అన్ని బాంధవ్యాలను భయపెట్టే ఒక విషయం

Posted byTelugu Editor April 4, 2023 Comments:0

(English Version: The One Thing That Threatens All Relationships)

అన్ని బాంధవ్యాలను భయపెట్టే ఒక విషయం ఏమిటో మీరు ఊహించగలరా? ద్వేషం! అది వివాహాలపై సంఘాలపై ఇంకా అన్నిటిపైనా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితంలో ద్వేషమనేది చాలా భయంకరమైన వ్యాధి. సాధారణ జలుబు కన్నా వేగంగా ఇది వ్యాపిస్తుంది, అది ఒకరి ఆత్మీయ జీవితంలోని జీవాన్ని హరించివేస్తుంది. ఇది ఆత్మల కేన్సరు, దీనికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది బలి అవుతున్నారు.

అయితే ఈ వ్యాధికి విరుగుడు ఉంది. ఆ విరుగుడు ఇంగ్లీషు భాషలోనే చాలా అందమైన పదం ఫర్‌గివ్ లో దొరుకుతుంది అదే “క్షమాపణ.“ ఫర్‌గివ్ (క్షమాపణ) అనేది ఒక సాధారణ పదమే అయినప్పటికి దాని యొక్క నిజమైన సారం చివరి భాగమైన గివ్ (ఇవ్వడం)లో ఉంది. క్షమించడం అంటే నీ పట్ల తప్పు చేసినవారిని దాని నుండి విడుదల ఇవ్వడమే. అంటే పగతీర్చుకొనే హక్కును  వదులుకోవడం మరియు ఒకరి హృదయంలో ద్వేషం పెరగకుండా అణచివేయడమే.

క్రైస్తవులు క్షమించే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ ఆశించడమే కాకుండా ఆజ్ఞాపిస్తుంది. దీనికి మించిన మంచిది మరొకటి లేదు. క్షమాపణను అత్యధికంగా సాధన చేయాలని విశ్వాసులకు పిలుపు ఇవ్వబడింది. దేవుడు క్షమించినట్లుగా క్షమించడానికి మనం పిలువబడ్డాము. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసి 4:32 అలాగే కొలసి 3:13)

క్షమించడం అంత తేలికైన విషయం కాదు. “దీని వలన ఉపయోగంలేదు, వాళ్ళు మరలా నన్ను బాధపెట్టారు, మొదటిసారే నేను వారికి క్షమించి ఉండకూడదు, వాళ్ళు ఇక మారరు“ మొదలైన ఆలోచనలతో కొన్నిసార్లు మనం పెనుగులాడతాము. అటువంటి పాపపు ఆలోచనల విషయంలో మనం మెలకువకలిగి ఉండాలి! ఇతరులను క్షమించడానికి తన పిల్లలకు సహాయపడతానని దేవుడు వాగ్దానం చేశాడు. (హెబ్రీ 6:18) వ్రాసినట్లుగా, దేవుడు అబద్ధం చెప్పడం అసాధ్యం,  కనుక మనం విడిచిపెట్టనవసరం లేదు.

దేవుడు మన హృదయాలలో కార్యం చేస్తున్నాడని ఈ శోధనలలో మనలను బలపరుస్తారని మనం కచ్చితంగా నమ్మాలి. ఆయన మనలను కడతారు కాని పడగొట్టరు. అయినప్పటికి కొన్నిసార్లు, కట్టడానికి పడగొట్టడం అవసరమవుతుంది. మనం పరిశుద్ధాత్మ శక్తిపై ఆనుకొని పట్టుదలగా ఉన్నప్పుడు మనం విజయం సాధిస్తాము.

