క్రైస్తవుని హృదయం కృతజ్ఞతగల హృదయము

(English Version : The Christian Heart Is A Thankful Heart)
ఈ నిజజీవిత సంఘటన ద్వారా వివరించబడినట్లుగా, కృతజ్ఞత అనేది మరువబడిన అలవాటుగా కనిపిస్తుంది. ఎడ్వర్డ్ స్పెన్సర్ ఇల్లినాయిస్‌లోని ఇవాన్‌స్టన్‌లో సెమినరీ విద్యార్థి. అతడు ప్రాణాలను రక్షించే బృందంలో సభ్యునిగా కూడా ఉన్నాడు. ఇవాన్‌స్టన్ సమీపంలోని మిచిగాన్ సరస్సు ఒడ్డున ఓడ మునిగిపోయినప్పుడు ఎడ్వర్డ్ 17 మంది ప్రయాణికులను రక్షించడానికి మంచుతో నిండిన చల్లని నీటిలోకి పదేపదే వెళ్లాడు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కొన్ని సంవత్సరాల తరువాత, అతని అంత్యక్రియలలో అతడు రక్షించినవారిలో ఒక్కరు కూడా అతనికి కృతజ్ఞతలు చెప్పకపోవడం గమనించారు.
మనం అలాంటి కథను చదివి, “ఆ 17 మంది ఇంత కృతజ్ఞత లేనివారుగా ఎలా ఉన్నారు?” అనుకుంటాము. కానీ చాలా సార్లు, విశ్వాసులు కూడా కృతఘ్నత అనే అదే పాపాన్ని చేసేవారిగా ఉన్నారు. శాశ్వతమైన శిక్ష అనే గొప్ప ప్రమాదం నుండి రక్షించబడినప్పటికీ కృతజ్ఞత చూపించడం లేదు.
కృతజ్ఞతలు తెలపడం అనేది ఎప్పుడో ఒకసారి చెప్పేది కాదు కాని అది క్రైస్తవ జీవితంలో ఒక సాధారణ లక్షణం అని చాలా లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు క్రింద ఇవ్వబడిన కొన్ని వాక్యములను చూద్దాము:
“కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి; కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి; ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.” [కీర్తన 100:4]
“యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు” [కీర్తన 106:1]
“మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” [ఎఫెసి 5:20]
“కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు” [కొలస్సి 2:6]
ఈ కొన్ని వచనాల ఆధారంగా, ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది: విశ్వాసులు ఎప్పుడో ఒకసారి కృతజ్ఞతలు తెలియచేసేవారిగా ఉండకూడదు కాని అది మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉండాలి! మనం అన్ని సమయాల్లో కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా గుర్తించబడాలి!
ఇప్పుడు, మనం కృతజ్ఞతా భావాన్ని చూపించాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడని మీరు అనుకుంటున్నారు? దాని ప్రాముఖ్యత ఏమిటి? కీర్తన 50:23 ఒక క్లూ ఇస్తుందని నేను నమ్ముతున్నాను: “స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు.” మనం కృతజ్ఞత చెల్లించడం వలన దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి, ఇక్కడ సమస్య దేవుని మహిమ. అది సామాన్యమైనది కాదు!
3 విషయాలను చూడటం ద్వారా విశ్వాసులు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండటానికి ఈ వ్యాసం సహాయపడుతుంది: (I) కృతజ్ఞత లేని హృదయం వలన ప్రమాదాలు, (II) కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించుకోవడం వలన కలిగే ప్రయోజనాలు (III) కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించడానికి సూచనలు.
మనం మరింత ముందుకు వెళ్ళే ముందు, కృతజ్ఞతకు ప్రాథమిక నిర్వచనం ఏమిటంటే: కృతజ్ఞత అనేది మన ఆధ్యాత్మిక మరియు భౌతిక అవసరాలన్నింటినీ తీర్చే సార్వభౌముడైన మంచి దేవునిపై మనం పూర్తిగా ఆధారపడి ఉన్నామని స్వచ్ఛందంగా అంగీకరించడం.
I. కృతజ్ఞత లేని హృదయం వలన ప్రమాదాలు.
కృతజ్ఞత లేని హృదయంతో 2 ప్రమాదాలు ఉన్నాయి.
