రూపాంతరం చెందిన జీవితము 2వ భాగము—మన మనస్సులు క్రీస్తుకు సమర్పించుట

(English version: “The Transformed Life – Offering Our Minds To Christ”)
రోమా 12:1 లో దేవుని కనికరాన్ని పొందడం వలన తమ శరీరాలను సజీవ యాగంగా సమర్పించమని విశ్వాసులను పిలిచిన తర్వాత రోమా 12:2 లో వారి మనస్సులను కూడా సమర్పించమని పౌలు ఆజ్ఞాపించాడు. “మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”
మనస్సు దేవునికి లోబడక పోకపోతే, మనస్సు కోరుకున్నది చేసే శరీరాన్ని దేవునికి పరిశుద్ధమైన సంతోషకరమైన బలిగా సమర్పించలేము! అందుకే విశ్వాసులు నిజమైన పరివర్తనను కోరుకుంటే తమ మనస్సులను క్రీస్తుకు సమర్పించమని పౌలు పిలుపునిచ్చాడు. వైద్యరంగంలో డాక్టర్లు “నువ్వు ఏమి తింటావో నువ్వు అదే” అంటారు. అదే విధంగా, ఆధ్యాత్మికంగా, “మీరు ఏమాలోచిస్తారో అదే మీరు” అని బైబిలు చెబుతుంది. కాబట్టి, పౌలు మన ఆలోచనలన్నింటికీ మూలమైన మనస్సును ఉద్దేశించి, దానికి నిరంతరం నూతన పరచడం అవసరమని చెప్పాడు. అప్పుడే శరీరాన్ని అనుకూలమైన అర్పణగా సమర్పించవచ్చు.
ఈ వచనం సారాంశాన్ని 3 భాగాలుగా చేయవచ్చు: ఈ ఆజ్ఞలకు లోబడిన ఫలితంగా వచ్చే 2 ఆజ్ఞలు.
1వ ఆజ్ఞ: “మీరు ఈ లోకమర్యాదను అనుసరించకండి.” ఇది మనం ఏమి చేయకూడదు అనే దానిపై దృష్టి పెడుతుంది.
2వ ఆజ్ఞ: “మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” ఇది మనం ఏమి చేయాలి అనేదానిపై దృష్టి పెడుతుంది.
ఈ 2 ఆజ్ఞలకు లోబడిన ఫలితంగా “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటారు.” వీటిలో ప్రతి ఒక్కదానిని విపులంగా పరీక్షిద్దాము.
1వ ఆజ్ఞ: “మీరు ఈ లోకమర్యాదను అనుసరించకండి.”
ఒక మాదిరి ప్రకారం మారడాన్ని వర్ణించడానికి ఉపయోగించే పదం నుండి “అనుసరించడం” అనే పదం వచ్చింది. కుకీ పిండిని వివిధ ఆకారాలు ఉన్న ట్రేలో అచ్చులలో పోసినప్పుడు, ఆ ఆకారంలో కుకీలుతయారు అవుతాయి. అచ్చులో లేదా ట్రేలో ఉన్న ఆకారం కుకీల తుది రూపాన్ని నియంత్రిస్తుంది. అదే విధంగా, మనల్ని నియంత్రించడానికి లోకానికి అనుమతిస్తే, లోకం మనకు చెప్పిన ప్రకారం మనం జీవిస్తామనేదే పౌలు ఉద్దేశ్యము. J.B. ఫిలిప్స్ అనే వ్యక్తి ఈ వాక్యం గురించి లోకం మిమ్మల్ని దాని స్వంత అచ్చులోకి లాక్కోనివ్వకండి అని వ్రాశాడు.
మనం లోకాన్ని అనుసరించకూడదు అనడానికి కనీసం 4 కారణాలను బైబిలు వివరిస్తుంది.
కారణం #1. ప్రాథమికంగా, మనం మార్పుచెందిన కారణంగా మనం ఈ లోక సంబంధులం కాము కనుక మనం లోకాన్ని అనుసరించకూడదు.
