జీవితభాగస్వామిని ఎంచుకోవడం ఎలా?

Posted byTelugu Editor July 25, 2023 Comments:0

(English version: How To Choose A Marriage Partner)

స్నో వైట్ కథను మొదటిసారి విన్న ఒక చిన్న అమ్మాయి సుజీ ఉత్సాహంగా తన తల్లికి ఆ కథను తిరిగి వినిపించింది. రాజకుమారుడు తన అందమైన తెల్లని గుర్రం మీద వచ్చి స్నో వైట్‌ని బ్రతికించడానికి ఎలా ముద్దుపెట్టుకున్నాడో చెప్పిన తర్వాత ఆమె తన తల్లిని, “తర్వాత ఏమి జరిగిందో మీకు తెలుసా?” అని అడిగింది. “తెలుసు, వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా జీవించారు” అని ఆమె తల్లి చెప్పింది. “లేదు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు” అని సుజీ మొహం చిట్లిస్తూ చెప్పింది.

అమాయకత్వమే అయినా ఆ చిన్నారి కొంత సత్యాన్ని చెప్పింది. వివాహం చేసుకోవడం మరియు సంతోషంగా జీవించడం ఎల్లప్పుడూ కలిసి ఉండవు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఎవరైనా బైబిలులో ఉన్న దేవుని బోధలకు లోబడినప్పుడు, వివాహం  సంతోషం రెండూ కలిసి ఉంటాయని దేవుడు వాగ్దానం చేశాడు.

వివాహానికి ముందు సరైన భాగస్వామిని ఎన్నుకోకపోవడమే వివాహాలలో సమస్యలు రావడానికి  ప్రధాన కారణము. కాబట్టి, 5 బైబిలు సత్యాలను అందించడం ద్వారా సరైన వివాహ భాగస్వామిని ఎన్నుకోవడంలో సహాయపడటానికి ఈ వ్యాసం వ్రాయబడింది. భాగస్వాములను కోరుకునే విషయంలో ఈ సత్యాలను వర్తింపచేసుకునేలా క్రైస్తవులైన తల్లిదండ్రులు తమ పిల్లలను నడిపించి వారికి సహాయపడగలరు.

ప్రాధమిక సత్యంతో ప్రారంభిద్దాం.

1. ఒంటరిగా ఉండటం శాపం కాదు.

ఒంటరితనాన్ని ప్రపంచం ఒక లోపంగా, శాపంగా చూస్తుంది! ఏది ఏమైనప్పటికీ, లోకం ప్రభావం వారిమీద ఉండకుండా ముందుగానే విశ్వాసులు తాము వివాహం చేసుకోవాలనేది ప్రభువు చిత్తమో కాదో తెలుసుకోవాలి. ప్రతిఒక్కరు పెళ్లి చేసుకోవాలని లేదు. (మత్తయి 19:10-12; 1 కొరింధి 7:25-38). పౌలు స్వయంగా తన ఒంటరితనాన్ని దేవుడు ఇచ్చిన బహుమతిగా భావించాడు (1 కొరింథి 7:7). కాబట్టి, మీరు ఒంటరిగా ఉండడం దేవుని చిత్తమైతే దానిని శాపంగా చూడకండి. ఆయన మహిమకై దేవుని నుండి మీకు లభించిన బహుమతిగా, పిలుపుగా దానిని పరిగణించండి. ఒంటరిగా ఉండమని పిలిచిన వారికి దేవుడు తగిన దయను ఆనందాన్ని ఇస్తారు.

విశ్వాసులుగా మనమందరికి “ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.” (ఎఫెసి 1:3) మరియు “ఆయనయందు మీరును (మనము) సంపూర్ణులై యున్నారు” (కొలస్సి 2:10). ఆశీర్వాదము – సంపూర్ణత; ఇది ప్రతి క్రైస్తవుని స్థితి. ఇంతకంటే ఏం కావాలి! కాబట్టి, దేవుడు మిమ్మల్ని ఒంటరిగా ఉండమని పిలిచినట్లయితే, మీ జీవితకాలమంతా సంతోషించండి, ఆనందంగా ఆయనకు సేవ చేయండి. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా ఉండమని పిలవకపోతే, ఈ క్రింది 4 అంశాలు మీకు సంబంధించినవి.

