దైవభక్తిగల తండ్రి వర్ణన 1వ భాగము

(English version: “Portrait Of A Godly Father – Part 1 – What Not To Do!”)
“ఒక దేశం యొక్క నాశనం దాని ప్రజల ఇంటిలోనే ప్రారంభమవుతుంది” అని ఒక ఆఫ్రికా సామెత చెబుతుంది. దురదృష్టవశాత్తు, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు కూలిపోతున్నప్పుడు ఈ సామెతలోని నిజం మన కళ్ల ముందు కదలాడడం మనం చూస్తాము. ఇలా విడిపోవడానికి గల కారణాలలో ఒకటి తండ్రులు. వారిని “కర్తవ్యాన్ని విడిచిపెట్టిన తండ్రులని” లేదా “అపరాధులైన తండ్రులని” వర్ణించవచ్చు.
న్యాయవ్యవస్థ దృష్టిలో అపరాధియైన తండ్రి తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైయ్యాడు. అంటే పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తూ మొత్తం బాధ్యత తల్లికే అప్పగిస్తాడు. కాబట్టి, ఈ అపరాధులైన తండ్రుల విషయాన్ని కోర్టులు చాలా తీవ్రంగా పరిగణించి నిరంతరం ఈ సమస్యను పేర్కొంటున్నాయి.
అయితే, నేను ఇక్కడ ప్రస్తావిస్తున్న అపరాధులైన తండ్రులు దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా అపరాధులు. వీరు తమ ఆధ్యాత్మిక కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైన తండ్రులు. ఈ రకమైన తండ్రులు పిల్లలకు భౌతికమైన లౌకికమైన విద్యా సంబంధమైన అవసరాలు తీర్చడం ద్వారా తమ కర్తవ్యం నిర్వర్తించామని భావిస్తారు. దాని ఫలితం ఆధ్యాత్మిక అనాథలు పెరగడమే. అందుకే దైవభక్తిగల తండ్రుల కోసం, దేవుని దృష్టిలో సరైన దానిని చేయాలనుకునే తండ్రుల కోసం మనం మొరపెట్టాలి.
అలాంటి తండ్రులుగా ఉండాలనుకునే వారికి తోడుగా అపొస్తలుడైన పౌలు ఎఫెసి 6:4లో, “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని చెప్పాడు. ఏమి చేయకూడదు [ప్రతికూలమైనది], ఏమి చేయాలి [అనుకూలమైనది] అని చెబుతూ తండ్రులకు 2 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి.
ఈ ప్రచురణలో మొదటి ఆజ్ఞ గురించి తదుపరి ప్రచురణలో రెండవ ఆజ్ఞ గురించి చూస్తాము.
[గమనిక: ఈ ఆజ్ఞ తండ్రులకు నిర్దేశించబడినప్పటికీ చాలావరకు తల్లులకు కూడా వర్తిస్తుంది!]
తండ్రులు—ఏమి చేయకూడదు [ప్రతికూలమైనది]
“తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి.” ఈ వాక్యంలోని “తండ్రులు” అనే పదం ప్రధానంగా తండ్రులకు సూచించినప్పటికి, హెబ్రీ 11:23లో “తల్లిదండ్రులు” అని తర్జుమా చేయబడినట్లుగా [మోషే తల్లిదండ్రులు] సందర్భానుసారంగా ఈ వాక్యం తల్లిదండ్రులిద్దరికి వర్తిస్తుంది. అయితే ఇక్కడ ప్రాథమికంగా తండ్రులపై దృష్టి సారించారని భావిస్తున్నాను. అయితే, ఈ సత్యాలు తల్లులకు కూడా సమానంగానే వర్తిస్తాయి!
పౌలు తండ్రులకు సూటిగా ఆజ్ఞ ఇచ్చాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి.” రేపకండి అనే పదానికి వాళ్ళకు కోపం పుట్టించడం, విసిగించడం, రెచ్చగొట్టడం, చికాకు కలిగించడం అని అర్థం. వీటితో పాటు కొలసి 3:21 లోని పౌలు తండ్రులకు వ్రాసిన మాటలు, “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” మరో మాటలో చెప్పాలంటే, పిల్లలు కోపగించుకునేలా విసుగు చెందేలా క్రుంగిపోయేలా ప్రవర్తించవద్దని పౌలు తండ్రులకు ఆజ్ఞాపించాడు.