మన హృదయాలలో ద్వేషం కలిగివున్నందుకు దేవుని క్షమాపణ వెదకడానికి మనం ప్రయత్నించాలి. పాపాన్ని అధికమించడానికి అది మొదటి అడుగు. తర్వాత మనల్ని బాధపెట్టిన వారిని క్షమించడానికి శక్తిని దయచేయమని మనం ఆయనను వేడుకుంటూ ఉండాలి. ఇతరుల పాపాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద్వేషం పుట్టించే ఆలోచనలు వచ్చిన ప్రతిసారి మన పాపాల గురించి లోతుగా తీవ్రంగా ఆలోచించాలి. ఒకరు ఇలా వ్రాసారు, “క్షమాపణా హృదయం కలిగినవారికి తమ పాపాలకు  సంబంధించిన జ్ఞాపకాలు అధికంగా ఉంటాయి కాని ఇతరుల పాపాలు తక్కువ జ్ఞాపకం ఉంటాయి. తమ సొంత పాపాలు దీర్ఘకాల జ్ఞాపకంగా ఉండడం భయంకరమైనదే కాని  యేసులో క్షమాపణ యొక్క నూతన స్వేచ్ఛ వారి హృదయాలో ప్రతిబింబించినట్లు ఆ జ్ఞాపకం సంతోషాన్ని కలిగిస్తుంది. తమకు వ్యతిరేకంగా పాపం చేసినవారిపట్ల వారు అదే క్షమాపణ కలిగి ఉన్నప్పుడు దానికి సమానమైన సంతోషంతో హృదయం నిండిపోతుంది.“

తన భర్త అశ్లీలచిత్రాలను చూస్తూ పాపం చేస్తున్నాడని పాస్టరుగారికి చెప్పిన ఒక భార్య గురించి చదివిన ఒక విషయం నేను గుర్తుచేసుకున్నాను. ఆమె అతనికి ఎదురుతిరగగా అతడు పశ్చాత్తాపపడి ఆమెను క్షమాపణ అడిగాడు. అయితే ఆమె ఆ పాపాన్ని ఉపేక్షించలేకపోయింది కనుక అతడు ఆ పాపం చేయడంలో ఎంత దుర్మార్గంగా ఉన్నాడో చెప్పడానికి మరియు అతనిని విడిచిపెట్టాలనే తన ఆలోచనను చెప్పడానికి పాస్టరుగారి దగ్గరకు వెళ్ళింది. ఈ వ్యాసం వ్రాసిన పాస్టరుగారు  ఆమెతో, తన భర్తకు వ్యతిరేకంగా ఆమె హృదయంలో ద్వేషం ఉందని, అతడు తాను చేసిన దానికి పశ్చాత్తాపపడినా ఆమె తన హృదయంలో ద్వేషాన్ని పెంచుకుంటూ తన సొంత పాపాలను చూడడంలో ఆమె విఫలమైనది చెప్పారు. అది చాలా ప్రమాదకరమైన పాపము.

ఇతరుల పాపాలను మనం చాలా స్పష్టంగా గుర్తు చేసుకుంటాము ( వారు తమ పాపాల గురించి పశ్చాత్తాపపడినప్పటికి) కాని, మన పాపాల విషయంలో గ్రుడ్డివారిగా మరచిపోయేవారిగా ఉంటాము. కనుక మనం ఇతరుల పాపాల కన్న మన పాపాల గురించి ఆలోచించడమనే అలవాటును తప్పనిసరిగా చేసుకోవాలి. గర్వానికి, స్వనీతికి మరియు క్షమించలేని హృదయానికి ఇది తప్ప మరొక విరుగుడు లేదు.

అది మనకు అవసరమైనప్పుడు క్షమాపణ అనేది ఎంతో అందమైన పదంగా ఉంటుంది కాని మనం క్షమించవలసినప్పుడు అది అంతే కురూపమైన పదంగా కనిపిస్తుంది. తప్పిపోయిన కుమారులను మనం  ఎంత త్వరగా క్షమిస్తామో అలాగే స్వనీతి కలిగిన పెద్ద అన్నయ్యలు  అవుతాము (కైత్ మాతిసన్) అనేది అంతే  గుర్తుపెట్టుకో తగినది.

క్షమించలేకపోవడం అవిశ్వాసుల లక్షణము (రోమా1:31; 2 తిమోతి 3:3). కరుణ క్షమాపణా గుణం క్రైస్తవుల లక్షణమని లేఖనం పదేపదే చెబుతుంది (1 యోహాను 3:10,14-15). మన జీవిత విధానం ద్వేషాన్ని క్షమించలేని స్వభావాన్ని ప్రదర్శిస్తుంటే, పాపాల కొరకు దేవుడు ఇచ్చిన క్షమాపణను మనం వ్యక్తిగతంగా రుచి చూశామా లేదా అని మన జీవితాన్ని లోతుగా పరీక్షించుకోవాలి.