యోహాను 17:16 లో యేసు తండ్రికి చేసిన ప్రార్థనలో, “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అన్నారు. మనం ఈ లోక సంబంధులం కాదు కనుక ఈ లోకాన్ని అనుసరించాలనే ఒత్తిడిని అడ్డుకోవాలి.
కారణం #2. సాతాను ఈ లోకానికి దేవుడు కనుక మనం లోకాన్ని అనుసరించకూడదు.
2 కొరింథీ 4:4 లో సాతానును ఈ యుగ సంబంధమైన దేవత అని వర్ణించారు. యోహాను 14:30లో యేసు సాతానును ఈ లోకాధికారి అని పిలిచారు. 1 యోహాను 5:19 లో “లోకమంతయు దుష్టుని ఆధీనంలో ఉన్నది” అని చెప్పబడింది. కాబట్టి, మనం ఈ లోకాన్ని అనుసరిస్తే మనం ఇంకా సాతాను నియంత్రణలో ఉన్నట్లే. అతని శక్తి నుండి మనం విడుదల పొందనట్లు జీవిస్తున్నాము.
కారణం #3. ఈ లోకం గతించిపోతోంది కనుక మనం లోకాన్ని అనుసరించకూడదు.
1 యోహాను 2:17 లో “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని చెప్పబడింది. అందుకే యోహాను ముందు వచనాలైన 15వ వచనంలో “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు” అని చెప్పాడు. మనం ఈ లోకానికి అనుగుణమైన జీవనశైలిని కలిగివుంటే మనం నిజంగా తండ్రిని ప్రేమించలేము, మనం నిజంగా రక్షింపబడలేదని దీని అర్థం. అలాగే ఈ లోకప్రజలతో పాటు మనమూ నశిస్తాము.
కారణం #4. సాక్ష్యాన్ని కోల్పోతాము కనుక లోకాన్ని అనుసరించకూడదు.
మనం “లోకానికి వెలుగు” [మత్తయి 5:14] కాబట్టి యేసు మనల్ని తన సాక్షులుగా ఉండమని పిలిచారు. మనం ఈ లోకానుసారంగా జీవిస్తే పంచడానికి వెలుగు ఉండదు. ఈ చీకటి ప్రపంచం మధ్య దేవుడు మనలను విడిచిపెట్టిన ఉద్దేశ్యాన్ని ఇది ఓడిస్తుంది.
కాబట్టి, మనం సజీవ యాగంగా ఉండాలంటే, లోకాన్ని అనుసరించాలనే ఒత్తిడిని నిరంతరం నిరోధించాలని పౌలు ఎందుకు నొక్కిచెప్పాడో ఈ 4 కారణాల ద్వారా మీరు చూస్తారు. అయితే అదొక్కటే సరిపోదు. ఈ వచనంలోని 2వ ఆజ్ఞయైన మీ మనస్సు మారి నూతనపరిచే దేవునికి మనం “అవును” అని కూడా చెప్పాలి. మనస్సు రూపాంతరం చెందినప్పుడే నిజమైన శాశ్వతమైన మార్పు సంభవిస్తుంది.
2వ ఆజ్ఞ: “మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”
మన ప్రయత్నాల ద్వారా మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము చెందలేము. ఈ వచనంలో పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన లేనప్పటికీ అది పరిశుద్ధాత్మ ద్వారానే మనకు వస్తుంది. “రూపాంతరం” మరియు “నూతనపరచుట” అనే రెండు పదాలను మనం నిశితంగా పరిశీలిస్తే ఈ సత్యం స్పష్టంగా కనిపిస్తుంది.
రూపాంతరం చెందుట. మెటామార్ఫోసిస్ అనే ఆంగ్ల పదం నుండి ఈ పదం వచ్చింది. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా లేదా తెర కప్ప కప్పగా ఎలా మారుతుందో వివరించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఒక రూపం మార్పు చెందడమనే భావన దీనిలో ఉంది. కొత్త నిబంధనలో ఇది మరో 2 సార్లు కనిపిస్తుంది.
