చీకటి ప్రదేశాలకు ప్రకాశవంతమైన దీపాలు అవసరము

(English version: Dark Places Need Bright Lights)
ఒక యువతి పాస్టరుతో మాట్లాడుతూ, “ఇకపై నేను అక్కడ ఉండలేను. నేను పనిచేసే చోట నేను మాత్రమే క్రైస్తవురాలిని. అక్కడ నాకు వెక్కిరింపులు అవహేళనలు తప్ప మరేమీ లేవు. అవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను రాజీనామా చేయబోతున్నాను” అని చెప్పింది. అప్పుడు ఆ పాస్టరుగారు “దీపాలను ఎక్కడ పెడతారో నాకు చెబుతారా?” అని అడిగాడు, “దానికి దీనికి సంబంధం ఏమిటి?” అని ఆ క్రైస్తవ యువతి అతడిని సూటిగా అడిగింది. “పర్వాలేదు చెప్పండి, లైట్లు ఎక్కడ ఉంచుతారు?” అని పాస్టర్ తిరిగి ప్రశ్నించారు. అందుకు ఆమె “నేనైనతే చీకటి ఉన్న చోట పెడతాను” అని ఆమె చెప్పింది. అప్పుడు ఆ పాస్టరు, “అవును! ఆధ్యాత్మికంగా చాలా చీకటిగా ఉన్న చోట దేవుడు నిన్ను ఉంచారు మరియు అక్కడ వెలుగును ప్రకాశింపజేయడానికి వేరొక క్రైస్తవుడు లేడు”.
మొదటి సారిగా, ఆ క్రైస్తవ యువతి తనకు లభించిన అవకాశాన్ని గ్రహించింది మరియు తాను పనిచేసే స్థలము నుంచి వెళ్ళిపోయి దేవుని పని విఫలమయ్యేలా చేయలేకపోయింది. ఆమె ఆ చీకటి మూలలో తన వెలుగును ప్రకాశింపజేయడానికి కొత్త సంకల్పంతో తన పనికి తిరిగి వెళ్ళింది. చివరికి, ఆమె మరో తొమ్మిది మంది యుతులను యేసుక్రీస్తు వెలుగులోకి నడిపించగలిగింది. ఆమె ప్రకాశవంతంగా వెలగడానికే ఆ చీకటి చోటులో ఉంచబడిందని ఆమె గ్రహించినందుకే ఇదంతా సాధ్యమయ్యింది.
అదేవిధంగా, ఆ అమ్మాయిలాగే, మనమందరం మన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచంలో ప్రకాశవంతమైన వెలుగుగా ఉండడానికి పిలువబడ్డాము. ఫిలిప్పి 2:14-16లో క్రైస్తవులను ప్రకాశవంతంగా ప్రకాశించే జ్యోతులతో పోల్చారు. సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు చీకటి విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తున్నట్లే విశ్వాసులు కూడా తమ చుట్టూ ఉన్న ప్రజల చీకటి హృదయాలలోకి వెలుగును తీసుకురావాలి.
యేసు తన అనుచరులతో మీరు లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు [మత్తయి 5:14], మనం వెలుగుని పంచేవారమే కాని వెలుగుని పుట్టించేవారం కాదని ఆయన అర్థము . మనం యేసు నుండి వెలుగును పొందుకుంటాము. “యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను” [యోహాను 8:12]. యేసును వెంబడించేవారిగా మనం ఆయన వెలుగును చీకటి ప్రపంచంలో ప్రతిబింబించాలి. మనం చీకటి రాత్రిలో ప్రకాశించే చంద్రునిలా ఉంటాము. చంద్రుడు కాంతిని ఇచ్చినప్పటికీ, అది దాని స్వంత కాంతి కాదు. అది సూర్యకాంతిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. మనం కూడా అలానే వెలుగును ప్రతిబింబించేవారిగా ఉన్నాము.
అయినప్పటికీ, క్రైస్తవులుగా మనం ఈ ప్రాథమిక సత్యాలను గుర్తుంచుకోవడంలో తరచుగా విఫలమవుతాము. సార్వభౌమాధికారం గల దేవుడు తన కోసం ప్రకాశించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో మనల్ని ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచుతాడని మనం గ్రహించడంలో విఫలమవుతున్నాము. దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చాలి, ఆయనను నిరాశపరచకూడదు. ఆ మహిమాన్వితమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఫిలిప్పి 2:14-16 మనకు సహాయం పడుతుంది.
