ఒక క్రైస్తవుడు విశ్వాసంతో మరణాన్ని ఎదుర్కోవడానికి 3 కారణాలు

Posted byTelugu Editor April 4, 2023 Comments:0

(English Version: 3 Reasons Why A Christian Can Confidently Face Death)

శారా వించెస్టర్ భర్త తుపాకీలను తయారు చేసి అమ్మడం ద్వారా ఎంతో ఆస్తిని సంపాదించారు. విషజ్వరంతో అతడు 1918లో మరణించిన తరువాత, శారా  మరణించిన తన భర్తతో మాట్లడడానికి చనిపోయినవారితో మాట్లాడే ఒక మంత్రగత్తెను కలిసింది. ఆ మంత్రగత్తె చెప్పిన ప్రకారం,  ఆమె చనిపోయిన భర్త ఆమెకు ఇలా చెప్పాడు: “నీవు నీ ఇంటిని కడుతూ ఉన్నంత కాలం మరణాన్ని ఎదుర్కోవు”. కాబట్టి ఆమె ఆ మంత్రగత్తె మాటలు నమ్మి నిర్మాణం పూర్తవ్వని 17 గదులున్న ఒక భవంతిని కొని దానిని విస్తరించడం ప్రారంభించింది.

ఆ ప్రాజెక్టు విలువ అప్పట్లో సుమారు 5 మిలియను డాలర్లు అయితే దానిలో పని చేసేవారు రోజుకు 50 సెంట్లు సంపాదించుకునేవారు. 85 సంవత్సరాల వయస్సులో ఆమె మరణించేవరకు ఆ నిర్మాణం కొనసాగింది. మరో 80 సంవత్సరాల వరకు దానిని కడుతూ ఉండడానికి కావలసినంత సామాగ్రిని ఆమె వదిలివెళ్లింది. నేడు ఆ కట్టడం  కొన్ని మిలియను ప్రజలను బంధించి ఉంచిన మరణభయానికి మౌనసాక్షిగా ఉంది.

అయితే, ప్రజలు మరణభయంలో ఎందుకు జీవించకూడదో కారణాలను బైబిలు తెలియచేస్తుంది. ఆ కారణాలను మనం వివరంగా తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చూద్దాము. మరణం అంటే ఏమిటి? సాధారణ మాటల్లో చెప్పాలంటే ఎడబాటు వేరు కావడం, ఇది సాధారణంగా వచ్చే జవాబు. బైబిలులో మూడు రకాల మరణాల గురించి వివరించబడినది.

  1. శారీరక మరణము: ఈ మరణంలో శరీరం నుండి ఆత్మ వేరు చేయబడుతుంది. హెబ్రీ 9:27లో “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” అని మనకు బోధించబడింది. పునర్జన్మ లేదని బైబిలు స్పష్టం చేస్తుంది. ఈ వాక్యంలో ప్రజలందరు ఒక్కసారే మరణిస్తారని స్పష్టంగా ఉంది. అనేకసార్లు మరణించరు.
  2.  ఆత్మ సంబంధమైన మరణము: ఈ మరణంలో దేవుని జీవం నుండి శరీరం ఆత్మ వేరు చేయబడతాయి. ఎఫెసి 2:1లో “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను” అనే వాక్యం క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందిన వారిగా మనమందరం ఈ లోకంలోనికి వచ్చాము. యేసు అనుగ్రహించిన జీవాన్ని అంగీకరించకుండా ఒకరు మరణిస్తే వారి యొక్క ఈ పరిస్థితి శారీరక మరణానికి ఆ తర్వాత శాశ్వతమైన మరణానికి దారితీస్తుంది.
  3. శాశ్వతమైన మరణము: ఈ మరణంలో ఈ భూమి మీద జీవించినప్పుడు యేసుని తిరస్కరించడం వలన శాశ్వతంగా దేవుని నుండి శరీరం ఆత్మ రెండూ వేరు చేయబడతాయి. ప్రకటన 20:15లో “ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను” అని చెబుతూ అటువంటి ప్రజల చివరి గమ్యం ఏమిటో మనకు బోధించబడింది. ఈ మరణాన్ని పొందినవారు శాశ్వతంగా నరకంలో ఉంటారు.

మరణం గురించిన ఈ ముఖ్యమైన అవగాహనతో, క్రైస్తవులు ఎందుకు నమ్మకంగా మరణాన్ని ఎదుర్కోవాలో 3 కారణాలు చూద్దాము. 

1. వ కారణము # క్రైస్తవుల మీద మరణానికి అధికారం లేదు.

ప్రభువైన యేసు భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన మానవశరీరంతో మానవునిగా వచ్చి నిర్దోషమైన జీవితాన్ని జీవించి, పాపాల కొరకు మనం అనుభవించవలసిన శిక్షగా మనకు బదులుగా మరణించి సజీవునిగా తిరిగి లేచారు. దాని ఫలితంగా, తమ పాప క్షమాపణ కొరకు యేసునందు నమ్మకముంచినవారు భవిష్యత్తులో తాము శిక్ష అనుభవించమనే నమ్మకాన్ని కలిగివుంటారు. వారు ఎన్నడు శాశ్వతమైన మరణాన్ని పొందరు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మరణభయంతో జీవించవలసిన అవసరం వారికి లేదు ఎందుకంటే యేసు “జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించారు” (హెబ్రీ 2:15).

