రులారా, మనం ఈ బోధనా బాధ్యతను చాలా గంభీరతతో తీసుకుందాం. విశ్వాసియైన జార్జ్ హెర్బర్ట్ “ఒక తండ్రి వందమంది స్కూలు టీచర్లకన్నా ఎక్కువ” అన్నాడు. ఈ మాటలు ఎంతో సత్యం!
కాబట్టి, దైవభక్తిగల పిల్లలను పెంచడానికి తండ్రులు తమ ప్రయత్నాలలో ఉపయోగించాల్సిన మొదటి సాధనం బోధన.
2. క్రమశిక్షణ
పైన పేర్కొన్న బోధనా అంశాన్ని అనుసరించనప్పుడు, దిద్దుబాటు శిక్షణలో బోధన భాగంగా ఉంటుంది. మన రోజుల్లో క్రమశిక్షణ అనేది చాలా సున్నితమైన విషయం అని నేను అర్థం చేసుకున్నాను. కొందరు ఈ అంశంతో విభేదించవచ్చు కూడా. అయితే విశ్వాసులుగా మనం “ఈ క్రమశిక్షణ గురించి బైబిలు ఏమి చెబుతోంది?” అని అడగాలి. ఇది మన భావాలకు సంబంధించినది కాదు కానీ దేవుని వాక్యము! అక్కడ సంపూర్ణ అధికారం ఉంది.
దేవుడు ఉత్తమ తండ్రి, ఆయన తన పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతాడు. హెబ్రీ 12:5-11లో తండ్రియైన దేవుడు తన పిల్లలమైన మనల్ని “మన మంచి కోసం” క్రమశిక్షణలో పెడతాడని వివరించబడింది [10-11 వచనాల]. మానవులైన తండ్రులు తమ పిల్లలను వారి మంచి కోసం [12:9] క్రమశిక్షణలో ఉంచుతారని ఈ భాగంలో ఉంది. కాబట్టి అది మనకు మాదిరి.
జ్ఞానంతో నిండిన సామెతల గ్రంధంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అవసరమైనప్పుడు క్రమశిక్షణలో పెట్టాలని అనేకసార్లు చెప్పబడింది. వాటిలో కొన్ని:
సామెతలు 13:24 “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి; కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.”
సామెతలు 19:18 “బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము; అయితే వాడు చావవలెనని కోరవద్దు.”
సామెతలు 23:13-14 13 “నీ బాలురను శిక్షించుట మానుకొనకుము; బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును. 14 బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.”
కాబట్టి, తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టమని తల్లిదండ్రులకు దేవుడు ఆజ్ఞాపించాడని స్పష్టమవుతుంది. వాస్తవానికి, ఏ తల్లిదండ్రులు విసుగుతో పిల్లలను దండించడం క్రమశిక్షణలో పెట్టడం చేయకూడదు. అలా చేస్తే వారు సరిగా చేయలేరు. బైబిలులో బెత్తం అనే పదానికి అర్థం తుప్పుపట్టిన పాత ఇనుప ఊచ అని కాదు కాని క్రమశిక్షణ నేర్పుతున్నప్పుడు ఉపయోగించే కర్ర అని అర్థము.
దీనర్థం బాధించమని కాదు కాని కొంచెం నొప్పి కలిగించడమే. అప్పుడు అవిధేయతకు పరిణామాలు ఎలా ఉంటాయో పిల్లలు అర్థం చేసుకుంటారు. మన పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా మనం వారికి నేర్పించే పెద్ద సూత్రము: పాపానికి పరిణామాలు ఉంటాయి; కొన్నిసార్లు దీర్ఘకాలిక పరిణామాలు. దాని నుండి రక్షించబడటానికి ఉన్న ఏకైక మార్గం క్షమాపణ కోసం క్రీస్తు వద్దకు పరుగెత్తడమే.
