అద్భుతమైన కృప – ఎంతో మధురం

Posted byTelugu Editor June 27, 2023 Comments:0

(English version: Amazing Grace – How Sweet The Sound)

క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పాటలలో జాన్ న్యూటన్ వ్రాసిన ప్రసిద్ధిచెందిన పాట “ఆమేజింగ్ గ్రేస్” [అనగా అద్భుతమైన కృప]. ఒకప్పుడు చాలా పాపంలో జీవించిన జాన్ న్యూటన్‌కు దేవుని కృప చాలా అద్భుతంగా కనిపించింది, అది క్రైస్తవులకు అలాగే అనేకమంది క్రైస్తవేతరులకు కూడా సుపరిచితమైన ఈ అద్భుతమైన పాట వ్రాయడానికి దారితీసింది.

ఏదేమైనా, జాన్ న్యూటన్ ఈ పాట వ్రాయడానికి కొన్ని శతాబ్దాల ముందు, ఈ పాటలోని సత్యాలు తన జీవితంలోని చివరి ఘడియలలో కృప పొందుకున్న ఒక వ్యక్తిని బాగా ప్రతిబింబిస్తాయి. యేసు ప్రభువు సిలువమీద పలికిన ఏడు మాటలలో “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను” [లూకా 23:43] అని ఆయన పశ్చాత్తాపం చెందిన దొంగతో అన్న మాటలు అతడు తన చివరి ఘడియలో ఎలా కృప పొందుకున్నాడో వివరిస్తాయి. యేసు పెదవుల నుండి వచ్చిన ఈ మాటలు నిరాశకు గురైన అనేకమందికి నిరీక్షణనిచ్చాయి.

లూకా 23: 39-43 లో వ్రాయబడినట్లుగా, పశ్చాత్తాపం చెందిన ఏ పాపి అయినా దేవుని అద్భుతమైన రక్షణ కృప పొందుకోవడానికి ఇంకా ఆలస్యం కాలేదని ఈ సంఘటన మనకు బోధిస్తుంది. ఈ సంఘటన ద్వారా తెలియచేయబడిన పశ్చాత్తాపం గురించి, విశ్వాసం గురించి మరియు రక్షణ కృపతో వాటికున్న సంబంధానికి సంబంధించిన కొన్ని సత్యాలను నేర్చుకుందాము. తరువాత ఆ రెండింటిని అమలుపరచడం గురించి చూద్దాము.

I. తప్పుడు పశ్చాత్తాపానికి సాక్ష్యాలు [39].

పశ్చాత్తాపపడని నేరస్థుని ప్రవర్తన పరిశీలించిన తరువాత, తప్పుడు పశ్చాత్తాపాన్ని తెలియచేసే 2 లక్షణాలను మనము చూస్తాము.

1. దేవుని భయం లేదు: “వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా?” [లూకా 23:39] అన్నాడు. తానున్న స్థితిలో కూడా అతడు దేవునికి భయపడలేదు. చాలామంది అతనిలానే ఉన్నారు. పరిస్థితుల ద్వారా దేవుడు వారిని ఎంత అణచినా, వారు నీతిమంతుడైన దేవునికి భయపడరు. అంటే తమ పాపాలను విడిచిపెట్టేంతగా ఆయనకు భయపడరు.

2. భూసంబంధమైన ఆశీర్వాదాలపై మాత్రమే దృష్టి పెడతారు: పశ్చాత్తాపపడని దొంగ లూకా 23:39 లో “నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను”. అతడు తన పాపాల నుండి విముక్తి పొందాలని ఆలోచించడంలేదు. తాను ప్రస్తుతం అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి పొందడం పైనే అతని దృష్టి ఉంది. చాలామంది ఈ వ్యక్తిని పోలి ఉంటారు. వారు భూసంబంధమైన కొన్ని ప్రయోజనాల కోసం మాత్రమే క్రీస్తు దగ్గరకు వస్తారు: సమస్యలు పరిష్కరించబడాలని, సంబంధాలు సరిచేయబడాలని; ఇతరుల ఆమోదం పొందాలని; ఆరోగ్యం, సంపద, అభివృద్ధి పొందాలని మొదలైనవి. అయితే, క్రీస్తు వద్దకు రావడానికి ఇవన్నీ సరైన కారణాలు కావు.