విశ్వాసులకు శారీరక మరణం అంటే మరో జీవితానికి అనగా దేవుని సన్నిధిలో నిరంతం ఉండే జీవితానికి ప్రయాణించడమే. అది నిద్రపోయి తిరిగి లేవడంతో సమానము. బైబిలులో క్రైస్తవుల మరణాన్ని నిద్రించడంతో పోల్చడంలో ఆశ్చర్యమేమి లేదు (1 కొరింథి 15:51; 1 ధెస్సలొ 4:13). క్రైస్తవుల మీద మరణానికి అధికారం లేదు అనేదే మనం మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అనడానికి మొదటి కారణము.

2. వ కారణము #మరణం క్రైస్తవులను తక్షణమే ప్రభుని సన్నిధిలో ఉండేలా చేస్తుంది.

ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు శరీరం సమాధి చేయబడుతుంది కాని ఆత్మ తక్షణమే ప్రభుని సన్నిధికి చేరుకుంటుంది. పౌలు 2 కొరింథి 5:8లో “ఇట్లు ధైర్యముగలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము” అని  చెప్పాడు. దేహమును విడిచి పెట్టడం అనేది ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడాన్ని సూచిస్తుంది. ప్రభువునొద్ద నివసించుట అనేది ఆత్మ ప్రభుని సన్నిధిలో ఉండడాన్ని సూచిస్తుంది.

సిలువ మీద యేసే స్వయంగా పశ్చాత్తపపడిన దొంగకు “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని” వాగ్దానం చేశారు (లూకా 23:43). దేవుని సన్నిధిలో ఉంటావు అనే వాగ్దానం సుదూరంగా ఉన్న భవిష్యత్తుకుగాని చనిపోయిన తర్వాత కొన్ని రోజులకుగాని సంబంధించిన వాస్తవికత కాదు అయితే నేడు అనేది తక్షణమే దేవుని సన్నిధిలో ఉండడాన్ని సూచిస్తుంది. క్రైస్తవుని ఆత్మ ప్రభువుతో ఉండడానికి వెళ్లడానికి ముందు నిరీక్షించవలసిన సమయం కాని తాత్కాలికంగా ఉండే చోటు కాని లేదు. ఇది భౌతిక మరణం తరువాత వెంటనే జరుగుతుంది.యేసు మరలా వచ్చినప్పుడు మాత్రమే దానికి మినహాయింపు ఉంది, ఆయనను వెంబడించే వారందరు శారీరక మరణాన్ని పొందకుండానే తక్షణమే ఆయనతో పాటు ఉంటారు (1థెస్సలొ 4:16-17). ఇది క్రైస్తవులు ఎందుకు మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అనడానికి రెండవ కారణము.

3. వ కారణము #మరణం క్రైస్తవులు నూతనమైన సంపూర్ణమైన శరీరాన్ని పొందేలా చేస్తుంది.

మనం ఏ శరీరంతో అయితే ఈ లోకానికి వచ్చామో ఆ భౌతిక శరీరం పాపానికి అనారోగ్యానికి లోబడి ఉంటుంది. ఆ కారణంగానే శారీరక మరణం కలుగుతుంది. అయితే, తన ప్రజల కొరకు భవిష్యత్తులో యేసు తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులందరు సంపూర్ణమైన నూతన శరీరాలను అనగా, పాపరహితమైన అనారోగ్యానికి గురికాని శరీరాన్ని పొందుతారు. అప్పటికే చనిపోయి ఆత్మ ప్రభుని సన్నిధి చేరుకున్న క్రైస్తవులు కూడా అదే సమయంలో నూతన శరీరాలను పొందుతారు. దీనినే బైబిలులో మహిమ ప్రవేశం అంటారు. 1 కొరింథి 15:51-52లో “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము” అని వివరించబడింది.

1 కొరింథి 15:42-44లో “42 మృతుల పునరుత్థానమును ఆలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; 43ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. 44 ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది” అని భవిష్యత్తులో మనం పొందుకునే నూతన శరీరం గురించి మరింత వివరంగా చెప్పబడింది. ఈ నూతనమైన ఆత్మ సంబంధ శరీరాన్ని పునరుత్థాన శరీరమని అక్షయమైన మహిమ శరీరమని కూడా అంటారు. ఈ కారణంగానే క్రైస్తవులమైన మనము “దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచున్నాము” (రోమా 8:23).  ఇది క్రైస్తవులు మరణాన్ని ఎందుకు ధైర్యంగా ఎదుర్కోవాలి అనడానికి మూడవ కారణము.

విశ్వాసులు మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అనడానికి మూడు బలమైన కారణాలు, మూడు గొప్ప వాస్తవాలు ఇవే. మొదటిది, మనపై మరణానికి అధికారం లేదు; రెండవది మరణం మనల్ని తక్షణమే ప్రభుని సన్నిధిలో ఉండేలా చేస్తుంది; చివరిది, మరణం నూతనమైన సంపూర్ణమైన శరీరాన్ని పొందుకునేలా మనకు సహాయపడుతుంది.