ఆలోచింపచేసే ప్రశ్న ఏమిటంటే: పిల్లలు
కోపగించుకుని చిరాకుపడి క్రుంగిపోవడానికి తండ్రులు ఎలా కారణమవుతారు? వాటిలో 7 కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. అధిక రక్షణ
చాలామంది తమ పిల్లలకు ఏమి జరుగుతుందో అని చాలా భయపడుతూ ఎప్పుడూ పిల్లల వెనుకే ఉంటారు. వారు ఎప్పుడూ తమ పిల్లలకు “ఇది చేయకు, అది చేయకు” అని చెబుతూనే ఉంటారు. వారు తమ పిల్లలను ఇతర పిల్లలతో కూడా కలవనివ్వరు.
“ప్రతికూల ప్రభావాలన్నిటి నుండి నేను నా పిల్లలను రక్షించకూడదా?” అని మీరు అనుకోవచ్చు. నిజమే, పిల్లలను హెచ్చరించాలి గమనించాలి కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. అధిక రక్షణ పొందినట్లయితే, అది పిల్లలకు విసుగు తెప్పిస్తుంది. దాని ఫలితంగా వారిలో పగతో కూడిన వైఖరి పెరుగుతుంది.
2. పక్షపాతము
పక్షపాతం అంటే మిగిలిన వారందరికంటే ఒక బిడ్డపైనే ఇష్టం చూపడము. ఉదాహరణకు, ఇస్సాకు యాకోబు కంటే ఏశావును ఇష్టపడాడు [ఆది 25:28]; రెబెకా ఏశావు కంటే యాకోబును ఇష్టపడింది [ఆది 25:28]; యాకోబు తన పిల్లలలో యోసేపును ఎన్నుకున్నాడు [ఆది 37:3]. అయితే అది అనార్థాలకు దారితీసింది.
పక్షపాతానికి అనేక కారణాలు ఉండవచ్చు. బహుశా ఒక పిల్లవాడు మిగిలిన వారి కంటే మీ అంచనాలు అందుకుని మీకు ఇష్టంగా మారవచ్చు. బహుశా ఆ పిల్లవాడికి మీకున్న అలవాట్లే ఉండి ఉండవచ్చు. ఆ బిడ్డ మిగిలినవారి కన్నా తెలివిగా ఉండవచ్చు. కాబట్టి మీరు ఆ బిడ్డ పట్ల ఎక్కువగా ప్రేమ చూపుతారు.
తత్ఫలితంగా, ఇష్టమైన వారు తప్పించుకుంటారు, ఇతర పిల్లలు చిన్న చిన్న కారణాలకే శిక్షించబడతారు. ఏది ఏమైనప్పటికీ, పక్షపాతం వలన నిర్లక్ష్యం చేయబడిన బిడ్డ లేదా పిల్లలు కొంతకాలానికి ద్వేషంతో కోపంతో నిండిపోయి క్రుంగిపోతారు.
3. అన్యాయమైన డిమాండ్లు
చాలామంది తల్లిదండ్రులు తాము సాధించాలనుకున్న వాటిని లేదా తాము సాధించలేకపోయిన వాటిని తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. మరోరకంగా చెప్పాలంటే, వారు తమ పిల్లల ద్వారా తమ జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు. డాక్టరు అవ్వండి, ఇంజనీరు అవ్వండి, ఆటలలో రాణించండ మొదలైనవి. అన్నిటిలో విజయం సాధించాలని వారిని ముందుకు నెడుతుంటారు. అలాంటి ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది.
పిల్లలు రాణించాలని ఆశించడం తప్పా? అంటే మన ఉద్దేశాలు దేవుని మహిమపరిచేవిగా ఉంటే మరియు వారి జీవితాలలో ప్రభువు చిత్తం అదే అయితే తప్పుకాదు. ఏమైనప్పటికీ, అన్యాయమైన డిమాండ్లు పిల్లలను క్రుంగదీసి వారిలో ద్వేషం పుట్టిస్తాయి. పిల్లలలో తాము ఎప్పుడూ ఓడిపోమనే భావన పెరిగిపోతుంది. తల్లిదండ్రుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటేనే వారు తమను ప్రేమిస్తారనే భావన పిల్లలలో ఏర్పడుతుంది.