II. నిజమైన పశ్చాత్తాపానికి సాక్ష్యాలు [40-42].

దీనికి విరుద్ధంగా, పశ్చాత్తాపపడిన నేరస్థుని ప్రవర్తన నిజమైన పశ్చాత్తాపాన్ని రుజువు చేసే 3 లక్షణాలను వెల్లడిస్తుంది.

1. దేవుని పట్ల నిజమైన భయము [40]. “అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?” [లుకా 23:40] అన్నాడు. మత్తయి 27:44, మార్కు 15:32 ప్రకారం, నేరస్థులు ఇద్దరూ మొదట్లో క్రీస్తును అవమానించారు. ఏదేమైనా, యేసు మాటలు ప్రవర్తన గమనించినప్పుడు ఒక నేరస్థుని హృదయం మృదువుగా మారింది. “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” తన శత్రువుల కోసం యేసు చేసి ప్రార్థన [లూకా 23:34] అతని హృదయంలో పని చేయడం ప్రారంభించింది. ఇవన్నీ దేవుని పట్ల ఆరోగ్యకరమైన భయానికి దారితీశాయి [సామె 1: 7]. దాని ఫలితంగా అతడు తన పాపాలను విడిచిపెట్టాడు.

2. పాపం ఒప్పుకోవడము [41]. “మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు” [లూకా 23:41]. పశ్చాత్తాపపడిన నేరస్థుడు తన పాపాలకు తన తల్లిదండ్రులను, సమాజాన్ని లేదా పరిస్థితులను నిందించలేదు. అతడు తన పాపాలకు తానే పూర్తి బాధ్యతను తీసుకున్నాడు అనడానికి, “మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము” అనే మాటలు నిదర్శనము.

3. విమోచన కోసం కేవలం క్రీస్తులో విశ్వాసం ఉంచడము [42]. “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను” [లూకా 23:42]. కేవలం పశ్చాత్తాపం ఎవరినీ రక్షించదు. నిజంగా పశ్చాత్తాపం చెందిన వారు తమ పాపాలను విడిచిపెట్టడమే కాకుండా తమ స్వంత ప్రయత్నాలతో రక్షణ పొందలేమని కూడా గుర్తిస్తారు. వారు పాపక్షమాపణ కోసం యేసును మాత్రమే విశ్వసిస్తారు [అపొ.కా 20:21]. పశ్చాత్తాపం చెందిన ఈ నేరస్థుడు చేసింది అదే.

ప్రభువుకు అతడు చేసిన మనవి నుండి కొన్ని సత్యాలను గమనించండి.

a. పునరుత్థానంపై నమ్మకము. యేసును సిలువపై చూసినప్పటికీ, యేసు తన రాజ్యాన్ని స్థాపించడానికి ఒక రోజు రాజుగా తిరిగి వస్తాడని అతడు పూర్తిగా నమ్మాడు. “నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు” [లూకా 23:42] అనే అతని మాటలు ఈ సత్యాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అది నిజమైన విశ్వాసానికి నిదర్శనము!

b. భవిష్యత్తు తీర్పుపై నమ్మకము. భవిష్యత్తులో, తన పాపాలకు తీర్పు తీర్చే న్యాయధిపతిగా యేసును ఎదుర్కుంటానని అతనికి తెలుసు [అపొ.కా 17: 30-31]. అందుకే, “నీవు  వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము” అని చెబుతున్నాడు.

c. రక్షణ కోసం మంచి పనులపై ఆధారపడలేదు. అతడు “నా మంచి పనులను గుర్తుంచుకో” అని చెప్పలేదు, కానీ “నన్ను గుర్తుంచుకో” అన్నాడు. అతడు రక్షణ కోసం తన మంచి పనులపై ఒక్కింత కూడా ఆధారపడలేదు కాని తన రక్షణ కోసం యేసుపై మాత్రమే ఆధారపడ్డాడు.

d. భూసంబంధమైన విడుదలపై దృష్టి పెట్టలేదు.  తనను సిలువ నుండి విడిపించమని అతడు యేసును వేడుకోలేదు [పశ్చాత్తాపపడని మరో నేరస్థుడు చేసినట్లుగా], కానీ రాబోయే జీవితంలో దయ చూపమని మాత్రమే వేడుకున్నాడు.