1. ఆదేశం [14]
“సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.” ఇంటిలో వెలుగుగా ఉండడానికి సూర్యకాంతిని లోపలికి రానిచ్చే ఒక కిటికీలా మనం కూడా క్రీస్తు వెలుగును మన ద్వారా ప్రకాశింపజేయాలి. కిటికీకి పట్టిన దుమ్ము వెలుగు పూర్తిగా లోపలికి రాకుండా అడ్డుకుంటుంది ; అలాగే క్రైస్తవులు తమ జీవితాల్లో పాపానికి చోటిచ్చినప్పుడు, అది వారిని క్రీస్తు వెలుగును ప్రకాశవంతంగా ఇవ్వకుండా అడ్డుకుంటుంది. క్రీస్తు కొరకు ప్రకాశవంతంగా ప్రకాశించకుండా విశ్వాసిని అడ్డుకునే ఒక ప్రత్యేకమైన పాపం ఉంది, అదే సణుగుడు సంశయము. అందుకే “సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి” అని ఆజ్ఞ ఇవ్వబడింది. మూలభాషలో వాక్యం ప్రారంభంలో “ప్రతిదీ” అనే పదం కనిపిస్తుంది; అలాగే “చేయుము” అనే పదం వర్తమాన కాలంలో ఉంటుంది. సాహిత్యపరంగా, చెప్పాలంటే: “సణుగులు సంశయములు లేకుండా మాని, అన్ని పనులు చేస్తునే ఉండండి.”
“సణగడం” అనే పదం ఫిర్యాదు, గొణుగుడు లేదా రహస్యంగా అసంతృప్తిని కలిగి ఉండే వైఖరిని సూచిస్తుంది. దేవుని అవమానపరిచే పరిస్థితి గురించి అసంతృప్తిని వ్యక్తం చేయడం సణగడం కాదు. కాని పరిస్థితులకు, వ్యక్తులకు, చివరికి దేవునికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేసే వైఖరిని సణగడం అంటారు. “సంశయము” అనే పదం, “డైలాగ్” అని ఇంగ్లీషులో అర్థమిచ్చే గ్రీకు పదం నుండి వచ్చింది. ఇది మన పరిస్థితులపై అంతర్గత తర్కాన్ని సూచిస్తుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిరంతరం సణుగుతుండడం వలన విధేయత కలిగిన హృదయంతో దేవుని చిత్తాన్ని చేయకుండా నిరోధించడమే కాకుండా చివరికి మనల్ని దేవునికి వ్యతిరేకంగా వాదించడానికి తిరుగుబాటు చేయడానికి దారి తీస్తుంది!
పౌలు “సణగవద్దు” అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో వారికి అలవాటైన సణుగుడు అలవాటును మనస్సులో పెట్టుకుని చెప్పివుండవచ్చును. [నిర్గమ 14:10-12; 15:23-24, 16:2-3, 17:3; సంఖ్యా 14:2]. వారి సణుగుడు తనమీద ఇతర నాయకులకు మీద కాదని నేరుగా దేవునికి వ్యతిరేకంగా ఉందని మోషే చెప్పాడు, “మీరు మాకు వ్యతిరేకంగా కాదు, యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నారు” [నిర్గమ 16:8]. వారి సణుగుడుకు దేవుని జవాబు ఏమిటి? కోపం మరియు తీర్పు! సంఖ్యా 11:1 ఇలా చెబుతోంది, “జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.”
కాబట్టి, సణగడం దేవుని దృష్టిలో చిన్న విషయం కాదు. అది దేవునికి కోపం తెప్పిస్తుంది, ఆయన తీర్పు తీర్చెలా చేస్తుంది. అందుకే పౌలు క్రైస్తవులను సణగడం వలన కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించాడు. “మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి” [1 కొరి 10:10].