మొదటిది మత్తయి 17:2 లో కనబడుతుంది, ఈ పదం రూపాంతర కొండపై పేతురు యాకోబు యోహానుల ముందు యేసు రూపాంతరాన్ని వివరించడానికి ఉపయోగించారు. రెండవది 2 కొరింథీ 3:18 లో కనబడుతుంది, “మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము” అని చదువుతాము.
విశ్వాసులు క్రీస్తు మహిమ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న కొలది అంత ఎక్కువగా విశ్వాసులను క్రీస్తులాగా మార్చుతున్న పరిశుద్ధాత్మ వర్ణన ఇక్కడ మనం చూస్తాము.
నూతనమగుట. ఈ పదం క్రొత్త నిబంధనలో మరొకసారి తీతు 3:5 లో మాత్రమే కనబడుతుంది. “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.” నూతన జన్మకు నూతనమగుటకు కారణం పరిశుద్ధాత్మ అని గమనించండి. నూతనమవ్వడం రూపాంతరం చెందించడం అనే రెండింటిని పరిశుద్ధాత్మ ఎలా చేస్తుందో మనం చూస్తాము. 12:2 లోని వాక్య నిర్మాణాన్ని బట్టి, మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందడం నిష్క్రియాత్మక అర్థంలో ఉంది, పరిశుద్ధాత్మ మాత్రమే మన ఆలోచనలలో, చివరికి మన పనులలో మార్పును తీసుకురాగలడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.
కాబట్టి, మన మనస్సులను మార్చే పరిశుద్ధాత్మ కార్యానికి లోబడాలని పౌలు విశ్వాసులకు పిలుపునిచ్చాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం: పరిశుద్ధాత్మ మార్పును కలిగిస్తున్నప్పుడు మన వంతుగా మనం ఆయనకు లోబడాలి. మన మనస్సులను మార్చడానికి మనం పరిశుద్ధాత్మను అనుమతించాలి. ఆయన మన ఇష్టానికి వ్యతిరేకంగా మనల్ని మార్చరు. దానిలో మానవుని బాధ్యత కూడా ఉంటుంది.
మనం సజీవ యాగంగా ఉండాలంటే మన మనస్సులను పూర్తిగా దేవుని సమర్పించడం ద్వారా మన ఆలోచనలో మార్పు రావాలని మనం కోరుకోవాలి. మార్పుచెందడానికి ముందు మనస్సు చెడిపోయిన స్థితిలో ఉంటుంది [ఎఫెసి 4:18] కాబట్టి మనస్సు నూతనపరచబడాలి. మార్పుచెందుతున్నప్పుడు దేవుడు నూతనపరిచే ప్రక్రియను ప్రారంభిస్తారు. మనస్సు నూతనమగుట అనేది జీవితకాల ప్రక్రియ. మనం పూర్తిగా క్రీస్తులా మారిన రోజున అది ముగుస్తుంది [1 యోహాను 3:2; ఫిలిప్పి 3:20-21]. ఈ సంఘటనను బైబిలులో మహిమపరచడం అని చెప్పబడింది [రోమా 8:30].
క్రీస్తు మహిమలు వ్రాయబడిన లేఖనాలను ఉపయోగించుకుని పరిశుద్ధాత్మ మనస్సును నూతనపరుస్తుందని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి, పరిశుద్ధాత్మ మన మనస్సులను మార్చడానికి బాహ్య లేఖనాలను ఉపయోగిస్తాడు. అంతే కాకుండా, ఆయన లేఖనాలను గ్రహించడమనే అంతర్గత జ్ఞానాన్ని కలిగించే పనిని కూడా చేస్తారు [1 కొరింథి 2:13-14]. ఆ విధంగా, క్రీస్తు మహిమలను మనం అర్థం చేసుకోవచ్చు.
బైబిలు సత్యాలు మనల్ని రక్షిస్తాయి; బైబిలు సత్యాలు మనలను నిరంతరం పవిత్రపరుస్తాయి. యేసే స్వయంగా తండ్రికి చేసిన ప్రార్థనలో, “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము” అన్నారు [యోహాను 17:17]. వారు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు లేఖనాలు వారి ఆలోచనలపై ఆధిక్యత సాధించి, సత్యాలను ఆచరణలో పెట్టడానికి తనకు సహాయం చేయమని ప్రార్థిస్తేనే తప్ప మనస్సు రూపాంతరం చెందదు.
