క్రీస్తు మరణము — 4 అద్భుతమైన సత్యాలు

(English version: “Death of Jesus – 4 Amazing Truths”)
“ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను” [1 పేతురు 3:18]
మానవులపై పాపానికున్న శక్తిని వివరించే ఒక కథను చార్లెస్ స్పర్జన్ చెప్పాడు.
ఒక క్రూరమైన రాజు తన పౌరుల్లో ఒకరిని తన సమక్షంలోకి పిలిచి అతని వృత్తిని అడిగాడు. ఆ వ్యక్తి నేను కమ్మరిని అని బదులిచ్చాడు. అప్పుడు ఆ రాజు పొడవైన గొలుసు తయారు చేసి తీసుకురమ్మని ఆదేశించాడు. ఆ వ్యక్తి లోబడి దానిని చూపించడానికి చాలా నెలల తర్వాత చక్రవర్తి దగ్గరకు తిరిగివచ్చాడు.
అయితే, రాజు అతడు చేసిన పనిని ప్రశంసించడానికి బదులు గొలుసు పొడవును రెండు రెట్లు ఎక్కువ చేయమని అతడిని ఆదేశించాడు. అతడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినప్పుడు కమ్మరి తన పనిని రాజుకు దగ్గరకు తీసుకువచ్చాడు. కానీ మళ్లీ దాని పొడవును రెట్టింపు చేయమని ఆజ్ఞాపించాడు. ఇలా చాలాసార్లు జరిగింది. చివరికి, ఆ దుష్ట రాజు ఆ వ్యక్తిని అతడు స్వయంగా తయారు చేసుకున్న సంకెళ్లలోనే బంధించి మండుతున్న కొలిమిలో వేయమని ఆదేశించాడు.
“సాతాను కూడా మనుషులతో అలాగే చేస్తుంది. తమ గొలుసులను తామే తయారుచేసుకునేలా సాతాను వారిని ప్రేరేపిస్తాడు. ఆపై వారి చేతులు కాళ్ళు దానితో బంధించి చీకటిలో పడవేస్తాడు.” అని స్పర్జన్ చెప్పాడు.
ఆ క్రూరమైన రాజులాగే, పాపం తన సేవకుల నుండి భయంకరమైన ధరను వసూలు చేస్తుంది. “పాపమువలన వచ్చు జీతము మరణము” [రోమా 6:23] అని బైబిలు చెబుతోంది. అయితే, శుభవార్త ఏమిటంటే ఆ వచనంలోని చివరి భాగంలో “అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” అని ఉంది. మనకు నిత్యజీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు మరణించారు. 1 పేతురు 3:18లో ఆయన మరణం అన్ని మరణాలలో కెల్లా ఎంత గొప్పదో తెలియజేసే ఆయన మరణానికి సంబంధించిన 4 అద్భుతమైన సత్యాలను మనకు తెలియజేస్తుంది,
1. ఇది ప్రత్యేకమైనది. “క్రీస్తు పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను.” క్రీస్తు ఏ పాపమూ చేయలేదు [1 యోహాను 3:5]. అయినప్పటికీ, పరిపూర్ణమైన ప్రేమతో దేవుని ఆజ్ఞకు విధేయత చూపి ఆయన పాపాల కోసం మరణించారు. ఆయన మరణం ప్రత్యేకమైనది అనడానికి అదే కారణము. ఏ పాపం చేయని క్రీస్తు మీవంటి నా వంటి పాపుల కోసం మరణించారు.
2. ఇది సంపూర్ణమైనది. “పాపాలన్నిటి కోసం ఒక్కసారే.” ఈ మాటకు అర్థము ఒక్కసారే అని, ఎప్పుడూ పునరావృతం కాదు అని అర్థము. పాపాల కోసం జంతువులు బలి ఇవ్వనవసరం లేదు. యేసు సిలువపై “సమాప్తమైనది” అని చెప్పారు [యోహాను 19:30]. దీని అర్థం పాపపరిహారం పూర్తిగా చెల్లించబడింది. 50% కాదు, 99% కాదు 100% చెల్లించబడింది. సమాప్తమైనది అంటే సిలువపై రక్షణ కార్యం పూర్తయిందని అర్థము. ఆయన మన పాపాల కోసం ఒకేసారి మరణించారు కాబట్టి ఆయన మరణం పరిపూర్ణమైనది.