క్రమశిక్షణా ప్రక్రియ తర్వాత పిల్లల అవిధేయతకు దేవుని క్షమాపణ కోరుతూ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ప్రార్థించాలి అలాగే అవిధేయతకు క్షమాపణ కోరుతూ దేవునికి ప్రార్థన చేయమని పిల్లలను ప్రోత్సహించాలి. “సారీ జీసస్” వంటి మాటలు చెప్పమని వారికి బోధించడం ద్వారా చిన్న వయస్సులోనే దీనిని ప్రోత్సహించవచ్చు. వారు పెద్దయ్యాక, క్షమాపణ కోరుతున్నప్పుడు ప్రార్థన చేయడానికి వారికి మరిన్ని పదాలు నేర్పించాలి! వారు ప్రతిదీ అర్థం చేసుకోకపోతే చింతించాల్సిన అవసరం లేదు. పాపాలను క్షమించమని దేవుని దగ్గరకు వెళ్లే మంచి అలవాటును చిన్నవయసులోనే నేర్పిస్తున్నాము.
పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపడమే క్రమశిక్షణ కాదు. వారు పెద్దయ్యాక రక్షణ కోసం క్రీస్తు వద్దకు పరిగెత్తుతారు అదే ముఖ్యమైన అంశము; అన్ని క్రమశిక్షణల నిరీక్షణ అదే. ఇది పిల్లల మంచి కోసమే. తల్లిదండ్రులు విశ్వాసంతో ఈ నమ్మకాన్ని కలిగివుండాలి. తల్లితండ్రులు నిరంతరం పిల్లల వెనుక పరిగెడుతూ, వారిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తూ తిరుగుబాటు స్వభావం కలిగిన పిల్లలను పెంచడం మంచిది కాదు. అందుకే క్రమశిక్షణ చిన్నవయసులోనే ప్రారంభించాలి. లేఖనాల్లోని ఆదేశం: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి;” [ఎఫెసి 6:1] అని ఉంది కాని “తల్లిదండ్రులారా మీ పిల్లలకు విధేయులైయుండుడి అని కాదు.”
క్రమశిక్షణకు సంబంధించిన ఆదేశం తండ్రులకే కాదు కాని తల్లిదండ్రులిద్దరికీ వర్తిస్తుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా అలా చేయడంలో విఫలమైతే అది పాపము; దాని ఫలితం ఏమిటంటే, పాపం చేస్తున్న తమ బిడ్డలను క్రమశిక్షణలో పెట్టడంలో విఫలమైనందుకు దేవుడు పాపం చేస్తున్న తల్లిదండ్రులను క్రమశిక్షణలో ఉంచుతాడు!
చిన్న వయస్సు అయినప్పటికి అన్ని క్రమశిక్షణలు శారీరకంగానే ఉండవలసిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో, కొన్ని ఆనందాలను శిక్ష రూపంలో నిలిపివేయవచ్చు. మాట్లాడటం, ఇతర మృదువైన శిక్షలు పని చేయనప్పుడ తల్లిదండ్రులు శారీరక క్రమశిక్షణ ఉపయోగించాలి. మనం వారిని శారీరకంగా క్రమశిక్షణలో పెట్టలేని సమయం వస్తుంది అప్పుడు మాటలు మాత్రమే పని చేస్తాయి. కానీ శారీరక క్రమశిక్షణతో వారు ఎదగడానికి సహాయపడే సమయం కూడా ఉంది.
కాబట్టి, బోధనతో పాటు వారికి అవసరమైన క్రమశిక్షణ కావాలి. ఇది తండ్రులు చేయవలసిన రెండవ పని.
3. ప్రేమించడము
తండ్రులారా, మీ పిల్లలలో అందరినీ సమానంగా ప్రేమించండి! వారిని మీ జీవితంలో ఆటంకంగా చూడకండి. వారితో సమయం గడిపి ప్రేమ చూపించండి. ప్రేమగా మాట్లాడండి. వారు పాల్గొనే కార్యక్రమాలలో వీలైనంత వరకు అక్కడే ఉండండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు అక్కడ ఉండలేరని నేను అర్థం చేసుకోగలను. కానీ వీలైనంత వరకు, మీరు ఉండి ప్రేమ చూపించండి. మీ ఫోన్ లేదా టీవీని చూస్తూ పరధ్యానంలో పడకుండా వారితో మాట్లాడండి. వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. మంచి శ్రోతగా ఉండి ప్రేమ చూపించండి. పిల్లలు బహుమతుల కంటే వారి తల్లిదండ్రుల సాంగత్యాన్నే ఎక్కువగా కోరుకుంటారు.