4. ప్రేమరాహిత్యము
కొంతమంది తండ్రులు పిల్లలను తమ జీవితానికి అడ్డంకిగా చూస్తారు. నాకు స్వేచ్ఛంటే ఇష్టం కానీ పిల్లల వలన నేను ఆ స్వేచ్ఛను కోల్పోయాను; నాకున్న సమయంతో నేను కోరుకున్నది చేయలేకపోతున్నాను అనే ఆలోచనలు కలిగివుంటారు కాబట్టి ప్రేమ చూపించలేరు. అంతేకాకుండా, పిల్లల వలన తల్లి ఉద్యోగం చేయలేనప్పుడు కెరీరులో ముందుకు వెళ్లలేనప్పుడు పిల్లలు ఆర్థిక పురోగతికి, స్థిరత్వానికి ఆటంకంగా కనిపిస్తారు.
చాలామంది తండ్రులు తమ పిల్లలతో సమయం గడపకపోవడం వారు పిల్లలను ప్రేమించడంలో విఫలమవ్వడానికి ఒక కారణము. ఎందుకంటే వారు లోకవ్యవహారాలలో ఇతర ఆనందాలలో మునిగిపోయి ఉన్నందున వారికి పిల్లలతో గడపడానికి సమయం ఉండదు.
సంవత్సరాలు గడిచేకొద్దీ, తమ కన్నా తండ్రికి పనులే ముఖ్యమని పిల్లలు అనుకుంటారు. దాని ఫలితంగా వారిలో ద్వేషం ఆగ్రహం పుడుతుంది.
5. కఠినమైన శిక్ష
తమ పిల్లలను ఎన్నడూ క్రమశిక్షణలో పెట్టని తండ్రులు కొందరైతే, మరికొందరు తీవ్రస్థాయిలో పిల్లలను కఠినంగా శిక్షిస్తారు. వారు నొప్పి కలిగించరు కాని గాయం చేస్తారు. కోపంతో విసుగుతో నిరాశతో నిండిన తండ్రులు కొన్నిసార్లు పిల్లలను కొడతారు. ఆ శిక్షకు సరైన కారణాలు కూడా ఉండవు.
అప్పుడు పిల్లలు, “కొన్నిసార్లు నాన్న ఎందుకు నన్ను శిక్షిస్తారో కూడా నాకు తెలియదు. కోపంగా ఉన్నారేమో నేను మౌనంగా ఉంటాను” అనుకుంటారు. కొన్నిసార్లు వెళ్లి అమ్మకు ఫిర్యాదు చేస్తుంటారు. పాపం ఆ తల్లి ఏమి చెప్పగలదు?
కాలక్రమేణా కఠినమైన శిక్ష కారణంగా పిల్లలు తన తండ్రి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకోవచ్చు. యుఎస్ ప్రెసిడెంటు జార్జ్ డబ్ల్యు బుష్ [కుమారుడు], “నా పెంపకంలో విఫలమయ్యే స్వేచ్ఛ నాకు ఇవ్వబడింది” అని ఒకసారి అన్నారు. కఠినమైన శిక్షలకు భయపడకుండా విఫలమయ్యే స్వేచ్ఛ తమకుందని పిల్లలు భావించాలి.