III. నిజమైన పశ్చాత్తాపం మరియు క్రీస్తులో విశ్వాసం యొక్క ఫలితాలు [43].

నిజమైన పశ్చాత్తాపం మరియు క్రీస్తుపై విశ్వాసం యొక్క సహజ పురోగతి దేవుని అద్భుతమైన కృపను స్వీకరించేలా చేస్తుంది. లూకా 23:43లో, “అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను” అని చదువుతాము. పశ్చాత్తాపపడిన నేరస్థుడు భవిష్యత్తులో ఎప్పుడో లభించే దయ కోసం ప్రయత్నించగా, అతడు తక్షణమే దయ పొందాడు. అతడు ఏ మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు, మరణం తర్వాతి శిక్షను భరించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, “నేడు” [ఈ రోజు] అనే పదం స్పష్టంగా సూచించినట్లుగా అతనికి తక్షణమే క్షమాపణ లభించింది. దేవుడు “అబద్ధం చెప్పడు” కనుక యేసు తప్పుడు వాగ్దానం చేయలేదు [తీతుకు 1: 2]. “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.” [రోమా 10:13], అది కూడా వెంటనే!

2 మనవులు.

1. దేవుని క్షమించే కృపను పొందడం ఎన్నటికీ ఆలస్యం కాదు.

పశ్చాత్తాపపడిన నేరస్థుడు ఈ సత్యానికి మంచి ఉదాహరణగా నిలుస్తాడు. మీరు ఎన్నడూ పశ్చాత్తాపపడకపోతే క్రీస్తును విశ్వసించకపోతే, అలాగే ఉండకండి. ఇది చదువుతున్న మీలో కొందరు “నేను ఎంతమాత్రం క్షమించరానివాడిని” అని అనుకోవచ్చు. మీరు అలా అనుకుంటే నిరాశ పడకండి. యేసు రక్తానికి ప్రతి పాపాన్ని క్షమించే శక్తి ఉంది.  సిలువ మరియు పునరుత్థానం మన పాపాలన్నిటికి క్షమాపణ గురించి దేవుని ఏర్పాటు  గురించి హామీ ఇస్తుంది. దీనిని చదువుతున్న కొందరు “నేను చివరి నిమిషం వరకు వేచి ఉండి, ఆపై నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను” అనుకోవచ్చు. అలాంటి ఆలోచన వలన అనేక ప్రమాదాలు ఉన్నాయి:

a. మీరు ఇప్పుడు మీ పాపాలను వదులుకోవడానికి ఇష్టపడకపోతే, భవిష్యత్తులో మీరు అలా చేయగలుతారని హామీ ఏమిటి? కాలం గడిచే కొలది హృదయం కఠినపర్చబడుతుంది .

b. మీరు ఎప్పుడు చనిపోతారో మీకు తెలియదు. గుర్తుంచుకోండి, ఒక నేరస్థుడు తన పాపాలను క్రీస్తుకు బదిలీ చేసి సిలువపై మరణించాడు; రెండవ నేరస్థుడు తన పాపాలలోనే సిలువపై మరణించాడు.. ఒక తెలివైన క్రైస్తవుడు ఇలా వ్రాశాడు, “ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేకుండా మరణపడక మీద పశ్చాత్తాపం చెందే అవకాశం మనకు ఉంది. మనకు ఒకటి మాత్రమే ఉంది, అది ఎవరూ ఊహించలేరు.”

2. క్రైస్తవుడిగా మారడం ఈ లోక సౌకర్యాలకు హామీ  ఇవ్వదు కానీ అద్భుతమైన పరలోక జీవితానికి హామీ ఇస్తుంది.

యేసు నుండి పాపక్షమాపణ పొందినప్పటికీ పశ్చాత్తాపపడిన నేరస్థుడు సిలువ వేదన నుండి విముక్తి పొందలేదు. మరో మాటలో చెప్పాలంటే, అతని భూసంబంధమైన సమస్యలు యేసు దగ్గరకు రావడం ద్వారా పరిష్కరించబడలేదు. ఏదేమైనా, అతని ఆశ ప్రస్తుత జీవితం మీద కాకుండా రాబోయే జీవితంమీద ఉంది కాబట్టి, అతడు జీవితంలో తన భాగ్యాన్ని  చాలా సంతోషంగా అంగీకరించాడు.

అదేవిధంగా, ప్రతి క్రైస్తవుడి నిజమైన నిరీక్షణ రాబోయే జీవితం గురించి ఉండాలి. అప్పుడు “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను” [ప్రక. 21: 4]. మనం సంతోషంగా “ఆయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” [2 పేతురు 3:13].

Category

Leave a Comment