తమ మనస్సును లోకానికి దాని వినోదాలకు ఎక్కువగా ఇస్తారు కాబట్టి చాలామంది క్రైస్తవులు రూపాంతరాన్ని కొంతమట్టుకే అనుభవిస్తారు. మీరు వారిని అవిశ్వాసిని పక్కపక్కనే ఉంచితే, వారి జీవనశైలి, కోరికలు, మాటల ఆధారంగా వారి మధ్య తేడా గుర్తించడం కష్టము. అందుకే విశ్వాసులు బైబిలు చదవడం, ప్రార్థన, సహవాసం, సేవ చేయడం, సువార్త ప్రకటించడం మరియు బైబిలును మెరుగ్గా వివరించే రచయితల పుస్తకాలను చదవడం వంటి ఆధ్యాత్మిక అంశాలకు ఉద్దేశపూర్వకంగా తమను తాము అంకితం చేసుకోవాలి. ఆ విధంగా, వారు మరింత ముఖ్యమైన ఆధ్యాత్మిక రూపాంతరం చెందుతారు.
ఆధ్యాత్మిక వృద్ధి దానంతట అదే జరగదని మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధత అనుకోకుండా కలుగదు. శారీరకంగా పెద్దవ్వడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి సమానం కాదు. విశ్వాసులు తమ మనస్సులను ప్రతిరోజూ సరైన ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. లోకానికి దాని ఆలోచనలకు మన జీవితాలను నియంత్రించడానికి అనుమతించి అదే సమయంలో, ఆధ్యాత్మిక క్రమశిక్షణలను అభ్యసించడానికి ప్రయత్నించలేము. అలాగే ఏదో ఒకవిధంగా పని జరిగి మనం ఆధ్యాత్మికంగా బలంగా బయటకు వస్తామని ఆశించకూడదు.
మనం ఏకకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నిస్తూ జంక్ ఫుడ్ తినడం కొనసాగించలేము! శరీరానికి పని చేయనిది ఆత్మకు కూడా పని చేయదు! పరిశుద్ధాత్మకు ‘అవును’ అని, లోకానికి ‘అవును’ అని చెప్పడం ద్వారా సమతుల్యత సాధించడానికి చాలామంది వ్యర్థంగా ప్రయత్నించారు. బైబిలు వారిని “వ్యభిచారులు” అని పిలుస్తుంది [యాకోబు 4:7]. లోకానికి కాదు అని చెప్పకుండా పరిశుద్ధాత్మకు ‘అవును’ అని చెప్పడం విపరీతమైన నిరాశకు దారి తీస్తుంది.
కాబట్టి, పరిశుద్ధాత్మ యొక్క రూపాంతరపరిచే కార్యానికి మన మనస్సులు లోబరచి దైవభక్తిలో శిక్షణ పొందేందుకు మనం ఈ రోజు నుండి సంకల్పించుకోవాలి. ఫిలిప్పి 4:8 లోని “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి” అనే సత్యాలను మనం నిరంతరం ఆచరణలో పెట్టాలి. మన ఆలోచనల ఫలితమే మనము. కాబట్టి మన మనస్సులను సరైన ఆలోచనలతో నింపడం చాలా అవసరం.
అయినప్పటికీ, బాహ్యంగా చెడు చేయని చాలామంది ధైర్యంగా తమ ఆలోచనలలో పాపం చేస్తారు. అవి కామం, ద్వేషం, ఇతరులపై చెడు కోరికలు, దురాశ, ప్రాపంచిక విజయం మరియు అధికారం, అసూయ మొదలైన ఆలోచనలు. మన ఆలోచనలను ఆచరణలో పెట్టనంతకాలం అలా ఆలోచించడం వలన ఏ సమస్య ఉండదని మనల్ని మనం మోసం చేసుకుంటాము. దేవుడు ఆలోచనలను కూడా తీర్పుతీరుస్తాడని, సజీవయాగంలో స్వచ్ఛమైన మనస్సు కూడా ఉందని మనం గుర్తుంచుకోవాలి! అంతేకాకుండా, మన ఆలోచనలను ఇప్పుడు లేదా తరువాత మనం అమలు చేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మనం ఏది ఆలోచిస్తామో అదే మనమే!