ఈ గొప్ప వాస్తవాలు క్రైస్తవులు మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని సార్లు, ముఖ్యంగా వృద్ధాప్యంలో లేదా తీవ్రమైన అనారోగ్యంలో నాకు ఏమి జరుగుతుంది? నాకు అర్హత లేకుండా పోతుందా? నాకు బాధ కలుగుతుందా? అనే ప్రశ్నలు క్రైస్తవులలో తలెత్తుతాయి. అయితే ఇవి చాలా సహజమైన ఆందోళనలు అయినప్పటికి మనం దేవుని వాగ్దనం వైపు కాపుదల వైపు చూస్తూ వాటికి బైబిలుపరమైన జవాబు ఇవ్వవలసిన అవసరం ఉంది. “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” (యెషయా 46:4) అని దేవుడు వాగ్దానం చేశాడు.  

మనం శారీరకమైన బాధల గుండా వెళ్లాలనేది దేవుని చిత్తమైతే, మన పట్ల దేవుని చిత్తం ఎంతో గొప్పదని ఎరిగి మనం ఇంకా నెమ్మది కలిగి భయం లేకుండా ఉంటాము. పరలోకంలో ఉన్న మన అంతిమ గృహాన్ని చేరుకునే వరకు ఈ భూమి మీది ప్రయాణమంతటిలో ఆయన మనల్ని నడిపిస్తారు (ఫిలిప్పి 1:6). రోజులు గడిచేకొలది మనం ప్రభువుతో ఉండానికి చేరువవుతున్నామనేది కష్టసమయాలలో మనం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనకు సహాయపడుతుంది.

ఇవి క్రైస్తవుల కొరకు గొప్ప వాస్తవాలు అయితే, క్రైస్తవేతరులకు భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది. అవిశ్వాసి మరణిస్తే వాని శరీరం సమాధి చేయబడుతుంది కాని అతని ఆత్మ బాధించబడడానికి పాతాళానికి అనగా నరకానికి వెళ్తుంది (లుకా 16:23) అని బైబిలులో చెప్పబడింది. అంతిమ తీర్పు దినం వరకు, శాశ్వతంగా నరకంలో పడవేయబడడానికి ముందు వారి పాపాల కొరకు తీర్పు తీర్చబడడానికి దేవుని ముందు నిలబడడానికి లేపబడే వరకు అవిశ్వాసుల ఆత్మలు అక్కడే ఉంటాయి. ప్రకటన 20:13లో అవిశ్వాసులందరు తీర్పు తీర్చబడతారని చెప్పబడింది. “వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.” వారి పాపాలు క్షమించబడలేదు కనుక వారు “అగ్నిగుండములో పడవేయబడెను” (ప్రకటన 20:14). అది ఎంతో భయంకరమైన విషాదాంతము..

ఏమైనప్పటికి జీవితం ఆ విధంగా ముగిసిపోకూడదు. పాపాలను విడిచిపెట్టి యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధంగా జన్మించడం అనే అనుభవాన్ని పొందవచ్చును. అలాగే ఈ భయంకరమైన తీర్పును తప్పించుకోవచ్చును ఎందుకంటే పాపానికి దేవుని తీర్పును యేసు అనుభవించారు. యోహాను 5:24లో యేసే స్వయంగా “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని వాగ్దానం చేశారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినవారికి ఈ వాక్యంలో మూడు వాగ్దానాలు ఉన్నాయి.

  1. వారు నిత్యజీవం పొదుతారు.
  2. తమ పాపాల కొరకు భవిష్యత్తులో తీర్పు పొందరు.
  3. ఆత్మ సంబంధమైన మరణములోనుండి ఆత్మ సంబంధమైన మరియు నిత్యజీవములోనికి దాటియున్నారు, ఈ విధంగా వారు శాశ్వతమైన మరణాన్ని తప్పించుకున్నారు.

ఇవి అసాధారణమైన వాగ్దానాలు అయినా నమ్మితే మరణభయం నుండి విడిపించబడతారు. మనకు మరణం అనివార్యమైనది. ఏ వైద్యప్రణాళిక మరణాన్ని జయించలేదు! హెబ్రీ 9:27లో, “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” అని స్పష్టంగా చెప్పబడింది. అందరూ ఒకసారి మరణాన్ని పొందాల్సిందే! ఒక గంటకు సుమారు 10,000మంది చనిపోతున్నారు. త్వరలో లేదా కొంతకాలం తర్వాత అయిన మనం ఆ సంఖ్యలో చేరవలసిందే.

మీరు మరణాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు క్రైస్తవులైతే సిద్ధంగానే ఉంటారు కదా! కేవలం క్రైస్తవులు మాత్రమే నమ్మకంతో సంతోషంగా “55 ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? 57అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” అని పాడగలరు (1 కొరింథి 15:55,57).

Category

Leave a Comment