గర్వం వలన వచ్చే ప్రమాదాలు

(English version: “Dangers of Pride”)
1715లో ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV మరణించాడు. ఈ రాజు తనను తాను గొప్పవాడిని అని పిలుచుకునేవాడు, రాజ్యం నాదే! అని గర్వంగా ప్రగల్భాలు పలికాడు. అతని కాలంలో అతని ఆస్థానం ఐరోపాలోనే అత్యంత అద్భుతమైనది. అతని అంత్యక్రియలు కూడా అతని గొప్పతనాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడ్డాయి. అవి అద్భుతంగా ఉన్నాయి. అతని శరీరాన్ని బంగారు శవపేటికలో పడుకోబెట్టారు. మరణించిన రాజు మరియు అతని గొప్పతనంపైన మాత్రమే అందరి దృష్టి నిలవడానికి కోసం చర్చి ను చాలా మసకగా వెలిగించి అతని శవపేటిక పైన ఒక ప్రత్యేకమైన కొవ్వొత్తిని అమర్చమని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అంత్యక్రియలకు తరలివచ్చిన జనసమూహం మౌనంగా వేచి ఉన్నారు. తర్వాతి కాలంలో క్లేర్‌మాంట్‌కి బిషప్‌గా మారిన మస్సిల్లోన్ మెల్లగా కిందకు దిగివచ్చి కొవ్వొత్తిని ఆపివేసి, “దేవుడు మాత్రమే గొప్పవాడు!” అన్నాడు.
మనమందరం నిరంతరం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన సత్యం “దేవుడు మాత్రమే గొప్పవాడు.” ఆయన మాత్రమే హెచ్చింపబడాలి ఘనపరచబడాలి. ఆయనే సృష్టికర్త. ఆయనను పూజించడానికి మనం సృష్టించబడ్డాము. అయితే, సత్య దేవుడిని ఆరాధించడానికి బదులు పాపానికి ముఖ్యంగా గర్వం అనే పాపానికి బాధితులమై మనల్ని మనం ఆరాధించుకుంటున్నాము. అన్ని పాపాల కంటే ప్రజల ఆత్మలను నాశనం చేసే పాపం ఏదైనా ఉంటే అది గర్వమనే పాపము. స్వభావం బట్టి గర్వం సార్వత్రికమైనదని మనం దానిని విడిచిపెట్టలేము. నిజానికి గర్వమనేది కొత్త విషయం కాదు. ఇది ఏదెను వనంలోనే ఉనికిలో ఉంది.
ఈ ప్రచురణలో 5 సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా గర్వం వలన కలిగే ప్రమాదాలు వాటి నివారణ గురించి చూద్దాము.
1. గర్వం అంటే ఏమిటి?
సూక్ష్మంగా చెప్పాలంటే, గర్వం అంటే తనను తాను ఆరాధించుకోవడమే! తనకు తానుగా సింహాసనంపై కూర్చోవడమే; న్యాయంగా దేవునికి మాత్రమే చెందిన సింహాసనంపై కూర్చోవడమే! గర్వంతో సింహాసనంపై తనను తాను కూర్చోబెట్టుకున్న బబులోనును “నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను” [యెషయా 47:10] అని దేవుడు చాలా కాలం క్రితం మందలించడాన్ని గమనించండి.
2. గర్వానికి కారణం ఏమిటి?
పరిసరాలా? బాల్యంలో అనుభవించిన కష్టాలా? కాదు! మార్కు 7:21-23లో యేసు స్పష్టమైన సమాధానమిచ్చారు: “21 లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22 నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23 ఈ చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని” ఆయన చెప్పెను. గర్వానికి కారణం ఒకరి హృదయమే. ఇది బయట నుండి వచ్చింది కాదు మనలో ఒక భాగమైన హృదయం లోపలి నుండి వచ్చింది.
3. దేవుడు గర్వాన్ని ఎలా చూస్తాడు?
కొందరు అన్నట్లు గర్వం అనేది మంచి గుణం కాదు, లేదా బలహీనత కాదు. అయితే అది పాపము; ఎందుకంటే సామెతలు 21:4లో “అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు” అని వ్రాయబడింది. దీనిని బట్టి మనం గర్వం పాపమని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు ప్రతి పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి ఈ పాపాన్ని కూడా దేషిస్తాడు.