3. ఇది ప్రత్యామ్నాయం. “అనీతిమంతులకొరకు నీతిమంతుడాయెను.” బైబిలులో ఇప్పటివరకు వ్రాయబడిన అత్యంత ముఖ్యమైన వచనాలలో ఇది ఒకటి. ఈ ప్రక్రియను నింద లేదా ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటారు, అనగా, ఒకరి పనులకు మరొకరు ప్రభావితమవుతారు [2 కొరింథి 5:21]. యేసు మనకు బదులుగా మన శిక్షను స్వీకరించి మన స్థానంలో ఆయన మరణించాడు, తద్వారా మనం మన పాపాలను విడిచిపెట్టి, ఆయన మరణాన్ని మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అంగీకరించి ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు మన పాపాలకు తగిన శిక్ష నుండి మనం రక్షించబడతాము. [రోమా 1:17, రోమా 1:17, అపొ కా 3:19, 1 కొరింథీ 15:1-3, రోమా 10:9, అపొ కా 4:12].
4. ఇది ఉద్దేశపూర్వకమైనది. “మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడినాడు.” యేసు పాపులను “దేవుని యొద్దకు” తిరిగి తీసుకువస్తాడు. యేసు “శరీరవిషయంలో చంపబడ్డాడు” కాబట్టి ఇది జరుగుతుంది. అయితే, మరణం ముగింపు కాదు. దేవుడు యేసు చేసిన పరిపూర్ణ త్యాగాన్ని అంగీకరించాడు కాబట్టి, “ఆత్మవిషయంలో బ్రదికింపబడినాడు” అనే వాక్యం ద్వారా సూచించబడినట్లుగా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా యేసును శరీరంతో మృతులలో నుండి సజీవంగా లేపారు. యేసు పునరుత్థానం ఆయన మరణం ఉద్దేశపూర్వకమైనదని తెలియచేస్తుంది. అది మనల్ని దేవుని దగ్గరకు తీసుకువస్తుంది, తద్వారా మనం నిత్యజీవాన్ని పొందగలుగుతాము.
యేసు మరణం గురించి మనకు 4 అద్భుతమైన సత్యాలు ఉన్నాయి: ఇది ప్రత్యేకమైనది, సంపూర్ణమైనది, ప్రత్యామ్నాయం మరియు ఉద్దేశపూర్వకమైనది. మన కోసం తనను తాను అర్పించుకున్న ఈ అద్భుతమైన యేసును మనం ప్రేమించకుండా ఆరాధించకుండా ఎలా ఉండగలము?
పర్షియా సామ్రాజ్యస్థాపకుడు సైరస్ ఒకసారి ఒక యువరాజును, అతని కుటుంబాన్ని బంధించాడు. వారు అతని ముందుకు వచ్చినప్పుడు చక్రవర్తి ఖైదీతో, “నేను నిన్ను విడుదల చేస్తే నాకు ఏమి ఇస్తావు?” అని అడిగాడు. నా సంపదలో సగం అని అతను సమాధానం ఇచ్చాడు. “మరి నేను మీ పిల్లలను విడుదల చేస్తే?” అని అడిగినప్పుడు నాకున్నవన్నీ ఇస్తాను అన్నాడు. “నేను మీ భార్యను విడుదల చేస్తే?” “అన్నప్పుడు, రాజా, నన్ను నేను సమర్పించుకుంటాను” అన్నాడు.
సైరస్ అతని భక్తికి ఎంతగానో కదిలిపోయి వారందరినీ విడిచిపెట్టేశాడు. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ యువరాజు తన భార్యతో, “సైరస్ అందమైన వ్యక్తి కదా!” అన్నాడు. అందుకు ఆమె తన భర్త వైపు ఎంతో ప్రేమతో చూస్తూ, “నేను గమనించలేదు. నా కోసం తన తాను సమర్పించుకోడానికి సిద్ధంగా ఉన్న నిన్నే చూస్తూ ఉండిపోయాను” అన్నది.
అలాగే మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి, మన కోసం తన్ను తాను అర్పించుకున్న యేసుపైనే మన దృష్టిని పెట్టడం కొనసాగిద్దాము!
పాపాల కోసం మరణించిన క్రీస్తు అయిన ఈ యేసు వైపు మీరు తిరగకపోతే, ఇప్పుడైనా మీ పాపాలను విడిచిపెట్టి విశ్వాసంతో యేసు మీ పాపాలకు వెల చెల్లించారని అంగీకరించి మీ జీవితానికి ప్రభువు, రక్షకునిగా ఆయనను స్వీకరించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.