ప్రమాదం # 1. కృతజ్ఞత లేని ఆత్మ అవిశ్వాసికి చిహ్నము.
రోమా 1:21లో అవిశ్వాసుల జీవనశైలి ఇలా వివరించబడింది, “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు.” అనేక భూసంబంధమైన ఆశీర్వాదాలను పొందినప్పటికీ [మత్తయి 5:45; అపొ.కా 14:15-17], అవిశ్వాసులు అన్ని ఆశీర్వాదాలకు మూలమైన బైబిలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడంలో విఫలమవుతారు. ఆ విధంగా, ఎవరైనా కృతజ్ఞత లేని ఆత్మ కలిగి క్రైస్తవునిగా చెప్పుకున్నప్పటికి లేఖనాలు మాత్రం వారిని అవిశ్వాసులనే చెబుతుంది.
ప్రమాదం # 2. దేవుని చిత్తానికి అవిధేయత చూపించడమే.
1 థెస్సలొ 5:18లో “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.” అన్ని పరిస్థితులలో కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుడు తన పిల్లల నుండి కోరుకుంటున్నాడు. బాధలలో కూడా అన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయని ప్రతిది మన మేలు కొరకు ఆయన మహిమ కోసం చేస్తున్నందుకు మనం కృతజ్ఞత కలిగి ఉందాము. [రోమా 8:28-29]
చాలామంది క్రైస్తవులు జీవితంలోని వివిధ పరిస్థితులలో దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం వారు తమ జీవితంలో అన్ని వేళలా కృతజ్ఞత కలిగివుండాలనే దేవుని చిత్తాన్ని నిత్యం నిర్లక్ష్యం చేయడమే! దేవుడు తన చిత్తానికి నిరంతరం అవిధేయత చూపేవారికి తన చిత్తాన్ని మరింతగా చెబుతారా?
హిట్లర్ కాలంలో అనేకమంది యూదులను దాచిపెట్టిన జర్మనీకి చెందిన ప్రసిద్ధ విశ్వాసి కొర్రీ టెన్ బూమ్ వ్రాసిన “ది హైడింగ్ ప్లేస్” అనే తన పుస్తకంలో ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండడాన్ని తనకు నేర్పిన ఒక సంఘటనను ఆమె వివరించింది. కొర్రీ మరియు ఆమె సోదరి బెట్సీలను వారు తెలియని రావెన్స్‌బ్రక్ అనే ఒక జర్మనీ జైలు శిబిరానికి తీసుకువెళ్ళారు. ఆ బ్యారక్‌లోకి వెళ్ళినప్పుడు అది చాలా కిక్కరిసిపోయి ఈగలు ముసురుతూ ఉండడం వారు చూశారు.
ఆ ఉదయం, వారు చదివిన వాక్యభాగం 1 థెస్సలొనిలో ఎల్లప్పుడూ సంతోషించండి, నిరంతరం ప్రార్థించండి మరియు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగివుండాలని వారికి జ్ఞాపకం వచ్చింది. తమ క్రొత్త నివాసంలో ఉన్న ప్రతిదాని గురించి మౌనంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని బెట్సీ కొర్రీకి చెప్పింది. కొర్రీ మొదట నిరాకరించినా చివరికి బెట్సీ అభ్యర్థనలకు లొంగిపోయింది.
ఆ శిబిరంలో గడిపిన నెలల్లో కాపలాదారుల నుండి ఆటంకం లేకుండా బహిరంగంగా బైబిలు అధ్యయనాలు ప్రార్థన కూటాలను నిర్వహించగలిగినందుకు వారు ఆశ్చర్యపోయారు. కొన్ని నెలల తర్వాత, ఈగలు కారణంగా గార్డులు బ్యారక్ లోపలికి రారని వారికి తెలిసింది.
మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఆయన తనకు మహిమకరంగా అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా కార్యాలు చేయడం ఎంతో ఆశ్చర్యం!