కాబట్టి, మన మనస్సులు పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం రూపాంతరం చెందడానికి నూతనపరచడానికి ఇవ్వడం చాలా ముఖ్యము. దాని ఫలితాన్ని వచనంలోని 3వ భాగం స్పష్టంగా పేర్కొంది.
1, 2 ఆజ్ఞలను పాటించడం వలన పర్యవసానం: “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలుగుతాము.”
“పరీక్షించండి మరియు తెలుసుకోండి” అనే పదం లోహాల విలువను గుర్తించే పరీక్ష ప్రక్రియను వివరించడానికి ఉపయోగించబడింది. ఇక్కడ పౌలు చెప్పేదేమిటంటే: మనం మన మనస్సులను దేవుని సత్యం ద్వారా నూతనపరచబడినప్పుడు, “మన జీవితాలకు ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి” తెలుసుకోగలుగుతాము. ఇక్కడ దేవుని చిత్తం అనేది లేఖనాల ద్వారా స్పష్టంగా వెల్లడి చేయబడిన దేవుని చిత్తం గురించి గొప్ప అవగాహనను మరియు రోజువారీ జీవిత విషయాలలో దేవుని చిత్తం గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటుంది.
తొందర తొందరగా బైబిల్ చదవడం, ఒక వాక్యాన్ని లేదా భాగాన్ని ధ్యానించడానికి అరుదుగా సమయం కేటాయించడం, శరీరం అలసిపోయి కళ్ళు మూతలు పడుతూ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని నిమిషాల ప్రార్థన చేయడం వలన మనం మనస్సు రూపాంతరం కోరుకుంటే అది జరుగదు. అలాంటి జీవనశైలిని మనం కలిగివుంటే మనం పశ్చాత్తాపపడాలి. లేఖనాలను సరిగ్గా చదవడానికి మరియు ప్రార్థించడానికి సమయం కేటాయించడంలోని ప్రాముఖ్యత గురించి మనల్ని కదిలించమని దేవుడిని అడగాలి. ఇక్కడ సమయం లేకపోవడం ప్రశ్న కాదు. మనకు నచ్చిన లేదా ముఖ్యమైనవని భావించే వాటిని చేయడానికి మనం ఎప్పుడూ సమయాన్ని కేటాయిస్తాము. మన మనస్సులను పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం చెందడం కంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా?
ప్రజలు తరచుగా తమ జీవితాలలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు కాని తమ శరీరాలను మనస్సులను సజీవ యాగంగా సమర్పించడానికి నిరాకరిస్తారు. దేవుడు స్పష్టంగా చెప్పిన ఆజ్ఞలకు విధేయత చూపడానికి వారు ఖచ్చితంగా నిరాకరిస్తున్నప్పుడు, జీవిత సమస్యలలో ప్రజలను ఆయన ఎందుకు మార్గం చూపిస్తారు? కాబట్టి, మన జీవితంలో దేవుని చిత్తాన్ని అనుభవించాలని మనం కోరుకుంటే, మన శరీరాలను మనస్సులను 24/7 దేవునికి ఇవ్వడానికి మనం కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. కానీ అది ఆ ప్రయోజనం కోసం మాత్రమే కాదు. ఆయనకు ఇష్టమైన ఆరాధన చేయాడానికి ఇది ఏకైక మార్గము. ఆయన కృపలన్నిటిని ముఖ్యంగా సిలువపై చూపించిన ఆయన ప్రేమను రుచి చూడడానికి అదే ఉత్తమమైన ఏకైక మార్గము. దేవుని కుమారుడు మన పాపాలకు శిక్షను భరించడం ద్వారా మనం నరకం నుండి రక్షించబడ్డాము. పరలోకంలో ఆయనతో పాటు శాశ్వత జీవితాన్ని అనుభవిస్తాము.