6. బాధించే మాటలు
“నువ్వు చాలా మూర్ఖుడివి, పనికిరానివాడివి, ఏమీ చేయలేని అసమర్థుడివి” అనే మాటలు చాలా బాధ కలిగిస్తాయి. మనం పిల్లలను ఎప్పుడూ సరిదిద్దలేమని దీని అర్థం కాదు. ఎఫెసి 6:4 లో పిల్లలు తప్పుదారి పట్టినప్పుడు వారిని సరిదిద్దాలనే సత్యం మనకు ఇవ్వబడింది. అయితే, ఇక్కడ విషయం బాధ కలిగించే మాటలు మాట్లాడడము. తండ్రి అవమానకరమైన మాటలు ఉపయోగించినప్పుడు పిల్లల లోపల కోపం ఆగ్రహం పెరిగిపోతాయి. తరువాత ఆ సంబంధాన్ని సరిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాగే దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండడం కూడా మంచిది కాదు. మీ పిల్లాడు ప్రపంచంలోనే ఉత్తముడైతే నిత్య ముఖస్తుతి వలన వారిలో అహం పెరిగిపోతుంది. వారు మంచి చేసినప్పుడు మనం వాటిని గుర్తించాలి అలాగే వారు తప్పు చేసినప్పుడు వాటిని సరిదిద్దాలి. అయితే ఇలా సరిచేసేటప్పుడు మనం మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి.
7. ఇతరులతో పోల్చడము
ఇతర పిల్లలతో పోల్చడం పిల్లలను చాలా ఎక్కువగా బాధిస్తుంది. “వారిని చూడు. నువ్వు వారిలా ఎందుకు ఉండవు?” ఏ పిల్లలైనా ఏదైనా చేసినప్పుడు దేవుడు ఆ పని చేయడానికి వారిని పిలిచినా, పిలవకపోయినా మన పిల్లలు కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాము. ఇతరులు సాధించినట్లే సాధించాలని నిరంతరం వారిని ముందుకు తోస్తాము.
ఒక తండ్రి 20 ఏళ్ల తన కొడుకుతో, “20 ఏళ్లు వయుస్సులో విజయం సాధించినవారు ఎంత మంది ఉన్నారు” అంటూ 20 ఏళ్ల వయస్సులోనే పేరు తెచ్చుకున్న వారిని చూపిస్తూ వారితో పోల్చుతారు. తండ్రి తరచు పోల్చిచూడడంతో విసిగిపోయిన కొడుకు, “సరే, మీరు 50 ఏళ్ల వయస్సులో ఉన్నారు అయితే మీ వయస్సులో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యారు. మీరు ఎందుకు కాలేదు?” అని అడుగుతాడు.
ఎవరైనా తమ పిల్లలను తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు సరిగ్గా పనులు చేస్తున్న ఇతర పిల్లలను ఉదాహరణగా చూపిస్తూ వారిని ప్రోత్సహిస్తే తప్పు లేదు కాని అసూయ నుండి వచ్చిన పోలికతోనే సమస్య.
తల్లిదండ్రులలో ఉండే పోటీతత్వం నుండి ఇటువంటి పోలికలు వస్తాయి. ఫలితంగా, వారు దానిని పిల్లలపైకి నెడతారు! దీని వలన కొంతకాలం తర్వాత పిల్లలు నిరుత్సాహానికి గురవుతారు, విసుగు చెందుతారు. అంతే కాకండా “నా తల్లిదండ్రులు నన్ను నన్నుగా ఎందుకు ప్రేమించలేరు?” అనుకుంటారు.
తండ్రుల [తల్లులు] వలన పిల్లలలో విసుగు కోపం మరియు నిరుత్సాహానికి కలగడానికి గల 7 కారణాలు: అధిక రక్షణ, పక్షపాతము, అన్యాయమైన డిమాండ్లు, ప్రేమరాహిత్యము, కఠినమైన శిక్ష, బాధించే మాటలు, ఇతరులతో పోల్చడము.
వీటికి మరికొన్ని జోడించవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ తల్లిదండ్రులైన మనం నిజాయితీగా మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలంటే: మనం ఈ పాపాలలో ఏదైనా చేశామా లేక అన్ని విషయాలలో దోషులమా? అలా అయితే మనం నిజాయితీగా ప్రభువు వద్దకు వెళ్లి వాటిని మనకు చూపించమని అడగాలి, అప్పుడు ఈ పాపాల గురించి పశ్చాత్తాపపడి క్షమాపణ పొంది ఈ పాపాలను అధిగమించడానికి ఆయన సహాయం కోరండి.
ఏం చేయకూడదో చూశాక, తండ్రులు ఏం చేయాలనేది తర్వాతి ప్రచురణలో చూద్దాము.