సణగడం అనేది దేవుని సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే కాబట్టి అది పాపము. మంచివాడైన దయగల దేవునికి వ్యతిరేకంగా సణగడం పాపమని యేసే స్వయంగా ఒక ఉపమానం ద్వారా వివరించారు [మత్తయి 20:1-16]. సణగడం అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితులు దేవుడు నాకు కల్పించకూడదని చెప్పడమే. అందుకే మనం విధేయత కలిగిన హృదయాన్ని పెంపొందించుకోవాలి. అంటే, సమస్తం దేవుని నియంత్రణలో ఉన్నాయని ఆయన చిత్తప్రకారం ప్రతిదీ చేస్తున్నారని మనం ఆయనని ఎదిరించకూడదని గ్రహించే హృదయాన్ని కలిగివుండాలి.
2. ఆదేశానికి కారణం(15-16).
పౌలు తర్వాతి రెండు వచనాలలో సణుగుడు సంశయం లేకుండా ప్రతిదానిని ఎందుకు చేయాలో కారణాన్ని తెలియచేశాడు. “15 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. 16 అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును.”
తన ప్రజల స్వభావం ప్రవర్తన బయట [“నిరపరాధులు”] ప్రతికూలంగా ఉండకూడదని లోపల [“నిష్కళంకులు”] కూడా ప్రతికూలంగా ఏదీ ఉండకూడదని దేవుని ఉద్దేశము. దాచిపెట్టబడిన ఆలోచనలు, దాచిపెట్టబడిన ఉద్దేశ్యాలు, ద్వంద్వార్థంతో మాట్లాడం మొదలైనవి ఉండకూడదు. తమ చుట్టూ ఉన్న అవిశ్వాస ప్రపంచాన్ని క్రీస్తు వైపుకు ఆకర్షించగలిగే మంచిజీవితం ఉండాలి. విశ్వాసి దేవుని మాటను అంటిపెట్టుకొని దానిని ఇతరులకు అందిస్తూ తమ ద్వారా ఆయన వెలుగును ప్రకాశింపజేయడం వలన దేవుని మహిమపరచాలి.
ముగింపు మాటలు.
విశ్వాసులుగా మనం మన చుట్టూ ఉన్న తప్పిపోయిన ప్రపంచానికి నమ్మకంగా ఏమి చెప్పాలంటే, “ప్రతి సమస్యకు యేసే సమాధానము. అన్ని వేళలా ఆయన నాతో ఉంటారు.” అంతే కాకుండా, “బైబిలు దేవుడు యెహోవా యీరే – సమస్తాన్ని సమకూర్చుతారు” అని కూడా చెప్పాలి. అయితే, మనం నిజంగా ఈ సత్యాలను హృదయపూర్వకంగా విశ్వసిస్తే, మనం ఎందుకు నిరంతరం గొణుగుతూ ఉంటాము, “నేను ఈ స్థితిలో ఎందుకు ఉన్నాను? నేను ఈ స్థానంలో ఎందుకు ఉన్నాను? నేనెందుకు ఈ ఉద్యోగంలో ఉన్నాను? నేను ఎందుకు ధనవంతుడిని కావడం లేదు? నేనెందుకు ఈ కుటుంబంలో ఉన్నాను? నేను ఇంకా ఒంటరిగానే ఎందుకు ఉన్నాను? నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నేను ఈ చర్చిలో ఎందుకు ఉన్నాను? ఎందుకు? ఎందుకు? ఎందుకు? ఎందుకు?” అని .
మనం ఈ లోకఆలోచనా విధానాన్ని అలవరచుకుని సణగడం అనేది మన సాధారణ జీవితంలో ఒక భాగమే అని అంగీకరిస్తున్నామనిపిస్తుంది. “నేను నా కోపాన్ని వెళ్లగక్కాలి. ఇలా చేయకుంటే నా తలా పగిలిపోతుంది .” అనేది లోకస్థుల ఆలోచన. అయితే, క్రైస్తవులమైన మనం మన ఫిర్యాదులకు “క్రైస్తవ రంగు” ఇవ్వడానికి ప్రయత్నిస్తాము మరియు “దేవుడు నా తండ్రి కాబట్టి, నేను చెప్పాలనుకున్నది చెప్పగలను. నా ఆలోచనను స్వేచ్ఛగా వ్యక్తపరచగలను” అని మనల్ని మనము సమర్ధించుకుంటాము. మన వైఖరి అదే అయితే, మనం తిరిగి సంఖ్యా 11:1; 1 కొరింథి 10:10 మరలా చదవాలి!