మరింత తెలుసుకునే ముందు ఒక గమనిక:

విశ్వాసులైనవారు అవివాహ క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు, అవివాహితులు అసంపూర్ణమైనవారని సాధ్యమైనంత త్వరగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వారికి కలిగించే మాటలు మాట్లాడకుండా తమ పెదవులను కాపాడుకోవాలి. “బాధపడకండి, మీకు త్వరలో వివాహమవుతుంది” అనే మాటలు లేదా “మీరు నిజంగా బాగున్నారా?” అనే ప్రశ్నలు పదే పదే అడిగితే అవి మంచి ఉద్దేశ్యంతో మాట్లాడినా వాటివలన పెద్దగా ఉపయోగం ఉండదు.

ఒంటరి వ్యక్తులు చాలా వరకు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి దానిని ఎక్కువ చేయకూడదు. దేవుడు అవివాహితులను వివాహితులను సమానంగానే అంగీకరిస్తాడని గుర్తుంచుకోండి. మనం అవివాహితులమైనా లేదా వివాహితులమైనా సరే మనం క్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాము. మన మాటలు మరియు పనుల ద్వారా వారిని నిరుత్సాహపరచడం కంటే వారి కోసం ప్రార్థిద్దాం అలాగే వారు క్రీస్తులో కొనసాగేలా వారిని ప్రోత్సహిద్దాము.

2. మరొక క్రైస్తవుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోండి.

ఈ విషయం బైబిలులో స్పష్టంగా ఉంది. 1 కొరింథి 7:39లో చెప్పిన ప్రకారం, ఎదుటి వ్యక్తి ప్రభువుకు చెందివుండాలి అనే షరతుకు అనుగుణంగా ఉన్నంత వరకు వివాహం చేసుకోవడానికి విశ్వాసికి స్వేచ్ఛ ఉంది. పాత నిబంధనలో కూడా అవిశ్వాసులను వివాహం చేసుకోవద్దని దేవుడు తన పిల్లలకు ఆజ్ఞాపించాడు. ద్వితి.కా 7:3 ఇలా చెబుతోంది, “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.”

 విశ్వాసి పరిశుద్ధాత్మ నివసించే స్థలమైన తన శరీరాన్ని  ఇంకా ఆధ్యాత్మిక చీకటిలో ఉన్న పాపాలలో చనిపోయిన వ్యక్తితో ఏకం చేయకూడదు (2 కొరింథి 6:14-7:1). ఆమోసు 3:3లో కూడా “సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?” అని వ్రాయబడింది. విశ్వాసులకు అవిశ్వాసుల మధ్య ఆధ్యాత్మిక సహవాసం లేదు! వారు పూర్తి విరద్దమైన రెండు వేర్వేరు ప్రపంచాలలో నివసిస్తారు. ఈ అవిశ్వాసిని రక్షించడానికి దేవుడు వాడుకునే సాధనం బహుశా నేనే కావచ్చు అని ఆలోచించడం మూర్ఖత్వం మాత్రమే కాదు, అహంకారపూరితమైనది మరియు ప్రమాదకరమైనది కూడా. మరొకరి రక్షణకు ఎవరూ హామీ ఇవ్వలేరు (1 కొరి 7:16). ఎవాంజెలిస్టిక్ డేటింగ్ బైబిలు విరుద్ధం! అవిశ్వాసి ఎంత మంచిగా కనిపించినా, విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు!

స్పష్టంగా చెప్పాలంటే, క్రైస్తవులు క్రైస్తవేతరులను వివాహం చేసుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు స్పష్టంగా ఇచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించడం పాపము. మనం దేవుని పరీక్షిస్తూ ఉద్దేశపూర్వకంగా పాపం చేసి దేవుడు తన కళ్ళను మరో వైపుకు తిప్పుకుని మనల్ని ఆశీర్వదించి క్షమిస్తాడని ఆశించడం మరొక పాపమే (మత్తయి 4:7). పాపం ఎంత సులభంగా పెరిగిపోతుందో చూడండి! ఈ విషయంలో దేవుడు తన మనసు మార్చుకోలేదు. అందుకే ఈ విషయంలో ఎవరూ పాపం చేయకూడదు. అలా చేస్తే మనం పడిపోవడం ఖాయం! దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞను అతిక్రమించాలనే శోధన కలిగినప్పుడు యోసేపు ఏమి చేసాడో అదే  మనం చేయాలి – పారిపోవాలి! (ఆది 39:12)