ఫిలడెల్ఫియాలోని ఒక ప్రముఖ క్రైస్తవ వ్యాపారవేత్త తన ఆరేళ్ల కుమార్తెతో తగినంత సమయం గడపడం లేదని అతని భార్య భావించింది. ఆ బాధంతా ఒక్కసారిగా తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు.
అతని లిమోసిన్ డ్రైవర్ అతనిని ఆమె పాఠశాలకు తీసుకువెళ్లాడు, ఆమెను తీసుకువచ్చి వెనుక సీటులో అతని పక్కన కూర్చోబెట్టాడు. వారు న్యూయార్క్ నగరానికి బయలుదేరి వెళ్ళారు, అక్కడ అతడు ఖరీదైన ఫ్రెంచ్ రెస్టారెంట్‌లో విందు కోసం రిజర్వేషన్లు చేయించి బ్రాడ్‌వే షోకి టిక్కెట్‌లు తీసుకున్నాడు.
ఆ సాయంత్రం అలసిపోయిన తర్వాత వారు ఇంటికి వెళ్లారు. ఉదయం ఆ పాప తల్లి సాయంత్రం ఎలా గడిచిందో తెలుసుకోవాలని ఆసక్తిగా “మీకు ఇది నచ్చిందా?” అని అడిగింది.
ఆ చిన్నారి ఒక్క క్షణం ఆలోచించింది. “బాగానే ఉందని అనుకుంటున్నాను కానీ నేను మెక్‌డొనాల్డ్స్‌లో తింటే బాగుండేది. ఆ షో నాకు నిజంగా అర్థం కాలేదు. కానీ మంచి విషయం ఏమిటంటే, మేము ఆ పెద్ద కారులో ఇంటికి వస్తున్నప్పుడు, నేను నాన్న ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయాను” అని చెప్పింది.
ప్రేమ నిండిన చిన్ని చిన్ని పనులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఒకరు తాము దగ్గర లేకుండా పిల్లలను పెంచలేరు, వారికి ప్రేమ చూపలేరు!
కాబట్టి, బోధించడం, క్రమశిక్షణతో పాటు మనం వారిని ప్రేమించాలి. ఇది తండ్రులు చేయవలసిన మూడవ పని.
4. మంచి మాదిరిగా ఉండడము
బోధన ముఖ్యం. కానీ మన బోధల ప్రకారం జీవించడం చాలా కీలకము. దేవుని వాక్యంలోని సత్యం మేకు వంటిది. మన జీవితం మేకును లోపలికి గెంటే మాదిరి.
మనం మన పిల్లలకు బైబిలు చదవమని, క్రమం తప్పకుండా ప్రార్థించమని చెబుతూ మనం ఆ మాదిరిని చూపలేకపోతే ఆ బోధన ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? నిజం చెప్పడానికి ఉన్న ప్రాముఖ్యతను వారికి చెప్పి, అబద్ధం చెప్పినందుకు వారిని శిక్షిస్తూ చిన్న విషయాలలో కూడా మనం అబద్దం చెప్పడం వారు చూస్తే, మన మాదిరి ఏమిటి? మనం డబ్బు గురించి, వస్తువుల గురించి ఎప్పుడూ మాట్లాడడం చూసిన మన పిల్లలు ఏమి నేర్చుకోవాలని మనం ఆశిస్తున్నాము?
మనం ప్రతి విషయంలోనూ దేవుని విశ్వసించడం, లేఖనాలను ధ్యానించడం, ప్రార్థన చేయడం, వినయంతో ఉండడం, మన మాటల్లో నిజాయితీగా మరియు దయతో ఉండడం, దేవుని రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం, క్షమాగుణాన్ని కలిగివుండడం వంటివి మన పిల్లలు చూస్తే, ఆ మాదిరి ఎలా ఉంటుంది?