ప్రభువైన యేసు కూడా తన బోధలలో దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పదిమంది కుష్టురోగులను శుద్ధి చేసిన తర్వాత, ఒక్కడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి తిరిగి రావడం చూసి, “యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? 18 ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి 19 నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను” [లూకా 17:17-18]. నేరుగా చెప్పాలంటే, కృతజ్ఞతతో కూడిన ఆత్మ లేకపోవడం దేవునికి అసంతృప్తి కలిగించే అవిధేయత యొక్క చర్య.
కాబట్టి కృతజ్ఞత లేని హృదయాన్ని కలిగి ఉండటం వల్ల వచ్చే ప్రమాదాలు నిజంగా చాలా తీవ్రంగా ఉంటాయని గమనించండి! ఇది దేవుని చిత్తాన్ని అతిక్రమిస్తుంది కాబట్టి దీని వలన ఆయనకు అసంతృప్తి కలుగుతుంది. మనం మన నోటితో ఎంత చెప్పినా మనం ఆయన పిల్లలం కాదనే వాస్తవ స్థితిని చూపిస్తుంది.
మరోవైపు, కృతజ్ఞత కలిగిన ఆత్మ మనకుంటే దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి! వాటిలో 4 చూద్దాం.
II. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించుకోవడం వలన కలిగే ప్రయోజనాలు.
ప్రయోజనం # 1. గర్వం తగ్గుతుంది-వినయం పెరుగుతుంది.
కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న ప్రధాన అడ్డంకులలో ఒకటి గర్వం. మనలో చాలామంది మన విజయానికి కారణం మనమే అనుకుంటాము. ఏది ఏమైనప్పటికీ, కృతజ్ఞత కలిగిన హృదయం అన్ని మంచి విషయాలు సార్వభౌమాధికారంగల దేవుని చేతి నుండి వచ్చాయని మరియు ఆయన కనికరం లేకుండా మంచి ఏమీ సాధ్యం కాదని గుర్తిస్తుంది. 1 కొరింథి 4:7లో “ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” అని మనకు జ్ఞాపకం చేయబడింది.
“ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎ బిగ్ షాట్” అనే శీర్షికలో ఒక ప్రముఖ క్రైస్తవ వ్యాపారవేత్త హోవార్డ్ బట్ ఇలా అన్నాడు:
నా గర్వమే నేను భగవంతుపై ఆధారపడకుండా చేస్తుంది. నా విధికి నేనే యజమానినని, నా జీవితాన్ని నేనే నడిపిస్తున్నానని, ఒంటరిగానే అన్నీ సాధిస్తున్నానని అనుకునేలా చేస్తుంది. కానీ ఆ భావనే నా మొదటి మోసము. నేను ఒంటరిగా ఏమి చేయలేను. నేను ఇతరుల నుండి సహాయం పొందాలి, నేను కేవలం నాపై మాత్రమే ఆధారపడలేను. నా తర్వాతి శ్వాస కోసం నేను దేవునిపై ఆధారపడి ఉన్నాను. బలహీనమైన, పరిమితమైన మనిషినైన నేను ఎంతో గొప్పవాడినని నటించడం నన్ను నేను మోసం చేసుకోవడమే; నాకు నేను అబద్ధం చెప్పుకోవడమే. నేను మనిషిలా కాకుండా దేవునిలా నటిస్తున్నాను. నా అహంకారమే నేను చేసే విగ్రహారాధన. అది నరకం యొక్క జాతీయ మతము!
అయితే కృతజ్ఞత కలిగి ఉండడమే గర్వానికి సరైన నివారణ. మనకున్నదంతా దేవుడు అనుగ్రహించడం వల్లనే కలిగిందని నిత్యం గుర్తు చేసుకోవడం వలన మనం వినయాన్ని పెంపొందించుకోవచ్చు.
ప్రయోజనం # 2. ఫిర్యాదు చేయడం తగ్గుతుంది – సంతృప్తి పెరుగుతుంది.