 “మన పాపాలు క్షమించబడ్డాయో లేదో తెలుసుకోవాలంటే పరలోకం ఎక్కి వెళ్ళవలసిన అవసరం లేదు; ఇతరులను క్షమించగలుగుతున్నామా అని మన హృదయంలో లోపల చూడాలి. క్షమించగలిగితే దేవుడు మనల్ని క్షమించాడు అనడంలో సందేహం అవసరం లేదు“ అని థామస్ వాట్సన్ అన్నారు. మనం కల్వరి కొండపై నిలబడి, మన పాపాల కోసం విరిగి నలిగి రక్తమోడుతూ సిలువ మీద వ్రేలాడుతూ తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని వేడుకొంటున్న యేసుని చూస్తున్నప్పుడు (లూకా 23:34), లేదా చంపడానికి రాళ్ళతో కొట్టబడినా, ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని బిగ్గరగా వేడుకొంటున్న  స్తెఫనును చూసినప్పుడు (అపో.కా7:60) మనం ఇంకా విరోధాన్ని కలిగి ఉండగలమా? మనం ఇంకా “నేను ఆ వ్యక్తిని క్షమించలెను“ అని చెప్పగలమా? మనం దేవుని క్షమాపణ పొందగలమని, దానిని దుర్వినియోగం చేయవచ్చని, దానితో దూరంగా ఉండవచ్చని ఆలోచించడం మన మూర్ఖత్వము. మనల్ని మనం తగ్గించుకొని నిజంగా పశ్చాత్తాపపడి ఇతరులను క్షమించే కృప దయచేయమని దేవుని వేడుకోవాలి. అలా చేయకపోతే మనం కచ్ఛితంగా దేవుని నుండి తీవ్రమైన శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది.

తాము చేసిన పనుల బట్టి ప్రజలు పశ్చాత్తాపం చెందకపోయినా నేను వారిని క్షమించాలా? అని మీరు అడగవచ్చు. దానికి సమాధానం: ప్రజలు పశ్చాత్తాపం చెందకపోతే అది మీ చేతులలో లేదు. మనమందరం ఏమి చేయాలంటే, మనలో ద్వేషం పెరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి మరియు క్షమించడానికి ఎల్లప్పుడు సిద్థంగా ఉండే హృదయాన్ని అలవరచుకోవాలి. ప్రజలు పశ్చాత్తాపం చెందకపోతే అక్కడ మంచి బాంధవ్యాలు ఉండవు.

దేవునితో మన బాంధవ్యం విషయంలోనైనా సరే, పాపి పశ్చాత్తాపం చెందకపోతే అతడు కాని ఆమె కాని దేవునితో సంబంధాన్ని కలిగివుండలేరు. ఎదుటివారు పశ్చాత్తాపం చెందకపోయినా ద్వేషానికి బాధితులుగా మారకుండా మనల్ని మనం కాపాడుకోవాలని నా అభిప్రాయము. వారి పాపాలను దేవుడు చూసుకుంటాడు ఆయనే తీర్పుతీరుస్తాడు. అదేవిధంగా, రోమా 12:17-21 మరియు లూకా 6:27-28 లో ఉన్న బోధలను అనుసరిస్తూ మనల్ని బాధించినవారికి సాధ్యమైనంత వరకు మనం మంచినే చేస్తూ ఉండాలి.

మీరు క్షమించడానికి ఇష్టపడని వారెవరైనా మీ జీవితంలో ఉన్నారా? అది మీ భర్త లేక భార్య లేక తల్లిదండ్రలు లేక సంఘస్థులా? అది ఎవరైనప్పటికి, వారిని క్షమించడానికి సహాయం చేయమని  ఇప్పుడే దేవుని నిజంగా ఎందుకు అడగకూడదు? వారి పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నందుకు నిజంగా దుఃఖపడుతున్నానని దేవునితో చెప్పండి.

మీరు ఆ వ్యక్తిని క్షమించినప్పుడు క్రీస్తు కొరకు కేవలం ఆయనను సంతోషపరచడానికి ఇది చేస్తున్నారని జ్ఞాపకముంచుకోండి. ఎన్నడూ పగ తీర్చుకోనని, గత పాపాలను మరిముఖ్యంగా వారు పశ్చాత్తాపపడ్డ పాపాలను మరలా జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేయడమే క్షమాపణ. అంతర్గత తొందర వలన కలిగే బాధ నుండి బయటపడడానికి క్షమాపణ మీకు సహాయం చేస్తుంది.

అంతులేని బాధ, ద్వేషం, కోపం, ఆగ్రహం, స్వీయ నాశనమే క్షమాపణకు ప్రత్యామ్నాయము. అది అంత విలువైనదా?

Category

Leave a Comment