దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడము

(English Version: Waiting on God)
“దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చేవరకు కనిపెట్టుకుని ఉండడం మన క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య; ఎదురుచూసే బదులు మనలో ఉండే పాపము వలన తప్పు పని చేస్తాము” అని చెప్పబడింది. ఈ మాటలు సత్యం!
క్రైస్తవ జీవిత వాస్తవాలలో ఒకటి ఏమిటంటే, మనలో ఎవరూ వేచి ఉండటానికి మొగ్గుచూపము. మనం ఏదైనా పొందాలనుకుంటే అది వెంటనే పొందాలనుకుంటాము. కనిపెట్టుకుని ఉండడంలో విఫలమైనందుకు తరచుగా బాధాకరమైన పరిణామాలను అనుభవిస్తున్నప్పటికీ, మనం తరచుగా ఈ పాపాన్ని చేసే అవకాశం ఉంది. సమస్తం ఎరిగిన దేవుడికి మన ఈ ధోరణి గురించి పూర్తిగా తెలుసు. అందుకే మనం తొందర పడకుండా ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం గురించి తన వాక్యంలో పదేపదే చెప్పారు.
ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండడం అంటే ఏమిటి?
దీనర్థం సోమరితనంగా లేదా నిష్క్రియంగా ఉండటం కాదు కాని మన మీద కాకుండా కేవలం దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచడము. అంటే మన సొంత జ్ఞానం, సంపద, బలం, వ్యక్తులతో ఉన్న సంబంధాలపై నమ్మకం ఉంచడం మాని కేవలం దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచడము.
మనమే పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడం లేదా చాలా కాలం కనిపెట్టుకుని ఉండడం వలన శాంతిని కోల్పోవడం, చాలా బాధలు తప్ప మరేమీ ఉండదని గొణుగుకోవడం ఫిర్యాదు చేయడము. జార్జ్ మెక్‌డొనాల్డ్ ఏమన్నాడంటే, “దేవుడు లేకుండా మనిషి ఏ పనైనా చేస్తే అందులో అతడు ఘోరంగా విఫలమవుతాడు లేదా మరింత ఘోరంగా విజయం సాధిస్తాడు.”
వేన్ స్టైల్స్ రచించిన దేవుని కోసం నిరీక్షించండి అనే అద్భుతమైన పుస్తకంలో ఇలా వ్రాశాడు:
మనకు మొదట ఆనందం కావాలి; దేవునికి పరిశుద్ధత కావాలి. మనకు సంతోషం కావాలి; దేవునికి స్వచ్ఛత కావాలి. రెడ్ సిగ్నల్ వద్ద వేచి ఉన్నప్పుడు మనం సిగ్నల్‌ను పట్టించుకోకపోతే ప్రమాదానికి [కొన్నిసార్లు] గురికావచ్చు. అదే విధంగా, కనిపెట్టుకుని ఉండడం వల్ల సమయం వృధా అనిపించి మనం దేవుని కంటే ముందుకు దూకితే దెబ్బతింటాము. కనిపెట్టుకుని ఉండడం అంటే పరిస్థితులను మార్చటం కంటే ఎక్కువగా దేవుడు మనల్ని మార్చే ప్రక్రియ.
బహుశా, మీరు ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండడం వలన అలసిపోయి నిరుత్సాహానికి గురైవుండవచ్చు. “ఎంతసేపు ప్రభువా?” అని నిరంతరం మొర పెట్టివుండవచ్చు. మీరు దాదాపు విడిచిపెట్టేద్దామని అనుకుంటూ ఉంవచ్చు. కాని వదిలిపెట్టకండి! యెషయా 64:4-5 పై దృష్టి సారించడం ద్వారా మీరు ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను మీరు ఆనందించాలని నేను కోరుకుంటున్నాను:
“4 తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు 5 అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించువారిని నీవు దర్శించుచున్నావు.”
దేవుడు తన కోసం కనిపెట్టేవారికి [4b] సహాయం చేయడానికి రావడం ద్వారా వారి పక్షాన కార్యం చేస్తారని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది [5a]. అయితే దేవుడు మన పక్షాన కార్యం చేయాలని మనం కోరుకుంటే, ఈ క్రింది 2 లక్షణాలు మన జీవితాలలో ఉండాలి.
- దేవుని స్వభావం గురించి మనకు ఉన్నతమైన దృక్పథం ఉండాలి [4a]
- మనం పవిత్ర జీవితాన్ని కొనసాగించాలి [5a]
మనకు క్రొత్త కాదు, తెలియనిది ఏమీ లేదు కానీ, ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండమని మనల్ని ప్రోత్సహించే మంచి రిమైండర్.