మన జీవితంలో దేవుడు చేసిన, చేస్తున్న కార్యాలకు మనం నిత్యం కృతజ్ఞతలు చెబుతుంటే, ఫిర్యాదు చేయడమనే పాపంలో పడిపోము. ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఉన్న తప్పు గురించి నిజాన్ని చెప్పడం ఫిర్యాదు చేయడం అవ్వదు కాని మన జీవితంపై దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వైఖరినే ఫిర్యాదు చేయడం లేదా సణగడం అంటారు. “దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తే, ఎందుకు ఆయన నాకు ఇలా జరగనిస్తాడు?” అని అంటారు. మన నోటితో ఫిర్యాదు చేయకపోయినా [కొందరు అంతర్ముఖులు] అది పాపం. పాపాలు చేసినవారు [మనందరం] ఫిర్యాదు చేయవచ్చా?
విలాపవాక్యములు 3:39లో “సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?” అని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన పాపాల ఫలితంగా మనం ఏ మంచికి అర్హులం కామని మనం అర్థం చేసుకుంటే, మన జీవితంలో దేవుని దయకు మనం ఆశ్చర్యపోతాము – అన్ని వేళలా సంతృప్తి చెంది కృతజ్ఞత కలిగి నిత్యం “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” [కీర్తన 23:1] అని చెబుతాము.
ప్రయోజనం # 3. దేవునిపై అనుమానం తగ్గుతుంది – దేవునిపై నమ్మకం పెరుగుతుంది.
ఎల్లవేళలా దేవుపై విశ్వాసం ఉంచడానికి ముఖ్యమైన అవరోధం కృతజ్ఞత కలిగిన ఆత్మ లేకపోవడమే. అయితే, కృతజ్ఞతలు చెల్లించడం ఈ సమస్యకు సరైన నివారణ. పౌలు దేవుడు తనను విడిపించిన వాటన్నిటిని నిత్యం జ్ఞాపకం చేసుకునేవాడు కనుక తన శ్రమలన్నిటిలో దేవుని విశ్వసించగలిగాడు, అలాగే భవిష్యత్తులో కూడా దేవునిపై విశ్వాసం ఉంచగలడు. అతని మాటలను గమనించండి, “3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. 10 ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము” [2 కొరి 1:3, 10].
గతంలో దేవుడు చూపించిన కనికరాల గురించి నిరంతరం గుర్తుచేసుకునే కృతజ్ఞత కలిగిన ఆత్మ ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాల కోసం దేవునిపై ఆధారపడేలా బలపడుతుంది. ఆ విధంగా ఇది సందేహపడకుండా, నిరాశకు గురికాకుండా, అడ్డదారులు తొక్కకుండా రక్షిస్తుంది.
ప్రయోజనం # 4. ఆందోళన తగ్గుతుంది—శాంతి పెరుగుతుంది.
క్రైస్తవ జీవనం యొక్క ప్రతికూలతలలో ఒకటి ప్రతికూలతలపై అనారోగ్యకరమైన దృష్టిని కలిగి ఉండటం మరియు ఆశీర్వాదాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి తగినంత సమయం తీసుకోకపోవడం. అలాంటి వైఖరి వలన చింత మన హృదయాలను పాలిస్తుంది. అయితే, దేవుని వాక్యంలో చింతకు నివారణ ఉంది: ఫిలిప్పీ 4:6-7లో చూసినట్లుగా కృతజ్ఞతతో కూడిన హృదయాన్ని కలిగి ఉండటం.
ఫిలిప్పీ 4:6లో దేవుడు ఇలా చేయమని ఆజ్ఞాపించాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” మన ప్రార్థనలు కృతజ్ఞతతో నిండి ఉన్నప్పుడు దేవుని వాగ్దానం ఏమిటంటే, మన హృదయాలు చింత నుండి విముక్తి పొందగలవు, ఎందుకంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ [మన] హృదయములకును మీ [మన] తలంపులకును కావలియుండును [ఫిలిప్పీ 4:7].
కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించుకోవడం వల్ల కలిగే 4 ప్రయోజనాలను చూసిన తర్వాత, మనం ఈ రకమైన హృదయాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో చూద్దాం.
III. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించడంపై సూచనలు.
కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించడానికి క్రింద 2 సూచనలు ఉన్నాయి.
సూచన # 1. సిలువపై క్రమం తప్పకుండా ప్రతిబింబించండి.