కాబట్ట బోధించడం, క్రమశిక్షణ, ప్రేమతో పాటు మనం వారి ముందు బైబిలుపరమైన మాదిరిని ఉంచాలి. అది తండ్రులు చేయవలసిన నాల్గవ మరియు చివరి పని.
తండ్రులారా, ఏమి చేయకూడదు ఏమి చేయాలి అనేవి మనం చూసాము. “అపరాధ తండ్రులు” కేటగిరీ కిందకు వచ్చే వారిగా మనం ఉండకూడదు. ఈ సత్యాలను హృదయంలో ఉంచుకుని, ఆయన మనకు ఏమి చేయమని ఆజ్ఞాపించారో అది చేయడంలో మనకు సహాయం చేయడానికి ప్రభువుపై నమ్మకం ఉంచుదాము.
మీరు మంచి తండ్రి అయితే, దానికి దేవునికి ధన్యవాదాలు. ఆయనకు సమస్త మహిమ చెల్లించి ఆయనపై ఆనుకోవడం కొనసాగించండి. తండ్రిగా మీ బాధ్యతల విషయంలో కష్టపడుతూ ఉంటే, ఆయనను వేడుకోండి. మీ వైఫల్యాలు, హృదయ వేదనలు ఆయనకు తెలుసు. మీరు గత వైఫల్యాల పర్యవసానాలను అనుభవిస్తున్నప్పటికీ, దేవుడు వాటి నుండి మంచిని తీసుకురాగలడు. ఆయన పరిస్థితులను మార్చేవాడు. మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు, దైవభక్తిగల తండ్రిగా ఉండేందుకు ఆయన మీకు సహాయం చేస్తాడు.
మీరు మీ పిల్లలను పెంచడానికి ఆధ్యాత్మిక భాగస్వామి లేని ఒంటరి తల్లి లేదా తండ్రి అయినప్పటికీ ధైర్యం కోల్పోకండి. మంచి పోరాటాన్ని కొనసాగించండి. మీ హృదయ వేదనలు ప్రభువుకు తెలుసు. ఆయనపై నమ్మకం ఉంచడం కొనసాగించండి. ఆయన అన్ని పోరాటాలలో మీకు తోడుగా ఉంటారు.
తండ్రులకు [తల్లులకు] నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే: మన మోకాళ్లపై ఉండి పిల్లలను పెంచడం నేర్చుకుందాము. మన కుటుంబాల కోసం మనం నిరంతరం వేడుకుంటూనే ఉండాలి. భూమిపై జీవించిన గొప్ప వ్యక్తి పాపరహితుడైన దేవుని కుమారుడు నిరంతరం ప్రార్థనలకు తనను తాను అంకితం చేసుకుంటే, మన ప్రార్థనలలో మనం నిర్లక్ష్యంగా ఉండగలమా? మన మాటలు మన పిల్లలపై సానుకూలంగా ప్రభావం చూపించాలంటే, వారి హృదయాలను మార్చగలిగే ప్రభువుతో మనం ప్రతిరోజూ ఎక్కువ సమయం గడపాలి! “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” [యోహాను15:5] అని మన ప్రభువు స్పష్టంగా చెప్పాడు.
చివరగా, మంచి తండ్రులు లేని వారితో సహా మనందరికీ దేవుడే నిజమైన తండ్రి అని తెలుసుకోమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. ఈ గొప్ప తండ్రి తన కుమారుడిని మన పాపాలకు సంపూర్ణ బలియాగంగా పంపాడు, తద్వారా క్రీస్తు ద్వారా ఆయనను విశ్వసించే వారు ఆయన కుటుంబంలోకి దత్తత తీసుకోబడతారు అప్పుడు వారు ఆయనను అబ్బ తండ్రీ అని పిలుస్తారు. ఎంతటి ఆధిక్యత! క్రీస్తు ద్వారా, తండ్రియైన దేవునిలో మనకు కావలసినవన్నీ పొందగలము. మనం ఆయన బిడ్డగా ఆయనలో విశ్రాంతి తీసుకోవచ్చు.