చిన్న గమనిక, క్రైస్తవ భాగస్వామిని వెతుకుతున్నప్పుడు కూడా, “వారు అందంగా ఉన్నారా? ధనవంతులా? జీవితంలో స్థిరపడ్డారా?” అనే శారీరకమైన ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. అలాగే ప్రధానంగా అడగవలసిన ప్రశ్నలు ఏమిటంటే: “అతడు లేదా ఆమె నిజంగా రక్షించబడ్డారా? యేసును హృదయపూర్వకంగా వెంబడిస్తున్నారా? ప్రభువు పట్ల ఆయన మాట పట్ల పరిచర్య పట్ల వారిలో ప్రేమ ఉందా? వినయం ఉందా? పాపం పట్ల ద్వేషం, దైవభక్తి పట్ల ప్రేమ, స్థానిక చర్చి పట్ల నిబద్ధత ఉందా?” క్రైస్తవునిగా ఉండడం ఎంతో లాభదాయకంగా ఉన్నప్పటికి చాలా మంది బాహ్యసంబంధమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసంబంధమైన వాటికి చివరి స్థానం ఇవ్వడం చాలా విచారకరము. యేసుకు ప్రాధాన్యత ఇవ్వాలి (మత్తయి 6:33). ఆయన మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఇతర విషయాలన్ని బాగానే ఉంటాయని మనం నమ్మకంగా ఉండవచ్చు!

3. భర్తకు భార్యకు తల్లిదండ్రులకు ఉండే బైబిలుపరమైన బాధ్యతలను అర్థం చేసుకోండి.

క్రైస్తవులైన భర్తకు లేదా భార్యకు ఉండే బాధ్యతలను వివరించే వాక్యభాగాలను అధ్యయనం చేయాలి. (ఎఫెసి 5:22-33; కొలస్సి 3:18-19; తీతు 2:3-5; 1 పేతురు 3:1-7; సామెతలు 31:10-31). దానితో పాటు, తల్లిదండ్రుల బాధ్యతల గురించి కూడా అధ్యయనం చేయాలి (సామెతలు 6:20, 13:24, 22:6, 22:15, 29:15; ఎఫెసి 6:4; కొలస్సి 3:21). బైబిలుపరమైన జ్ఞానం ఒక వ్యక్తి తెలివిగా సిద్ధపడేందుకు సహాయంపడుతుంది.

వివాహంలో వాస్తవ అంచనాలు కలిగివుండటం నేర్చుకోవాలి. దేవుని దయతో రక్షించబడినప్పటికీ  ఇద్దరు పాపులు కలిసి జీవించినప్పుడు అనేక సవాళ్లు ఉంటాయి. లేఖనాలను అనుసరించడానికి వారు ఎంత ప్రయత్నించినప్పటికీ, భార్యాభర్తలిద్దరికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ సమయాల్లో ఎదుటి వ్యక్తిని ప్రేమించి క్షమించాలనే నిబద్ధత కలిగివుండాలి. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి దేవునిపై నిరంతరం ఆధారపడాలి.

ప్రతి వివాహానికి ప్రతిరోజూ రెండు అంత్యక్రియలు చేయవలసి ఉంటుంది; అదేమిటంటే, భార్యాభర్తల స్వార్థపూరిత కోరికలకు మరణం. తమను తాము తగ్గించుకునే జీవనశైలికి ఇద్దరూ కట్టుబడి ఉండాలి. వివాహం కేవలం ఆనందం మాత్రమే కాదు. ఇది ఒక బాధ్యత! దేవుని మహిమపరిచే బాధ్యత! వివాహాన్ని గొప్ప ఆనందంగా భావించని రోజులు కూడా ఖచ్చితంగా  ఉంటాయి. వివాహం జరిగి కొంతకాలం అయిన ఏ జంటనైనా అడగండి, వారు ఈ సత్యానికి సాక్ష్యమిస్తారు. అయితే ఆ రోజుల్లో కూడా, వివాహం అనేది పరిశుద్ధ దేవుని ఎదుట చేసిన వాగ్దానమని ఆ వాగ్దానాన్ని గౌరవించడం తమ కర్తవ్యం అనే సత్యాన్ని గుర్తుంచుకోవడానికి ఇద్దరూ కట్టుబడి ఉండాలి. ఆయన దయతో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం, ఆనందాన్ని తిరిగి పొందడం సాధ్యమవుతుంది!

4. ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉండాలి.

దేవుని పిల్లలకు తరచుగా “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము అని ఆజ్ఞ ఇవ్వబడింది. (కీర్తన 27:14, 40:1, 130:5-6). తొందరపాటు చాలామంది జీవితాలను నాశనం చేసింది. అబ్రాహాము బిడ్డ కొరకు ప్రభువు సమయము కొరకు ఎదురుచూడలేకపోవుట గొప్ప దుఃఖాన్ని కలిగించింది. (ఆదికాండము 16). సౌలు తొందరపాటు కారణంగా రాజ్యాన్ని కోల్పోయాడు (1 సమూ 10:8, 13:8-14).