1. దేవుని స్వభావం గురించి మనకు ఉన్నతమైన దృక్పథం ఉండాలి [4a]
యెషయా 64:4 లో ఏముందో గమనించండి, “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు.” యెషయాకు దేవుని పట్ల ఉన్నతమైన దృక్పథం ఉంది. ముందు వచనంలో గతంలో దేవుడు చేసిన కార్యాలను యెషయా ప్రస్తావించాడు, ప్రత్యేకంగా పర్వతములు తత్తరిల్ల చేశారని చెప్పాడు [యెషయా 64:3]. దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చినప్పుడు సీనాయి పర్వతం వణుకడానికి ఇది సూచన. బైబిలులోని దేవుడు శక్తివంతమైన గొప్ప దేవుడిని ఆయనలాంటి వారు ఎవరూ లేరని యెషయా చూశాడు. ఈ దేవుడు తన ప్రజల పట్ల ప్రేమ దయగలవాడని కూడా అతనికి తెలుసు [నిర్గమ 34:6]. అతడు దేవుని స్వభావం గురించి చాలా ఉన్నతమైన దృక్పథాన్ని కలిగివున్నాడు కాబట్టి, దేవుడు తన ప్రజల కోసం వస్తాడనే నమ్మకంతో ఉన్నాడు.
సిలువకు ఈ వైపు నివసించే మనం యెషయావంటివారం కాకపోయినా అతనికన్న లేదా అంతకంటే ఎక్కువ విశ్వాసం వుండాలి. యేసు ద్వారా, దేవుని స్వభావం గురించి మనకు స్పష్టత ఉంది. ఆయన స్వభావం గురించి మనకున్న అవగాహన వలన మనకు బదులుగా ఆయన కార్యం చేయడానికి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేలా మనకు ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి దేవుని స్వభావాన్ని తెలియచేసే ఆయన గుణాలను ప్రతిబింబించడం ద్వారా దేవుని ఉన్నతమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడంపై నిరంతరం దృష్టి సారిద్దాం.
2. మనం పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి [5a]
యెషయా 64:5 లోని మొదటి భాగంలో ఇలా ఉంది, “నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించువారిని నీవు దర్శించుచున్నావు”. దేవుని జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించువారికి సహాయం చేయడానికి లేదా వారి పక్షంగా కార్యం చేయడానికి దేవుడు వస్తాడని గమనించండి. సంతోషకరమైన హృదయాలతో పరిశుద్ధ జీవితాన్ని వెదికేవారు దేవుని సహాయం పొందుతారు. దేవుని స్వభావాన్ని విశ్వసించడం, ఆయన ఆజ్ఞలకు లోబడే ప్రవర్తన ఆయన కొరకు కనిపెట్టడంలో భాగంగా కలిసివుంటాయి.
యెషయా కాలంలోని ప్రజలు దేవుని విమోచనను అనుభవించకపోవడానికి కారణం వారు పాపంలో జీవిస్తూ ఉండడమే. “నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?” [యెషయా 64:5] అంతేకాకుండా, వారు దేవునికి మొర పెట్టడంలేదు [యెషయా 64:7]. వారికి ప్రార్థన జీవితం లేదు. వారు ప్రార్థించినా ఉపవాసం ఉన్నా అది కేవలం బయటకు చూపించుకోవడమే; దేవుడు అలాంటి వంచనను తిరస్కరించాడు [యెషయా 58]. దేవుడు వారి పక్షాన పనిచేయకుండా పాపం అడ్డుకుంది “మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు” [యెషయా 59:2].
అదే విధంగా, మీరు నేను పాపంలో జీవిస్తూ దేవుడు మన పక్షంగా కార్యం చేయాలని ఆశించకూడదు. పాపం ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది! అయితే, మనం పరిశుద్ధతను వెంబడిస్తే, ఆయన మార్గములనుబట్టి ఆయనను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించువారిని ఆయన దర్శిస్తారని మనం నిశ్చయతతో ఉండవచ్చు. అందుకే మనం పరిశుద్ధతను వెంబడించాలి.
కాబట్టి మనం ఏమి చేయాలంటే, మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మన తరపున కార్యం చేయాలని మనం కోరుకుంటే, మనం ఆయన స్వభావం గురించి ఉన్నత దృక్పథాన్ని కలిగివుండి పరిశుద్ధతను వెంబడించాలి.
ముగింపు మాటలు.
ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు తరచుగా మనం నిరుత్సాహపడతాము. దేవుని సందేహించడం మొదలుపెడతాము. మనం కోరుకున్న విధంగా పనులు జరగనందుకు మనం కోప్పడతాము చిరాకుగా ఉంటాము! అలాగే మనం ఇతరులను చూసి అసూయపడతాము. దుష్టులు అభివృద్ధి చెందుతూ నీతిమంతులు బాధలు పడడం చూసినప్పుడు ఆసాపు అదే చేశాడు [కీర్తన 73]. నీతిమంతుడైన దేవుని ఆధీనంలో సమస్తం ఉన్నాయని మర్చిపోవడం సులభం! మనం చాలా సోమరిగా కూడా మారవచ్చు. అంతేకాకుండా, “దేవుని సేవించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆయన నన్ను పట్టించుకోడు. నేను చాలా కాలంగా కనిపెట్టుకుని ఉన్నా ఆయన రాలేదు. ఆయనకి సేవ చేయడం ఎందుకు?” అనే ఆలోచనలు మనల్ని నియంత్రించడం ప్రారంభించే అవకాశం ఉంది.
మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా దేవుడు పనిచేస్తాడని మనం మరచిపోతాము. ఆయన మన స్వభావాన్ని నిర్మిస్తున్నాడు. మనం పశ్చాత్తాపపడి వాటి నుండి మరలగలిగేలా ఆయన మన హృదయంలో ఉన్న విగ్రహాలను చూపిస్తారు. ఆయన మనలో దీర్ఘశాంతం, సహనం, వినయం, కనికరాన్ని పెంపొందిస్తున్నారు, తద్వారా మనం ఇతరుల బాధలు పోరాటాలు అర్థం చేసుకుని వారికి సమర్థవంతంగా పరిచర్య చేయగలుగుతాము.
అంతేకాకుండా, కనిపెట్టుకుని ఉండే ప్రక్రియలో మన జీవితాలపై ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తించడం కూడా దేవుడు మనకు బోధిస్తాడు. ఆయన కుమ్మరి అని మనం మట్టి అని బోధిస్తాడు. ఆయన అందరికి అధిపతి. ఆయన చిత్తాన్ని ఆయన చిత్తప్రకారం ఆయన చేస్తాడు. తమ ఎజెండా ప్రకారం చేయమని ఎవరూ ఆయనను బలవంతం చేయలేరు. ఈ సత్యాలను మనం హృదయపూర్వకంగా అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు.
జాన్ పైపర్, “దేవుడు తన కోసం కనిపెట్టుకుని ఉండేవారి కోసం పని చేయడం ద్వారా తనను తాను హెచ్చించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు” అని చెప్పాడు. వారెన్ వైర్స్బే “గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ హర్రీ” అనే తన పుస్తకంలో, “మనం గడియారాలు క్యాలెండర్లు చూడటం మానేసి, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఆయన సమయంలో ఆయన చిత్తప్రకారం ఆయనను కార్యం చేయానివ్వడమే నీవు నేను చేయగల మంచి పని” అని వ్రాసారు.
రెండవది, శ్రమలు కనిపెట్టుకుని ఉండడం అనేవి దైవభక్తిలో పరిపక్వతలో మరియు మనలో చాలామందికి అనుభవంలేని నిజమైన ఆధ్యాత్మికతను బోధించి శిక్షణ ఇస్తాయి. కాబట్టి, మనం ఎంతసేపు కనిపెట్టుకుని ఉన్నాము లేదా ఎంతకాలం కనిపెట్టుకుని ఉండాలి అనే వాటి గురించి ఆలోచించకూడదు. మనం చిరాకు పడకుండా కోపగించకుండా నిరుత్సాహపడకుండా భయపడకుండా ఉండాలి లేదంటే మన సమాధానమే కాకుండా మన చుట్టూవున్నవారి సమాధానం కూడా చెడిపోతుంది. మన చుట్టూ ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
దేవుడు మనకు అనుకూలమైన రీతిలో వేగంగా కార్యం చేస్తేనే మంచివాడా?
సమాధానం ‘అవును’ అయితే, మనం దేవుని దేవుడిగా కాకుండా ఆయన కోరుకున్నట్లు మనల్ని రూపొందించడానికి బదులుగా మనకు కావలసినదాన్ని పొందడానికి దేవుడిని ఉపయోగిస్తున్నామని తెలుస్తుంది. ఇలాంటి పాపపు వైఖరికి పశ్చాత్తాప పడదాం. ఆయనకు సంతోషం కలిగించేలా కనిపెట్టుకుని ఉండే శక్తి కోసం ఆయనపై ఆధారపడదాం. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును [మత్తయి 6:34]. ఈ రోజు కనిపెట్టుకుని ఉండటానికి దేవుడు మనకు శక్తిని కృపను ఇస్తాడు. రేపు వచ్చినప్పుడు అది ఈ రోజు అవుతుంది, అప్పుడు ఆయన కృప ఆ రోజుకు సరిపోతుంది. ‘కాదు’ అనే సమాధానం కూడా దేవుడు మన మంచి కోసం ఆయనకు మహిమ కలుగడానికి మన పక్షంగా కార్యం చేయడమేనని మనం నమ్మడం నేర్చుకుందాము.
కాబట్టి, బైబిలులో చెప్పిన ప్రకారం దేవుని కోసం కనిపెట్టుకుని ఉండమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తనకొరకు కనిపెట్టువాని విషయమై ఈ అద్భుతమైన “దేవుడు” తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవుడు లేడు. “దేవుని జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించువారికి సహాయం చేయడానికి లేదా వారి పక్షంగా కార్యం” ఆయన నిజంగానే వస్తాడు.