ఇప్పటివరకు జీవించిన గొప్ప క్రైస్తవులలో ఒకరు అపొస్తలుడైన పౌలు. అనేక బాధలను అనుభవించినప్పటికీ, పౌలు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అతని రహస్యం ఏమిటి అనే ప్రశ్నకు 1 కొరింథి 2:2లో సమాధానం ఉందని నేను నమ్ముతున్నాను, “నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.” పౌలు ఇతర సమస్యల గురించి మాట్లాడలేదని దీని అర్థం కాదు. ఇదే పత్రికలో అతడు అనేక అంశాలపై మాట్లాడాడు. కానీ అతని ప్రధాన దృష్టి యేసుపైన మరి ముఖ్యంగా ఆయన సిలువ మరణం పునరుత్థానం ద్వారా సాధించిన దానిపై ఉంది. ఆ సత్యాలను నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం వలన అతనికి శాశ్వతమైన దృక్పథం వచ్చింది. తద్వారా అతడు ఎంత శ్రమలో ఉన్నప్పటికి కృతజ్ఞతతో పొంగిపోయేలా చేసింది!
మనం కూడా అలాగే ఉండాలి. సిలువపై యేసు మన కోసం సాధించిన దానిని మనం ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటామో అంత ఎక్కువగా మనం కృతజ్ఞత చెల్లించడంలో ఎదుగుతాము.
సూచన # 2. కృతజ్ఞత చెల్లించడం ప్రార్థనలో అంతర్భాగంగా ఉండాలి.
ఇది కొలొస్సి 4:2లో దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ, “ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.” మరో మాటలో చెప్పాలంటే, కృతజ్ఞత చెల్లించడం మన ప్రతి ప్రార్థనలో అంతర్భాగంగా ఉండాలి! దేవుడు మన కోసం చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పడానికి మనం సమయాన్ని కేటాయించాలి.
మన పిల్లలు అవసరమైనప్పుడు మాత్రమే మనతో మాట్లాడుతూ చాలా అరుదుగా కృతజ్ఞతలు చెప్పడాన్ని ఒక సారి ఊహించడండి! మనకు దుఃఖం కలుగుతుంది కదా? అయినప్పటికీ, మన అవసరాల కోసం మాత్రమే ఆయన వద్దకు వెళ్లడం కృతజ్ఞత చెల్లించకపోవడం ద్వారా మన పరలోకపు తండ్రిని తరచుగా దుఃఖపరుస్తున్నాము. మనం ఆయనను ఇకపై దుఃఖపరచకూడదు. దేవునికి, ఆయన మన కోసం చేసిన వాటన్నిటికి నిత్యం కృతజ్ఞతలు చెప్పడానికి పూర్తిగా ప్రయత్నం చేద్దాము.
ముగింపు మాటలు
బైబిల్లో బాగా తెలిసిన మరియు బాగా ఇష్టపడే పాత్ర దానియేలు. చిన్న వయస్సులో కూడా ప్రభువు కోసం నిలబడాలనే అతని సంకల్పం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది [దానియేలు 1]. దానియేలు తన వృద్ధాప్యంలో ఎదుర్కొన్న కష్టకాలం ఏమిటంటే–రాజు ప్రతిమకు మాత్రమే ప్రార్థించాలి లేదా సింహాల గుహలోకి విసిరివేయబడి మరణాన్ని అనుభవించాలి. అతని స్పందన ఆశ్చర్యకరమైనది. అదేమిటంటే, “ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేముతట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” [దానియేలు 6:10].
గమనించండి, దానియేలు దేవునికి వ్యతిరేకంగా సణగలేదు. “ఇన్నాళ్ళూ నేను నీకు నమ్మకంగా ఉన్నాను, ప్రతిఫలంగా నాకు లభించేది ఇదేనా?” అని అతడు అనలేదు కాని అతడు “యథాప్రకారముగా” తన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. సంపన్న సమయాల్లో కృతజ్ఞతలు చెప్పడం అనే అలవాటు అతనికి కష్ట సమయాల్లో కూడా కృతజ్ఞతలు చెప్పగలిగేలా చేసింది. దేవుడు అతని ప్రార్థనలను విన్నాడు—ఎందుకంటే అది కృతజ్ఞత కలిగిన హృదయం నుండి వచ్చింది! మనం కూడా అలాంటి హృదయాన్ని పొందేందుకు కృషి చేద్దాం!