అదేవిధంగా, తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా వివాహాలు చెడిపోయాయి. అవును, ఒంటరిగా ఉండటం వల్ల బాధ ఒంటరితనం కలుగవచ్చు, కొన్నిసార్లు వాటిని భరించడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి చాలామంది తొందరపాటులో (బాధతో) మర్చిపోయే వాస్తవం: ఒంటరిగా ఉండటం వల్ల కలిగే బాధ మరియు ఒంటరితనం కంటే సంతోషంగా లేని వివాహం వల్ల కలిగే నొప్పి మరియు ఒంటరితనం భరించడం చాలా భారమని వారు మరచిపోతారు. అది పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది.

కాబట్టి, జాగ్రత్త! ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండడండి. గుర్తుంచుకోండి, తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు” (యెషయా 64:4). దేవుని పిల్లలు దేవుని సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు.

5. నిరంతరం ప్రార్థించండి.

మనం ఆయన నుండి వేరుగా “ఏమియు చేయలేము” అని యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు (యోహాను 15:5). ఈ సత్యాన్ని గ్రహించడం ద్వారా విశ్వాసి ఈ కీలకమైన విషయంతో సహా ప్రతిదాని గురించి శ్రద్ధగా ప్రార్థించేలా ప్రేరేపించబడతాడు. పరిస్థితి మారనప్పటికీ, విశ్వాసి “విసుగక నిత్యం ప్రార్థించాలి” (లూకా 18:1). ప్రార్థనతో పాటు ఉపవాసం కూడా ఉండాలి! జీవితాన్ని మార్చే ఈ క్రమంలో తన చిత్తాన్ని కోరుకునే తన పిల్లలు నిత్యం పెట్టే మొరను ప్రభువు వింటాడు!

ముగింపు మాటలు

ప్రియమైన విశ్వాసి, వివాహాలకు కర్త అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా వివాహం చేసుకుంటే (వివాహం దేవుని చిత్తమైతే) వారు సంతోషంగా జీవిస్తారు. ఆయన ఆజ్ఞలను పాటించడంలో విఫలమైతే, “నాకు పెళ్లి అయినప్పుడు నేను ఉత్తమమైనదాని కోసం వెదికాను కాని ఇప్పుడది అగ్నిపరీక్షగా మారింది. ఇప్పుడు నేను క్రొత్తగా పెళ్ళి చేసుకోవాలి” అని ఒక దైర్భాగ్యురాలైన భార్య చెప్పిన సమాధానంలా ఉంటుంది. పెళ్లి అనేది ఒక ఆట కాదు. అది  సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఘనపరచబడే ఒక నిబద్ధత! పెళ్లికి ముందే సరైన జీవిత భాగస్వామిని వెతకడంతోనే అది  ప్రారంభమవుతుంది.

చివరిగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను: పెళ్లి అనేది  అంతం కాదు. ఇది ముగింపుకు ఒక సాధనం-దేవునికి మహిమ కలిగించే ముగింపు (1 కొరింథి 10:31). వివాహాన్ని జీవితానికి అంతిమ లక్ష్యంగా చేసుకోకుండా ఈ హెచ్చరిక కాపాడుతుంది! జీవితంలో దేవునికి మహిమ తీసుకురావడమే మన లక్ష్యం అయితే, దేవుడు మహిమపరిచే మార్గాలలో వివాహం ఒకటి అవుతుంది.

బహుశా, ఈ కథనాన్ని చదివే కొందరు వివాహవిషయంలో తప్పుడు ఎంపికలు చేసుకుని ఉండవచ్చు. ధైర్యం కోల్పోవద్దు. మీ పాపాలను ప్రభువు దగ్గర ఒప్పుకుని పరిస్థితిని అధిగమించడానికి మీకు శక్తిని ఇవ్వమని అడగండి. ఆయన కోసం జీవించడానికి కావలసిన శక్తిని ఆయన మీకు అందిస్తారు. మీరు వివాహంలో తప్పుడు ఎంపిక చేసుకున్నందున దేవుడు మిమ్మల్ని తిరస్కరించలేదు; మీరు మంచి ఎంపిక చేసుకున్నందున మీరు అంగీకరించబడలేదు అని గుర్తుంచుకోండి. యేసు క్రీస్తు చిందించిన రక్తం ఆధారంగానే మీరు అంగీకరించబడ్డారు. కాబట్టి, యేసు ద్వారా మిమ్మల్ని తన కుమారునిగా కుమార్తెగా చేసుకున్న ఈ అద్భుతమైన దేవుని దయగల చేతులలో విశ్రాంతి తీసుకోండి!

Category

Leave a Comment