సణగడం క్రైస్తవులు చేయాలస్సిన పని కాదు కాబట్టి కొంతమంది బయటకు సణగకపోయిన అంతర్గతంగా తమ జీవన పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉంటారు. అది కూడా అంతే చెడ్డది, ఎందుకంటే, మనం చెప్పేది మాత్రమే కాదు మన ఆలోచనలు కూడా దేవునికి తెలుసు.
ఒక తండ్రి తన పిల్లవాడిని కూర్చోమని పదేపదే చెప్పాడు. చివరిగా ఆ పిల్లాడు లోబడకపోతే దెబ్బలు తప్పవని తండ్రి హెచ్చరించినప్పుడు ఆ పిల్లాడు కూర్చున్నాడు. కాని ఆ పిల్లాడు “నేను బయట కూర్చున్నాను, కానీ నా లోపల నిలబడే ఉన్నాను” అన్నాడు.
దేవుని చిత్తానికి లోబడే విషయంలో మనం ఆ చిన్న పిల్లవాడిలా ఉండకూడదు. మన దైనందిన జీవితంలోని ప్రతి అంశంలో ఇష్టంగా హృదయపూర్వకంగా దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. అది ఆయనకు పూర్తిగా సమర్పించబడిన హృదయం నుండి మాత్రమే బయటకు వస్తుంది.
మనం ఫిర్యాదు చేసినప్పుడు, సణుగుడు ఆత్మ కలిగిన అవిశ్వాసులకు మనకు తేడా ఏమిటి అనే దానిని విశ్వాసులు కూడా గుర్తుంచుకోవాలి. మనం నిరంతరం సణుగుతూ ఉంటే ఎలా ప్రకాశిస్తాము? సణుగుతూ ప్రకాశించలేమని గుర్తుంచుకోండి! ప్రకాశించే జ్యోతిగా ఉండాలంటే సణగడం మానివేయాలి. ఒకరు సణుగుతూ ఉండి అదే సమయంలో క్రీస్తును మహిమపరచలేరు అలాగే ఇతరులను ఆయన వైపుకు ఆకర్షించలేరు.
కాబట్టి, ఈ ఆజ్ఞకు విధేయత చూపించే హృదయాన్ని పెంపొందించుకోవడం నేర్చుకుందాము. “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” [1 థెస్స 5:18]. మనం ఫిలిప్పి 2:14 [“సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి”] 1 థెస్సలొ 5:18 రెండింటిని కలిపి చూసినప్పుడు, దేవుని పిల్లలు కలిగివుండవలసిన వైఖరి ఏమిటంటే: సణగకూడదు కానీ అన్ని పరిస్థితులలో కృతజ్ఞత కలిగి ఉండాలి!
సణగడం మన జీవిత స్వభావంగా మారితే మన వెలుగు ప్రకాశవంతంగా ప్రకాశించదు. ఎవరూ లేని చోట ఒంటరిగా నిలబెట్టారని లైట్‌హౌస్ సణగడాన్ని మనం ఊహించలేము. అది మాట్లాడగలిగితే, “చీకటితో, హరికేనుల్లతో తుఫానులతో పోరాడుతున్న ఓడలు సురక్షితంగా నౌకాశ్రయానికి చేరుకోవడానికి వెలుగు అందించడానికి నేను ఇక్కడ ఉన్నాను” అని తనను తాను ఓదార్చుకుంటుంది . అదేవిధంగా, మీరు నేను మన జీవిత పరిస్థితుల గురించి సణగకూడదు, సంశయించకూడదు, కానీ దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ ఆయన ఇష్టానికి సంతోషంగా లోబడి ఉండాలి. కలత చెందిన ఆత్మలు ప్రభువైన యేసు ద్వారా శాంతి సమాధానాలను పొందాలని సువార్త వెలుగులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. మనపై ఆయనకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. మీరు నేను దీపాలము, అవి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. మనలో కొందరు అగ్గిపుల్లలా ఉంటారు, మరికొందరు కాగడాలా ఉంటారు. అగ్గిపుల్ల కాగడాను వెలిగించగలదని గుర్తుంచుకోండి. మనమందరం కాగడాలు కాకపోవచ్చు కానీ మనమందరం ఖచ్చితంగా అగ్గిపుల్లలు కాగలము. మన దేవుడు తన పిల్లలలో బలహీనులను కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకునే పనిలో ఉన్నారు.
అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న ఒక యాత్రికుడు గురించి ఒక కథ ఉంది. ఈ యాత్రికుడు సముద్రము లో తుఫాను వస్తున్నసమయంలో అనారోగ్యంతో తన మంచంపై పడి ఉన్నాడు. అప్పడు బయటినుండి “రక్షించండి” అని ఎవరో వేసిన కేక వినిపించింది. సమస్య ఏమిటంటే, ఓడలోని వ్యక్తులు ఈ వ్యక్తిని చూడలేకపోయారు.
ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయలేక, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలా ప్రార్థించాడు, “ఓ దేవా, ఆ పేదవాడికి సహాయం చేయి. నేను అయితే ఏమీ చేయలేను” అని. అప్పుడు అతను కనీసం తన లాంతరును ఓడ కిటికీ పక్కన పెడితే ఎవరైనా ఆ వ్యక్తి కి సహాయం చేస్తారేమో అని అతను లాంతరును కిటికీ దగ్గర పెట్టాడు.
తర్వాత మునిగిపోతున్న ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. తర్వాతి రోజు, అతడు తన అనుభవాన్ని ప్రజలకు ఇలా చెప్పాడు, “నేను చీకటిలోనికి జారిపోతున్నప్పుడు, ఎవరో పోర్టుహోల్ కిటికీలో లైట్ వేశారు, అది నా చేతిపై పడింది, అప్పుడు లైఫ్‌బోటులోని నావికుడు నా చెయ్యి పట్టుకుని లోపలికి లాగాడు.”
ప్రియమైన తోటి క్రైస్తవుడా, దేవుడు ఉంటే కొంచెం కూడా ఎక్కువ అవుతుంది. మన దగ్గర ఉన్న కొద్దిపాటి బలాన్ని బయట పెట్టకపోవడానికి బలహీనత ఒక సాకు కాకూడదు. దేవుడు దానిని ఎలా ఉపయోగించగలరో ఎవరు చెప్పగలరు? మనం ప్రకాశించటానికి ఇష్టపడితే, పాపపు ప్రమాదాల నుండి ఆత్మలు తప్పించుకోవడానికి ఆయన మనలను ఉపయోగిస్తారు. చీకటి ప్రపంచంలో క్రీస్తు కోసం ప్రకాశించడం ఎప్పుడూ తేలికైన విషయం కాదు; ఏమైనప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వార్తను దేవుడు మనకు అప్పగించాడు; అది ప్రతి మానవునికి ఎంతో అవసరమైన వార్త: అది ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందవచ్చు అనే శుభవార్త!
యేసు కోసం ప్రకాశించడం ఎంతటి ఆధిక్యత! ఆయన మనల్ని ఉపయోగించుకోవడం ఎంత ఆనందం! మండితేనే ప్రకాశం వస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు మైనం కరిగిపోతుంది. వెలుగిస్తున్న కొలది బల్బు జీవితకాలం తగ్గుతుంది. మరో మాటలో చెప్పాలంటే, క్రైస్తవ జీవితంలో త్యాగం చేయవలసి ఉంటుంది. మనం దేవునిచే ఉపయోగించబడాలని కోరుకుంటే, పాపాన్ని, వ్యక్తిగత అజెండాలు, ఆర్థిక వ్యవహారాలు, సమయం మొదలైనవాటిని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ జీవితానికి సంబంధించి “మండకపోతే ప్రకాశం లేదు” అనే రాజీపడలేని ప్రాథమిక సూత్రాన్ని గ్రహించలేకపోతున్నారు కాబట్టి చాలామంది క్రైస్తవులు ప్రకాశించడం లేదు.
అయితే విశ్వాసులుగా, మన పాపాల కోసం సిలువపై తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుకాడని యేసు కోసం మన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి వెనుకాడాలా? లేదు! అలాంటి ఆలోచన రానేరాకూడదు. “ప్రభువైన యేసు, నీవు అన్నింటి కన్నా విలువైనవాడివి. దయచేసి నన్ను మీ చేతులలోనికి తీసుకుని, ఇప్పుడు నేనున్న స్థలంలో నన్ను ఉపయోగించుకోండి. దయచేసి ప్రతి అడుగులో నన్ను నడిపించండి. నేను మీ కోసం జీవించాలనుకుంటున్నాను; మీ వెలుగును నా ద్వారా ప్రకాశింపచేయండి” అని ఎప్పుడూ మనం ప్రార్థించాలి.