సామెతలు 16:5లో “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు” అని వ్రాయబడింది. హేయమనే పదానికి చెడిపోయిన ఆహారం వంటి అసహ్యకరమైన, వెగటు పుట్టించేది, భయంకరమైనదని భావము. నిజానికి దేవుడు అసహ్యించుకునే పాపాలన్నింటిలో ఈ పాపం మొదటిస్థానంలో ఉందని లేఖనాలు సూచిస్తున్నాయి. ఏడు ఘోరమైన పాపాల జాబితాలో గర్వం అగ్రస్థానంలో ఉంది. సామెతలు 6:16-19లో “16 యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు. ఏడును ఆయనకు హేయములు 17 అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును 18 దుర్యోచనలు యోచించు హృదయమును కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును 19 లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును” అని వ్రాయబడింది. ఈ జాబితాలో కూడా రెండవ స్థానంలో లేదు; కాబట్టి దేవుడు గర్వాన్ని ద్వేషిస్తాడు అనడంలో ఏ ఆశ్చర్యం లేదు!
4. హృదయంలో గర్వించే వారికి దేవుడు ఎలా స్పందిస్తాడు?
అది పాపం మరియు ఆయన దృష్టికి చాలా అసహ్యకరమైనది కాబట్టి గర్వించే వారికి దేవుడు వ్యతిరేకంగా ఉంటాడు. “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు” అని సామెతలు 16:5లో వ్రాయబడింది. యాకోబు 4:6లో “దేవుడు అహంకారులను ఎదిరిస్తారని” చదువుతాము. దీని అర్థం హృదయాలలో గర్వం ఉన్న వారందరినీ ఆయన అణగద్రొక్కుతారు. గర్వించిన ఎదోము గురించి దేవుడు ఇలా అన్నారు: “3 అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండసందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. 4 పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు” [ఓబద్యా 1:3-4]. హృదయపు గర్వం ఉన్నవారిని దేవుడు క్రిందికి పడవేస్తాడు. అది చాలా బాధాకరమైన పతనం!
5. గర్వానికి నివారణ ఏమిటి?
గర్వానికి ఒకే ఒక ఔషధం ఉంది. చాలా సులభమైన నివారణ మరియు దేవుడు సూచించిన నివారణ ఏమిటంటే వినయం! యెషయా 66:2లో “ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను” అని దేవుడు చెబుతున్నాడు. నిజంగా వినయం కలిగిన వ్యక్తి జీవితంలోని అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో —ఎంత కఠినమైన సరే దేవుని వాక్యానికి లోబడతాడు.అలాంటి వ్యక్తి దేవుని అనుగ్రహాన్ని పొందుతాడు. అదే దేవుని వాగ్దానం!
క్రైస్తవ రచయిత మరియు వక్తయైన S. D. గోర్డాన్ ఇలా అన్నారు:
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సింహాసనం ఉంటుంది. “స్వీయచిత్తం సింహాసనంపై ఉంటే క్రీస్తు సిలువపై ఉంటారు. కానీ క్రీస్తు సింహాసనంపై ఉంటే స్వీయచిత్తం సిలువపై ఉంటుంది.” మీ జీవితంలోని సింహాసనం మీద ఏమి ఉంది? మీరా? మీ కుటుంబమా? మీ హోదా? మీ ఇల్లు? మీ ఆస్తులు? మీ అందం? మీ ప్రతిభ? మీరు జీవిస్తున్న కారణం? మీరు మీ అత్యున్నత లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే ఆ ఘనత ఎవరికి చెందుతుంది? దేవునికా లేదా మీకా? ఆయనతో పాటు వస్తువులను కాని వ్యక్తులను కాని సింహాసనంపై ఉంచినందుకు క్షమించమని మనమందరం దేవుడిని అడగాలి. మనం పశ్చాత్తాపపడి ఆయనను ప్రభువుగా తిరిగి సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి మనకు శక్తిని ప్రసాదించమని నిజంగా ఆయనను వేడుకోవాలి.
యెషయా 57:15లో “మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను” అని చెప్పబడినట్లుగా దేవునికి మహోన్నతమైన నివాసం అంటే పరలోక నివాసం అలాగే దీనమైన నివాసం అంటే భూలోక సంబంధమైన నివాసం ఉన్నాయి. మన గర్వాన్ని బట్టి పశ్చాత్తాపపడి వినయాన్ని వెదకినప్పుడు మనం నిజంగా ఆత్మ సహాయాన్ని కోరుకుందాము. ఆ విధంగా, మనం ప్రభువు మన హృదయాలలో భూసంబంధమైన ఇంటిని కనుగొంటాడనే నమ్మకం కలిగివుండగలము.